ACB Court: లిక్కర్ నిందితుల రిమాండ్ పొడిగింపు
ABN, Publish Date - Aug 02 , 2025 | 06:38 AM
మద్యం కుంభకోణంలో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఈ కేసులో వివిధ జైళ్లలో ఉన్న 12 మందికి 13వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు శుక్రవారం ఆదేశాలు ఇచ్చారు.
12 మందికి 13 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు
విజయవాడ/రాజమహేంద్రవరం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఈ కేసులో వివిధ జైళ్లలో ఉన్న 12 మందికి 13వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు శుక్రవారం ఆదేశాలు ఇచ్చారు. నిందితుల రిమాండ్ గడువు ముగియడంతో రాజమహేంద్రవరం జైలు నుంచి ఎంపీ పీవీ మిథున్‌రెడ్డిని, విజయవాడ జిల్లా జైలు నుంచి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, పైలా దిలీప్, బూనేటి చాణక్య, చెరుకూరి వెంకటేశ్‌నాయుడు, బాలాజీ గోవిందప్ప, గుంటూరు జిల్లా జైలు నుంచి బాలాజీ కుమార్, నవీన్ కృష్ణను ఏసీబీ కోర్టుకు తరలించారు. నిందితులను దూరప్రాంతాల్లోని వేర్వేరు జైళ్ల నుంచి కోర్టుకు తీసుకురావాల్సి వస్తోందని, ఇక నుంచి రిమాండ్ పొడిగింపులను వర్చ్యువల్‌గా జరిగేలా చూడాలని సిట్ దర్యాప్తు అధికారి శ్రీహరిబాబు కోర్టును అభ్యర్థించారు. దీనిని న్యాయాధికారి తోసిపుచ్చారు. వర్చువల్ విధానంలో నిందితుల మాటలు సరిగా వినిపించడం లేదన్నారు. ఇరువైపులా వాదనలు వినాలి కదా? అని ప్రశ్నించారు. రిమాండ్ పొడిగింపు సమయంలో నిందితులను కోర్టుకు తీసుకురావాలని స్పష్టం చేశారు.
ఏపూట భోజనం ఆపూట కావాలి: మిథున్‌రెడ్డి
తనకు ఇంటి నుంచి భోజనాన్ని ఏ పూటకు ఆ పూట అనుమతించాలని మిథున్‌రెడ్డి ఏసీబీ కోర్టును అభ్యర్థించారు. అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఇంటి నుంచి ఒకేసారి తీసుకొస్తున్నారని తెలిపారు. మధ్యాహ్నం భోజనాన్నే రాత్రిపూట తినాల్సి వస్తోందన్నారు. తనకు అల్సర్ ఉన్న కారణంగా ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని తెలిపారు. మిథున్‌రెడ్డి పార్లమెంట్‌లో వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారని, ఏ పూట భోజనం ఆ పూట అనుమతించడానికి అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని న్యాయాధికారి ఆదేశించారు. కాగా, మిథున్‌రెడ్డి తిరిగి సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. ఆయన్ను స్నేహ బ్యారక్‌లోనే ఉంచినట్టు జైలు సూపరింటెండెంట్ రాహుల్ తెలిపారు. రెండు పూటలకు ఒకేసారి భోజనం బయట నుంచి తెస్తున్నారని, ఇతర ఖైదీలకు అందించినట్లే ఆయనకు బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నామని చెప్పారు.
Updated Date - Aug 02 , 2025 | 06:38 AM