CBI Investigation: వైద్య కళాశాలల స్కాంలో.. బత్తల రింగ్‌మాస్టర్
ABN, Publish Date - Jul 05 , 2025 | 04:28 AM
దేశవ్యాప్తంగా జరిగిన మెడికల్ కళాశాలల స్కాంలో శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన వైసీపీ నేత డాక్టర్ బత్తల హరిప్రసాద్ రింగ్ మాస్టర్ అని తేలింది. జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) అధికారులు, మెడికల్ కాలేజీల యాజమాన్యాలకు మధ్య ఆయన బ్రోకర్‌గా వ్యవహరిస్తూ..
సజ్జల, మిథున్‌రెడ్డిలకు హరిప్రసాద్ సన్నిహితుడు
చెన్నై కేంద్రంగా అక్రమ వ్యవహారాలు
ఎన్‌ఎంసీ అధికారులతో సత్సంబంధాలు
కన్సల్టెంట్ పేరుతో దళారీ అవతారం
మెడికల్ కాలేజీల అనుమతులు, సీట్ల కోసం లంచాలు
భారీగా రూ.కోట్లు సంపాదించిన హరిప్రసాద్
గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ కోసం ప్రయత్నాలు
సీబీఐ దర్యాప్తులో వెలుగులోకి అక్రమాలు
పుట్టపర్తి/కదిరి, జూలై 4(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా జరిగిన మెడికల్ కళాశాలల స్కాంలో శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన వైసీపీ నేత డాక్టర్ బత్తల హరిప్రసాద్ రింగ్ మాస్టర్ అని తేలింది. జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) అధికారులు, మెడికల్ కాలేజీల యాజమాన్యాలకు మధ్య ఆయన బ్రోకర్‌గా వ్యవహరిస్తూ.. ఆయన రూ.కోట్లు గడించారన్న అభియోగంతో సీబీఐ ఆయనతో పాటు 36 మందిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఈ నెల 1న కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని ఆయన నివాసంపై దాడులు నిర్వహించింది. రోజంతా సోదాలు చేసింది. ఆయన పడక గదిని సీజ్ చేసింది. ఆయన డైరీని సీబీఐ అధికారులు తీసుకెళ్లినట్లు సమాచారం. అనేక మెడికల్ కాలేజీల్లో వసతులు లేకపోయినా, తగినంతమంది బోధనా సిబ్బంది లేకపోయినా.. ఎన్‌ఎంసీ తనిఖీ బృందాలకు, కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులకు లంచాలు ముట్టజెప్పి అనుమతులు ఇప్పించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌ఎంసీ తనిఖీల సమాచారాన్ని ముందుగానే కాలేజీలకు చేరవేయడం, తనిఖీల్లో అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు లంచాలు ఇవ్వడం, కాలేజీల అనుమతుల పునరుద్ధరణ కోసం లేఖలు ఇవ్వడం, ముడుపులు ముట్టజెప్పడం వంటి అనేక అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ గుర్తించింది. హరిప్రసాద్‌ది సామాన్య కుటుంబం. ఆయన తండ్రి బత్తల వెంకటరమణ సర్పంచ్‌గా పనిచేశారు. సోదరుడు కూడా డాక్టరే. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో చదువుకున్న హరిప్రసాద్.. కొన్నిరోజులు అక్కడే పనిచేశారు.
ఆ తర్వాత చెన్నై వెళ్లిపోయారు. అక్కడే ‘మెడికల్’ దందాలోకి దిగినట్లు సమాచారం. చెన్నైలో ఉంటూ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు సహా వేర్వేరు రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల వ్యవహారాల్లో గోల్‌మాల్ చేశారని, ఆ కాలేజీలకు అనుమతులు, సీట్లు, డమ్మీ బోధనా సిబ్బందిని సమకూర్చడం వంటి పనులు చేస్తున్నారన్నవి అభియోగాలు. కన్సల్టెంట్ పేరుతో వివిధ రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీలతో పరిచయం పెంచుకున్నారు. చెన్నై కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు, ఢిల్లీకి తరచూ వెళ్లేవారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఆయనకు తిరుపతిలో పెద్ద ఆస్పత్రి, హైదరాబాద్‌లోనూ ఓ ఆస్పత్రి, చెన్నైలో హోటల్ సహా రూ.కోట్ల విలువైన అనేక ఆస్తులు ఉన్నాయని కుటుంబ సభ్యులు బాహాటంగానే చెబుతుంటారు. వైసీపీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డికి, ఎంపీ మిఽథున్‌రెడ్డికి బత్తల సన్నిహితుడు కూడా. అక్రమాలతొం రూ.కోట్లు గడించాక హరిప్రసాద్ చూపు రాజకీయం వైపు కూడా మళ్లింది. 2024 ఎన్నికల్లో కదిరి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేయడానికి ప్రయత్నించారు. కానీ టికెట్ లభించలేదు. సీబీఐ కేసుపై వైసీపీ నాయకులు నోరు మెదపడంలేదు.
Updated Date - Jul 05 , 2025 | 08:49 AM