ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP Corruption: ఉపాధిలో దోచేశారు

ABN, Publish Date - Jul 28 , 2025 | 03:49 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకాన్ని భ్రష్టు పట్టించారు. జగన్‌ సర్కార్‌ నిబంధనలను తుంగలో తొక్కి ఉపాధి నిధులను వైసీపీ కార్యకర్తలకు ఫలహారంగా పంచిపెట్టినట్లు జాతీయ స్థాయి మానిటరింగ్‌ బృందం తనిఖీల్లో తేలింది.

  • అనుమతి లేని జగనన్న కాలనీల చదును పనులు

  • యథేచ్ఛగా తప్పుడు మస్టర్లు.. నిధుల స్వాహా

  • రికార్డులు లేకుండా పనుల అప్పగింత.. జీఎస్టీ ఎగవేత

  • జగన్‌ ప్రభుత్వ హయాంలో పథకం దుర్వినియోగం

  • జాతీయ స్థాయి మానిటరింగ్‌ బృందం తనిఖీల్లో వెల్లడి

వైసీపీ పాపాలు

కుక్క పిల్ల, సబ్బు బిళ్ల, అగ్గి పుల్ల.. కవితకు కాదేదీ అనర్హం అన్నట్టుగా.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలకు కాదేదీ అనర్హం అన్నట్లుగా వ్యవహరించారు. పలు మార్గాల్లో పై స్థాయి నుంచి కింది స్థాయి నేతల వరకు ప్రభుత్వ సొమ్ము దోచుకొని.. దాచుకున్నారు. ఈ కోవలోనే గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ‘ఉపాధి’ హామీ పథకంలోనూ మెక్కేసిన విషయం, నిధులను దుర్వినియోగం చేసిన వైనం జాతీయ స్థాయి మానిటరింగ్‌ బృందం తనిఖీల్లో తేటతెల్లమైంది. మరో వైపు కొవిడ్‌ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లించినట్లు తేలింది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకాన్ని భ్రష్టు పట్టించారు. జగన్‌ సర్కార్‌ నిబంధనలను తుంగలో తొక్కి ‘ఉపాధి’ నిధులను వైసీపీ కార్యకర్తలకు ఫలహారంగా పంచిపెట్టినట్లు జాతీయ స్థాయి మానిటరింగ్‌ బృందం తనిఖీల్లో తేలింది. అనుమతి లేని జగనన్న కాలనీల చదును పనులు చేశారని, తప్పుడు మస్టర్ల ద్వారా నిధులు స్వాహా చేశారని, రికార్డులు లేకుండా పనులు అప్పగించారని వెల్లడైంది. రాష్ట్రంలో ఉపాధి పథకం తప్పుదారి పట్టిందని ‘ఆంధ్రజ్యోతి’ గతంలో పలు కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. జగనన్న కాలనీల చదును పేరిట రూ.1,500 కోట్ల ఉపాధి నిధులు దుర్వినియోగమయ్యాయని, ఉపాధి పథకంలో అనుమతి లేకపోయినా ఊరి అవతల, కొండల్లో, చెరువుల్లో మట్టి తోలి నిధులు దుర్వినియోగం చేసిన విషయాన్ని చెప్పింది. అదే ఇప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల తనిఖీల్లోనూ వెల్లడైంది. జగనన్న కాలనీల చదును పనులు, పంచాయతీ భవనాలు, రోడ్లకు సంబంధించి రాష్ట్రస్థాయి విచారణ చేపట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు. రూ.కోటికి పైగా అంచనాతో చేపట్టిన పనుల్లో జరిగిన అవినీతికి సంబంధించి రికవరీలు చేపట్టాలన్నారు.

నిబంధనలను తుంగలో తొక్కి మరీ..

ఏపీలో గతంలో ఉపాధి హామీ పథకం పనులు ఎలా నిర్వహించారన్న దానిపై జాతీయ స్థాయి మానిటరింగ్‌ బృందాలు ఇటీవల తనిఖీలు చేపట్టాయి. శ్రీకాకుళం, తిరుపతి, కాకినాడ, అనంతపురం జిల్లాల్లో పనుల తీరును పరిశీలించింది. గత వైసీపీ ప్రభుత్వం ‘ఉపాధి’ నిధులను దోచుకున్నట్లు వెల్లడైంది. అనుమతి లేకపోయినా ఇష్టారీతిన జగనన్న కాలనీల చదును పనులు చేపట్టారని అధికారులు తేల్చారు. పట్టు పరిశ్రమల షెడ్‌లు, పరిమితికి మించి పంచాయతీల భవనాల నిర్మాణాలతో నిబంధనను తుంగలో తొక్కారని పేర్కొన్నారు. గతంలో గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించిన చోటనే సచివాలయాల భవనాల కోసం పంచాయతీ భవనాల పేరిట మళ్లీ మంజూరు చేశారని పేర్కొన్నారు. పూల తోటల పెంపకం లాంటి కార్యక్రమాలు ఉపాధి పథకంలో లేకపోయినా చేపట్టి నిధులు దుర్వినియోగం చేశారని తెలిపారు. పంచాయతీ ప్రణాళికలు, గ్రామసభ తీర్మానాలు లేకుండానే అడ్డగోలుగా పనులు ఎంపిక చేశారని పేర్కొన్నారు. గ్రామసభ ప్రాధాన్యతలు, ప్రాజెక్టు నివేదికలు లేకపోవడం, పనుల జియోట్యాగింగ్‌లో తప్పులు, వర్క్‌ఫైల్స్‌ నిర్వహణ లోపభూయిష్టం, ప్రొక్యూర్‌మెంట్‌ రికార్డులు లేమి ఈ తనిఖీల్లో బయటపడ్డాయి. జీఎస్టీ ఇన్‌వాయి్‌స లేకుండానే బిల్లులు చెల్లించడం, కొన్ని గ్రామ పంచాయతీలు నిర్వహించినట్లు చూపించినా.. అకౌంట్ల నిర్వహణ చేయకపోవడం కనిపించింది. మెటీరియల్‌ ప్రొక్యూర్‌మెంట్‌కు టెండర్లు చేపట్టలేదని పేర్కొన్నారు. వాస్తవంగా పనులు జరిగిన దానిపై ప్రజల అభిప్రాయానికి, సోషల్‌ ఆడిట్‌ నివేదికకు సంబంధం లేకపోవడం, వర్క్‌సైట్‌ బోర్డులు ఎక్కడా కనిపించలేదని పేర్కొన్నారు.

తప్పుల లిస్టు చాలా పెద్దది!

వైసీపీ హయాంలో శ్రామికులతో కుంటలు, చెరువులు తవ్వినట్లు మస్టర్లు నమోదు చేసినప్పటికీ ఎక్కడా పూడికలు తీసినట్లు కనపడలేదు. కొన్నిచోట్ల సిమెంట్‌రోడ్లు ఒకచోట మంజూరు కాగా.. మరోచోట పనులు చేపట్టారు. ఉపాధి పథకంలో పట్టుపురుగుల షెడ్‌ల నిర్మాణం అనుమతి లేదు. పొలంలో సెరికల్చర్‌ మొక్కలు లేకపోయినా భవనాలను నిర్మించి నిధుల దుర్వినియోగం చేశారు. లేబర్‌-మెటీరియల్‌ నిష్పత్తి నిర్వహణలో, పేదలకు ఉపయోగపడే పనులు చేపట్టడంలో విఫలమయ్యారు. పలుచోట్ల ఎన్‌ఎంఎంఎ్‌స యాప్‌ను దుర్వినియోగం చేశారు. సోషల్‌ ఆడిట్‌ అసలే చేపట్టకపోవడం, చేపట్టినా లోపభూయిష్టంగా చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి గ్రామ పంచాయతీ భవనాలకు రూ.20 లక్షల కంటే ఎక్కువ నిధులు వినియోగించారు. ఉపాధి పథకంలో హెల్త్‌ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలకు అనుమతులు లేకపోయినా నిర్మించారు. పూర్తి మెటీరియల్‌ నిధులు గ్రామ పంచాయతీకి బదిలీ చేశారు. ఆ నిఽధుల విడుదలకు లెక్కలు లేవు. వ్యవసాయానికి యోగ్యత లేని భూములను సాగుకు ఉపయోగపడేలా మాత్రమే భూమి అభివృద్ధి పనులు చేపట్టాలి. అయితే గత ప్రభుత్వంలో సాగులో ఉన్న భూమికి కూడా పనులు చేపట్టారు. కొన్నిచోట్ల ఉపాధి పథకంలో చేపట్టాల్సిన పనులను పంచాయతీరాజ్‌శాఖ ద్వారా నిర్వహించారు. స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాల సేకరణ కేంద్రాలను ఉపాధి నిధులతో నిర్మించినప్పటికీ.. వాటిని అమూల్‌కు అప్పగించారు.

తనిఖీల్లో జిల్లాల వారీగా వెల్లడైన అంశాలు..

శ్రీకాకుళం జిల్లాలో పనులు నిబంధనలు ప్రకారం జరగలేదని తనిఖీ బృందం నివేదిక ఇచ్చింది. తిరుపతి జిల్లాలో నిధుల దుర్వినియోగం జరిగింది. తప్పుడు మస్టర్లు నమోదు చేశారని పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో వేతనాల కంటే మెటీరియల్‌ పనుల నిష్పత్తి ఎక్కువగా ఉంది. అనుమతి లేని మౌలిక వసతుల పనులు చేపట్టారు. అప్రాధాన్యత పనులు చేపట్టడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీరాజ్‌ కన్వర్జెన్స్‌ ద్వారా పనులు చేపట్టారని వెల్లడించారు. అనంతలో సిమెంట్‌రోడ్లు, డ్రైన్లు ప్రణాళిక లే కుండా నిర్మించారని, సోషల్‌ ఆడిట్‌ ఈ పను ల తనిఖీల్లో విఫలమైందని పేర్కొన్నారు.

Updated Date - Jul 28 , 2025 | 03:50 AM