ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Medical Faculty Scandal: అమ్మకానికి వైద్యుల పోస్టులు

ABN, Publish Date - Jul 14 , 2025 | 04:48 AM

నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ బూచి చూపించి.. రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీ పేరుతో ‘అమ్మకానికి’ భారీ స్కెచ్‌ నడుస్తోంది! ఒక్కో పోస్టును రూ.20 నుంచి రూ.25 లక్షల వరకు ధర నిర్ణయించారని...

  • కాంట్రాక్టు పద్ధతిలో బోధనాసుపత్రుల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్ల భర్తీ

  • డీఎంఈ కీలక అధికారి భారీ ‘మనీ స్కెచ్‌’

  • ఒక్కో పోస్టుకు రూ.20-25 లక్షల ధర నిర్ణయం

  • ఇప్పటికే 15 మందితో బేరాలు.. ఒప్పందాలు

  • పేరుకు 17న ఇంటర్వ్యూలు.. అక్కడే పోస్టింగ్‌ ఆర్డర్లు

  • కాంట్రాక్టు భర్తీని వ్యతిరేకిస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

  • నోటిఫికేషన్‌ రద్దుకు వైద్యులు, జీడీఏ డిమాండ్‌

అమరావతి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ బూచి చూపించి.. రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీ పేరుతో ‘అమ్మకానికి’ భారీ స్కెచ్‌ నడుస్తోంది! ఒక్కో పోస్టును రూ.20 నుంచి రూ.25 లక్షల వరకు ధర నిర్ణయించారని, ఇప్పటికే బేరసారాలు, ఒప్పందాలు జరిగినట్లు తెలిసింది. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) పరిధిలోని బోధనాసుపత్రుల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిన భర్తీ చేసేందుకు అధికారులు ఇటీవల నోటిషికేషన్‌ జారీచేశారు. డీఎంఈ చరిత్రలోనే తొలిసారిగా కాంట్రాక్టు పద్ధతిలో 77 మంది వైద్యుల పోస్టులు భర్తీకి సిద్ధమయ్యారు. ఈ నోటిఫికేషన్‌ వెనుక ఓ కీలక అధికారి ‘మనీ ప్లాన్‌’ ఉన్నట్లు తెలుస్తోంది. డీఎంఈ పరిధిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి మాత్రమే అవకాశం ఉంటుంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరి మూడు వేల మందికి పైగా వైద్యులు వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వీరందరికీ పదోన్నతులు కాదని ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ క్యాడర్‌లో కాంట్రాక్టు వైద్యులను తీసుకువస్తున్నారు.

ఒక్కో విభాగం పోస్టుకు ఒక్కో రేటు!

77 పోస్టుల్లో సగానికిపైగా అమ్మకానికి పెట్టేశారు. డీంఎఈలో విధులు నిర్వహిస్తున్న ఓ కీలక అధికారి ఇప్పటికే 15 మంది వైద్యులతో బేరాలు జరిపి, ఒప్పందాలు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. క్లినికల్‌ విభాగాలకు ఒక రేటు, నాన్‌ క్లినికల్‌ విభాగాలకు మరో రేటు నిర్ణయించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న మరో ఇద్దరు వైద్యులు ఈ బేరాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరు ప్రైవేటు వైద్యులను సంప్రదించడం, ఆ తర్వాత వారిని డీఎంఈ కార్యాలయానికి తీసుకువచ్చి ఆ కీలక అధికారితో మాట్లాడించడం జరుగుతోంది. ఇప్పటికే 15 మంది నుంచి భారీగా వసూళ్లు చేసినట్లు సమాచారం. ఎన్‌ఎంసీ మార్గదర్శకాలను చూపిస్తూ.. 17న వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు అంటూ.. తెరవెనుక జరగాల్సిన తతంగాన్ని మాత్రం పూర్తి చేస్తున్నారు. ఇంటర్వ్యూల్లో ఎంపిక చేసినట్లు చూపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

‘కాంట్రాక్ట్‌’ భర్తీతో తీవ్ర నష్టం

కాంట్రాక్ట్‌ పద్ధతిన ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయడం వల్ల జరిగే నష్టం అంతాఇంతా కాదు. భవిష్యత్తులో కోర్టు కేసులు పడి, కొన్నేళ్ల పాటు వైద్యులు పదోన్నతులు లేకుండా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో వైఎ్‌సఆర్‌ సమయంలో రిమ్స్‌లు ఏర్పాటు చేసి, ఇలానే కాంట్రాక్ట్‌ పద్ధతిన వైద్యులను నియమించారు. అప్పటి నుంచి డీఎంఈలో వైద్యుల సర్వీసులు, పదోన్నతుల సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఇప్పుడు కాంట్రాక్ట్‌ పద్ధతిన నియామకాలు చేపడితే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్‌ నియామకాలను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం నియామకాలు చేపట్టే వారు జేబులు నింపుకొని 2-3 ఏళ్లలో రిటైరై వెళ్లిపోతారని, భవిష్యత్తులో తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్‌ రద్దుకు డిమాండ్‌ చేస్తున్నారు.

ఆరోగ్య మంత్రికి ప్రభుత్వ వైద్యుల సంఘం లేఖ

కాంట్రాక్ట్‌ పద్ధతిన ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీని తక్షణమే నిలుపుదల చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు ప్రభుత్వ వైద్యుల సంఘం (జీడీఏ) విన్నవించింది. ఈ మేరకు ఆదివారం మంత్రికి లేఖ అందించింది. కాంట్రాక్ట్‌ నియామకాల వల్ల రెగ్యులర్‌ వైద్యులు ఇబ్బందులు పడతారని సంఘం నేతలు వివరించారు. ఇప్పటికే వైద్యులకు పదోన్నతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వైద్యులందరికీ ముందుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. ప్రస్తుతం డీఎంఈ సిద్ధం చేసిన సీనియార్టీ జాబితాల్లో బోధనాసుపత్రుల్లో ఉన్న ఖాళీల కంటే ఎక్కువ మంది పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 04:53 AM