Pinnelli Brothers: మాచర్లలో మైనింగ్ దందా
ABN, Publish Date - Jul 11 , 2025 | 03:39 AM
గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. కూటమి ప్రభుత్వం విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
గత ప్రభుత్వంలో పిన్నెల్లి సోదరుల అక్రమాలు రట్టు
గ్రావెల్ తవ్వకాల్లోనే 100 కోట్ల దోపిడీ
9 లక్షల క్యూబిక్ మీటర్లలో అక్రమ తవ్వకాలు
అటవీ, రెవెన్యూ భూముల్లో యథేచ్ఛగా లూటీ
కూటమి ప్రభుత్వం విచారణలో వెలుగులోకి
క్వార్ట్జ్, నాపరాయి తవ్వకాలపైనా విచారణ
వీటిపై 70 కోట్లు పెనాల్టీ విధించే అవకాశం
(గుంటూరు సిటీ-ఆంధ్రజ్యోతి)
గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. కూటమి ప్రభుత్వం విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నాడు అధికారం అడ్డు పెట్టుకుని అటవీ, రెవెన్యూ భూముల్లో యథేచ్ఛగా పెద్దఎత్తున మైనింగ్ దందా సాగించినట్టు తేలింది. మాచర్ల నియోజకవర్గంలోని మూడు మండలాల్లో పిన్నెల్లి సోదరులు 9.50 లక్షల క్యూబిక్ మీటర్లలో రూ.100 కోట్ల విలువైన అక్రమ గ్రావెల్ తవ్వకాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పిన్నెల్లి సోదరులు దుర్గి మండలంలోని ఆత్మకూరు, నిదానంపాడు, మాచర్ల మండలంలోని రాయవరం, అలుగురాజుపల్లి, తాళ్లపల్లి, వెల్దుర్తి మండలంలోని గుడిపాడు చెరువులో గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. దుర్గి మండలంలోని నిదానంపాడు, మాచర్ల మండలంలోని తాళ్లపల్లిలో అటవీ శాఖకు చెందిన భూములను ఆక్రమించి మరీ గ్రావెల్ క్వారీలు నిర్వహించారు. అక్కడ తీసిన గ్రావెల్‌ను కొత్తగా నిర్మించే సిమెంట్ ఫ్యాక్టరీలు, ప్రభుత్వ రోడ్లకు సరఫరా చేసి సొమ్ము చేసుకున్నారు. నియోజకవర్గంలో మరికొన్ని చోట్ల గ్రావెల్ తవ్వకాలు జరిగాయి. అవి కూడా పిన్నెల్లి కనుసన్నల్లోనే జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
ఇవీ అక్రమాలు...
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పిన్నెల్లి సోదరుల అక్రమ మైనింగ్ దందాపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టారు. భారీగా అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు నిగ్గు తేల్చారు. అధికారుల అంచనా ప్రకారం...
మాచర్ల మండలంలోని రాయవరం, అలుగురాజుపల్లి, తాళ్లపల్లిలో 5 లక్షలా 17 వేల క్యూబిక్ మీటర్లలో గ్రావెల్ తవ్వకాలు జరిపారు. మొత్తం రూ.35 కోట్ల విలువ చేసే గ్రావెల్ తరలించారు.
దుర్గి మండంలోని నిదానంపాడు, ఆత్మకూరులో 2 లక్షలా 55 వేల క్యూబిక్ మీటర్లలో గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. మొత్తం రూ.20 కోట్ల విలువ చేసే గ్రావెల్ తవ్వారు.
వెల్దుర్తి మండలంలోని గుడిపాడు చెరువులో 1 లక్ష 33 వేల క్యూబిక్ మీటర్లలో గ్రావెల్ తవ్వకాలు జరిపారు. ఈ ప్రాంతంలో రూ.45 కోట్ల విలువ చేసే గ్రావెల్ తరలించారు.
ఈ మొత్తం సొమ్ము పిన్నెల్లి సోదరుల జేబుల్లోకి వెళ్లినట్లు అధికారులు నిర్థారించినట్లు సమాచారం. విచారణ వివరాలను రేపో, మాపో ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలుస్తోంది.
క్వార్ట్జ్, నాపరాయి...
కేవలం గ్రావెల్ తవ్వకాల్లోనే రూ.100 కోట్ల వరకు దోచుకున్న పిన్నెల్లి సోదరుల మరో మైనింగ్ దందాపై కూడా విచారణ కొనసాగుతోంది. మాచర్ల నియోజకవర్గంలో కారంపూడి మండలం సన్నెగండ్ల సమీపంలో సింగరుట్ల దేవస్థానం భూముల్లో క్వార్ట్జ్ తవ్వకాలపై విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అత్యంత విలువైన క్వార్ట్జ్‌ను ఎలాంటి అనుమతి లేకుండానే తవ్వి తీసి, తరలించి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. అప్పట్లోనే ఈ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వచ్చినా పట్టించుకున్నవారే లేరు. ప్రభుత్వం మారిన తరవాత క్వార్ట్జ్ తవ్వకాలపై విచారణ చేపట్టారు. ఇక మాచర్ల నియోజకవర్గంలో రూ.కోట్ల విలువైన నాపరాయి తవ్వి తీసి స్టోన్ క్రషర్లకు సరఫరా చేశారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. వాటికి సుమారు రూ.70 కోట్ల వరకు రాయల్టీ రూపేణా చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు.
Updated Date - Jul 11 , 2025 | 07:29 AM