మాయ ‘బంగారం’
ABN, Publish Date - May 29 , 2025 | 01:38 AM
సాధారణంగా ఎవరైనా డబ్బులతో చిట్టీలను నిర్వహిస్తారు. విజయవాడకు చెందిన ఓ వ్యక్తి మాత్రం బంగారంతో చిట్టీలు నిర్వహించాడు. చివరికి డబ్బులు చెల్లించిన వారిని నిలువునా ముంచేశాడు.
గోల్డ్ చిట్టీల పేరుతో మోసం
ఎగబడి నగదు చెల్లించిన జనం
తాళం వేసిన నిర్వాహకుడు
పోలీసులను ఆశ్రయించిన బాధితులు
విజయవాడ, మే 28 (ఆంధ్రజ్యోతి) : సాధారణంగా ఎవరైనా డబ్బులతో చిట్టీలను నిర్వహిస్తారు. విజయవాడకు చెందిన ఓ వ్యక్తి మాత్రం బంగారంతో చిట్టీలు నిర్వహించాడు. చివరికి డబ్బులు చెల్లించిన వారిని నిలువునా ముంచేశాడు. విజయవాడ అయోధ్యనగర్ లోటస్‌కు చెందిన ముచ్చెర్ల శ్రీనివాసరావు చిట్టీల వ్యాపారాన్ని ఐదేళ్ల క్రితం ప్రారంభించాడు. డబ్బులతో నిర్వహించే చిట్టీలతోపాటు బంగారం చిట్టీలను మొదలుపెట్టాడు. కొంతమందితో గ్రూపును ఏర్పాటు చేసి 25 నెలల కాలానికి చిట్టీలను నిర్వహించాడు. ప్రతి నెల గ్రూపులో ఉన్న అందరి పేర్లతో లక్కీడ్రా తీసేవాడు. అందులో ఇద్దరు విజేతలను ఎంపిక చేసేవాడు. ఈ ఇద్దరికి చెరో 100 గ్రాముల బంగారాన్ని ఇచ్చేవాడు. ఇలా 25 నెలలు పూర్తయ్యే వరకు ఆ బంగారానికి సంబంధించిన సొమ్మును చెల్లించాలి. ఇవి కాకుండా రూ.లక్ష నుంచి రూ.10-20లక్షల చిట్టీలను నిర్వహించాడు. కొంతమంది నుంచి రూపాయి వడ్డీ చెల్లించేలా లక్షలాది రూపాయలను అప్పు తీసుకున్నాడు. ఐదేళ్లపాటు క్రమంగా చెల్లింపులు చేస్తూ ఖాతాల సంఖ్యను పెంచుకున్నాడు. చివరికి లోటస్‌లో ఉన్న ఇంటికి తాళాలు వేసి పరారయ్యాడు. దీనితో బాధితులు అజితసింగ్‌నగర్, సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావు తమను రూ.7 కోట్లకు మోసం చేశాడని సత్యనారాయణపురం పీఎస్‌లో, రూ.30 కోట్లకు మోసం చేశాడని అజితసింగ్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Updated Date - May 30 , 2025 | 03:06 PM