ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Liquor Scam: తాగుడు కూతలు

ABN, Publish Date - Aug 04 , 2025 | 04:31 AM

జగన్‌ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఎన్నో సంచలన ఆధారాలు బయటపడ్డాయి. ముడుపులు దాచిన డెన్‌లు, నోట్ల కట్టలు లెక్కిస్తున్న వీడియోలతో పాటు ఫామ్‌హౌస్‌లో దాచిన 11 కోట్ల నగదు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణలో

  • లిక్కర్‌ స్కామ్‌ నిందితులకు రోతపత్రిక వత్తాసు

  • వాస్తవాలు దాచి వక్రీకరణ

  • సిట్‌పైనే బురదజల్లే యత్నం

  • వెంకటేశ్‌ నాయుడు రియల్టరట

  • ఆ డబ్బు వ్యాపార లావాదేవీలదని అడ్డగోలుగా సమర్థన

  • 5 కోట్లను 35 కోట్లుగా ‘సొంత లెక్క’

  • ఒంగోలు ఎంపీ స్థానానికి వెంకటేశ్‌ వేసిన నామినేషన్‌లో ఏడాది సంపాదన 4.95 లక్షలే

  • మరి కోట్లలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో?

  • ఇంకా ఖరీదైన కార్లు, చార్టర్డ్‌ ఫ్లైట్లలో షికార్లు

  • 2000 నోట్ల చలామణిపైనా అబద్ధాలు

  • సిట్‌ దర్యాప్తుకు వక్రభాష్యం

వార్షికాదాయం 5 లక్షలు వ్యాపారం 35 కోట్లతోనట

  • వెంకటేశ్‌ నాయుడు... వైసీపీ సీనియర్‌ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు, మద్యం స్కామ్‌లో ఏ 34 నిందితుడు. మద్యం ముడుపుల నోట్ల కట్టల గుట్టల (రూ.5 కోట్లు)ను అతడు లెక్కపెడుతున్న వీడియో సిట్‌ విచారణలో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. అయితే.. వెంకటేశ్‌ రియల్టర్‌ అని, తన వ్యాపార లావాదేవీల్లో భాగమైన నగదు (జగన్‌ పత్రిక లెక్కల ప్రకారం 35 కోట్లు)ను మద్యం కేసుకు సిట్‌ ముడిపెడుతోందంటూ రోత పత్రిక పెద్ద కథనం వండివార్చింది.

  • వెంకటేశ్‌ 2024 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేయడానికి నామినేషన్‌ వేశాడు. అఫిడవిట్‌లో తన ఏడాది సంపాదన రూ.4.95 లక్షలుగా పేర్కొన్నాడు. తాజాగా బయటపడిన వీడియోలో ఉన్నది వెంకటేశ్‌ నాయుడేనని జగన్‌ పత్రిక అంగీకరిస్తూనే.. ఆ డబ్బు అతడి వ్యాపారాలకు సంబంధించిందని సమర్థించే ప్రయత్నం చేసింది. అయితే... ఏడాదికి రూ.4.95 లక్షలు సంపాదన ఉన్న అతడికి రూ.5 కోట్ల డబ్బు (రోత పత్రిక లెక్కల ప్రకారం 35 కోట్లు) ఎలా వచ్చింది? ఏడాదిలో అంత మొత్తం ఎలా సంపాదించాడు? ఇది సాధ్యమయ్యే పనేనా?

  • వెంకటేశ్‌ చాలా ఖరీదైన కార్లతో తిరిగేవాడు. చార్టర్డ్‌ ఫ్లైట్లలో షికార్లు చేసేవాడు. బాలీవుడ్‌, టాలీవుడ్‌ హీరోయిన్లతో ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఏడాది సంపాదన రూ.4.95 లక్షలే ఉన్న అతడు అంత విలాసవంతంగా ఎలా గడిపాడు? డబ్బు ఎలా వచ్చింది?

  • 2023 మే నుంచి 2000 నోటు చలామణిలో లేదని జగన్‌ పత్రిక రాసింది. అలాంటప్పుడు ఎన్నికల్లో ఎలా పంచుతారంటూ కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించింది. వాస్తవానికి.. రూ.6017 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు తిరిగి రాలేదని ఆర్‌బీఐ ప్రకటించిందని శనివారం అదే పత్రిక వార్త ప్రచురించింది. తమ ఇష్యూ కార్యాలయాల వద్ద లేదా పోస్టులో పంపి కూడా ఆ నోట్లను మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. అంటే.. రెండు వేల రూపాయల నోట్లు చెల్లుబాటులో ఉన్నట్టే.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఎన్నో సంచలన ఆధారాలు బయటపడ్డాయి. ముడుపులు దాచిన డెన్‌లు, నోట్ల కట్టలు లెక్కిస్తున్న వీడియోలతో పాటు ఫామ్‌హౌస్‌లో దాచిన 11 కోట్ల నగదు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణలో వెలుగు చూశాయి. అయితే.. లిక్కర్‌ స్కామ్‌ నిందితులు చాలా నిజాయితీపరులంటూ జగన్‌ రోతపత్రిక అడ్డగోలుగా సమర్థిస్తోంది. జగన్‌ పార్టీ నేతలను కాపాడేందుకు సిట్‌పైనే బురదజల్లుతోంది. కళ్లముందు కనిపించే నిజాలను కక్షసాధింపు చర్యలుగా చూపించడానికి నానా తిప్పలు పడుతోంది. సిట్‌, గిట్టని మీడియాపై విషం చిమ్ముతోంది. లిక్కర్‌ స్కామ్‌ను రాజకీయకుట్రగా చూపడానికి జనాల కళ్లకూ గంతలు కట్టేందుకు అసత్యాలు అచ్చేస్తోంది. తాజాగా సిట్‌ వెలికితీసిన ఐదు కోట్ల ముడుపుల సొమ్ము ‘వీడియోలో ఉన్నది మా వాడే కానీ, ఆ సొమ్ము మద్యం సొమ్ము కాదు’ అని జగన్‌ పత్రిక పెద్ద కథనం వండింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అనుచరుడు వెంకటేశ్‌ నాయుడు రియల్టర్‌ అని, ఆ వీడియోలో ఉన్న రూ.35 కోట్లు (జగన్‌ పత్రిక లెక్క) అతడి వ్యాపార లావాదేవీలవని కవరింగ్‌ మొదలుపెట్టింది. నిందితులను సమర్థించే ప్రయత్నంలో నిజాలకు పాతరేసి, అబద్ధాలు రాస్తూ, వాస్తవాలను వక్రీకరించింది.

చెవిరెడ్డితో అనుబంధం

నంద్యాలలో పుట్టి, హైదరాబాద్‌లో పెరుగుతూ చదువుకున్న వెంకటేశ్‌ నాయుడుకు వైసీపీ నేత చెవిరెడ్డితో విడదీయరాని అనుబంధం ఉంది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా వైసీపీ తరఫున చెవిరెడ్డి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డికి సహకరించడం కోసమేమో కానీ.. ఒంగోలు లోక్‌స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి వెంకటేశ్‌ నామినేషన్‌ వేశాడు. అతడి నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో అతని ఏడాది సంపాదన రూ.4.95 లక్షలుగా పేర్కొన్నాడు. అయితే జగన్‌ పత్రిక ఈ విషయం దాచిపెట్టింది. అతడో పెద్ద రియల్టర్‌ అంటూ రాసింది. వ్యాపార లావాదేవీల్లో భాగమైన నగదు (35 కోట్లు)ను మద్యం కేసుకు సిట్‌ ముడిపెడుతోందని రాసుకొచ్చింది. ఏడాది సంపాదన రూ.4.95 లక్షలు ఉన్న వ్యక్తికి రూ.35 కోట్ల నగదు ఎలా వచ్చిందో మాత్రం రాయలేదు. జగన్‌ పత్రిక చెప్పినట్టు ఈ డబ్బు అతడిదే అయితే ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేశాడా?

‘2000 నోటు’ కథ ఇదీ

సిట్‌ వెలికితీసిన రూ.5 కోట్ల నగదుతో వెంకటేశ్‌ ఉన్న వీడియోలో నోట్ల కట్టల గుట్టలు ఉన్నాయి. పైభాగంలో రూ.2,000 నోట్ల కట్ట ఉంది. ఆ మొత్తాన్ని అతను రూ.5 లక్షలని చెప్పాడు. మొత్తం రూ.5 కోట్లలో రూ.5 లక్షల నగదు మాత్రమే 2 వేల నోట్లు. మిగతావి రూ.500, రూ.100 నోట్లు ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ జగన్‌ పత్రిక మాత్రం ఆ నోట్ల గుట్టలన్నీ 2 వేల నోట్లనే అర్థం వచ్చేలా రాసింది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే రూ.2,000 నోటు చలామణిలోనే లేదంటూ అడ్డగోలు వాదన అందుకుంది. చలామణి లేని నోట్లను ఎన్నికల సమయంలో ఎలా పంపిణీ చేస్తారంటూ మభ్య పెట్టేందుకు యత్నించింది. కానీ అదే జగన్‌ పత్రికలో ఇంకా రూ.6017 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు తిరిగి రాలేదని ఆర్‌బీఐ ప్రకటించిందని శనివారం వార్త ప్రచురించింది. 2023 మే 19 నాటికి మార్కెట్లో చలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 98.31 శాతం వెనక్కి వచ్చాయని తెలిపింది. ఎవరి దగ్గరైనా 2000 నోట్లు ఉంటే మార్చుకోవచ్చని తెలిపింది. ఇక ఆర్‌బీఐ ప్రకటించిన రూ.6,017 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లలో కొన్ని మాత్రమే మద్యం ముడుపుల వీడియోల్లో కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అన్ని వీడియోలు బయటకు రాలేదు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ల నుంచి రిట్రీవ్‌ అయిన ఒకట్రెండు వీడియోల్లోనే నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి. మరి మద్యం ముడుపులు దాచిన మిగతా డెన్‌లలో ఏ స్థాయిలో 2000 నోట్లు ఉన్నాయో?

సిట్‌పై నిందలు

వెంకటేశ్‌ అరెస్టు అప్పుడు, రిమాండ్‌ రిపోర్టులో ప్రస్తావించని నోట్ల కట్టల వీడియో హఠాత్తుగా ఇప్పుడు బయటకు రావడం అనుమానాస్పదంగా ఉందంటూ జగన్‌ పత్రిక రాసుకొచ్చింది. ఏ స్కాములోనైనా నిందితుడి అరెస్టు, రిమాండ్‌, విచారణ తర్వాతే అసలు విషయాలు బయటకొస్తాయి. రిమాండ్‌ రిపోర్టులో ఆ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల గురించి కూడా రాస్తారు. అందులో మొబైల్‌ ఫోన్‌ కూడా ఉంటుంది. నిందితులు ఫోన్లలో డిలీట్‌ చేసిన డేటాను దర్యాప్తు అధికారులు రికవరీ చేయాల్సి ఉంటుంది. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు మొబైల్‌ను పంపి నిపుణులతో రిట్రీవ్‌ చేయించాలి. దానికి సమయం పడుతుంది. వెంకటేశ్‌ విషయంలో జరిగింది ఇదే. దీనిపై రోతపత్రిక వక్రీకరణ చేసింది. అరెస్టు, రిమాండ్‌ రిపోర్టులో రాసినవే ఫైనల్‌ అనే అర్థం వచ్చేలా ఒక దుష్ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్తోంది. హైదరాబాద్‌ శివారులో ఫామ్‌హౌస్‌లో దొరికిన రూ.11 కోట్ల విషయం కోర్టు పరిధిలో ఉంది. వాదనలు జరుగుతున్నాయి. తప్పుచేసిన వారు చేశానని ఒప్పుకోరు. రాజకీయ కక్షసాధింపులంటూ కోర్టుకెక్కి కొంత హడావుడి చేస్తారు. రాజ్‌ కసిరెడ్డి అదే చేస్తున్నాడు. మొదట రూ.11 కోట్ల నగదు, తర్వాత రూ.5 కోట్ల నోట్ల కట్టలున్న వీడియోలు బయటపడడం లిక్కర్‌ మాఫియాకు ఊపిరాడడం లేదు. అవన్నీ అబద్ధాలంటూ, కోర్టు వ్యాఖ్యానాలు వారికి అనుకూలంగా ఉన్నాయంటూ జగన్‌ పత్రికలో అడ్డగోలుగా రాస్తున్నారు. ఆ వీడియో సిట్‌, గిట్టని మీడియా సృష్టి అంటూ నిస్సిగ్గుగా ప్రచారం చేస్తోంది.

Updated Date - Aug 04 , 2025 | 04:33 AM