పెదవి విరుపు!
ABN, Publish Date - May 29 , 2025 | 01:37 AM
కేంద్ర ప్రభుత్వం వివిధ పంటల మద్దతు ధరలను పెంచుతూ బుధవారం విడుదల చేసిన ప్రకటనపై రైతులు పెదవి విరుస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న సాగు ఖర్చులకు తగ్గట్టుగా పంటల మద్దతు ధరలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగినంతగా పంటలకు మద్దతు ధరలు పెరగడం లేదని అంటున్నారు. ఎకరానికి వరి సాగుకు రూ. 45వేల నుంచి రూ.50వేల వరకు ఖర్చు అవుతోందని, వాతావరణం సహకరిస్తే బయటపడతామని, లేకుంటే ఖర్చులు కూడా రావని పేర్కొంటున్నారు. మద్దతు ధర మరింత పెంచితేనే రైతులకు మేలు జరుగుతుందని చెబుతున్నారు.
- కేంద్రం పెంచిన పంటల మద్దతు ధరలపై అన్నదాతల ఆవేదన
- క్వింటా వరికి రూ. 69, మినుముకు రూ.400, పెసరకు రూ.86, మొక్క.జొన్నకు రూ.175 పెంచుతూ నిర్ణయం
-పెట్టుబడితో పోల్చితే ఈ మద్దతు ధరలు అంతంత మాత్రమే అంటున్న రైతులు
కేంద్ర ప్రభుత్వం వివిధ పంటల మద్దతు ధరలను పెంచుతూ బుధవారం విడుదల చేసిన ప్రకటనపై రైతులు పెదవి విరుస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న సాగు ఖర్చులకు తగ్గట్టుగా పంటల మద్దతు ధరలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగినంతగా పంటలకు మద్దతు ధరలు పెరగడం లేదని అంటున్నారు. ఎకరానికి వరి సాగుకు రూ. 45వేల నుంచి రూ.50వేల వరకు ఖర్చు అవుతోందని, వాతావరణం సహకరిస్తే బయటపడతామని, లేకుంటే ఖర్చులు కూడా రావని పేర్కొంటున్నారు. మద్దతు ధర మరింత పెంచితేనే రైతులకు మేలు జరుగుతుందని చెబుతున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
జిల్లాలో ఖరీఫ్‌లో 1.62 లక్షల హెక్టార్లలో వరి సాగు జరగనుంది. రబీ సీజన్‌లో మినుము పంట 1.40 లక్షల హెక్టార్లలో, మొక్కజొన్న 12వేల హెక్టార్లలో సాగు చేస్తారు. ఖరీఫ్‌లో ఇతర పంటలతో పోలిస్తే వరి సాగు అధికంగా ఉంటుంది. గతేడాది ధాన్యం క్వింటాకు రూ.117 మద్దతు ధర పెంచగా, క్వింటా ధాన్యం సాధారణ రకం రూ.2,300, ఏ-గ్రేడ్ ధాన్యం 2,320 మద్దతు ధరగా పలికింది. ఈ ఏడాది సాధారణ రకం, ఏ-గ్రేడ్ ధాన్యం క్వింటాకు కేవలం రూ.69 మాత్రమే పెంచారు. దీంతో 2025-26 సంవత్సరానికి క్వింటా ధాన్యం మద్దతు ధర 2,389లకు పెరుగుతుంది. దీంతో ఎకరానికి సుమారుగా 22 క్వింటాళ్ల దిగుబడి వస్తే రూ.1,518 మద్దతు ధర రూపంలో రైతులకు లభించే అవకాశం ఉంది. రబీ సీజన్‌లో సాగు చేసే మినుము పంటకు గతేడాది క్వింటాకు రూ.450 పెంచడంతో, మినుము క్వింటాకు మద్దతు ధర రూ.7,400లుగా నిర్ణయించారు. ఈ ఏడాది మద్దతు ధరకు మినుము కొనగోళ్లు జరగలేదు. క్వింటాలు మినుము రూ. 6,800లకు కొనుగోలు చేశారు. వచ్చే సీజన్‌కు సంబంధించి మినుము క్వింటాకు రూ.400 పెంచారు. దీంతో మినుము క్వింటాలుకు రూ.7,800లకు పెరగనుంది, పెసరకు గతేడాది క్వింటాకు రూ.124 పెంచగా, క్వింటాకు రూ.8,682 మద్దతు ధరగా ఉంది. ఈ ఏడాది పెసర మద్దతు ధరను క్వింటాకు రూ.86 పెంచారు. దీంతో పెసర క్వింటాకు రూ.8,768 పెరగనుంది. మొక్కజొన్నకు గత ఏడాది రూ. 135 పెంచగా, క్వింటా మొక్కజొన్న మద్దతు ధర రూ.2,225 వరకు పలికింది. ప్రస్తుతం మొక్కజొన్నకు క్వింటాకు రూ.175 పెంచడంతో ఈ ఏడాది మొక్కజొన్న మద్దతు ధర క్వింటాకు రూ.2,400లకు పెరగనుంది.
పెట్టుబడి కూడా రాని పరిస్థితి!
వరి, ఇతర పంటల సాగుకు ఏటా పెట్టుబడి ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. వరి సాగులో దుక్కి, దమ్ము, నారుమడి, నాట్లు, కలుపు తీత, మూడు, నాలుగు విడతలుగా ఎరువులు, రెండు మూడు విడతలుగా పురుగు మందులు, గుళికలు జల్లడానికి, కూలీలు ఖర్చులు, కోత, కట్టివేత, కుప్పనూర్పిడి, ధాన్యం రవాణా తదితర ఖర్చులన్నీ కలిపి ఎకరానికి రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడిగా పెట్టాల్సి వస్తోందనేది రైతుల మాటగా ఉంది. ప్రస్తుతం పెంచిన మద్దతు ధరతో పోలిస్తే ఎకరానికి 22 క్విటాళ్ల ధాన్యం దిగుబడి వస్తే రూ.52,558 వరకు నగదువస్తుందని, పెట్టుబడికి సంబంధించిన వడ్డీ, ఇతరత్రా ఖర్చులతో పోలిస్తే రైతులకు ఏమీ మిగలదనే వాదన రైతుల నుంచి వస్తోంది. కౌలు రైతులు ఎకరానికి కనీసంగా రూ.9వేలు, గరిష్టంగా 18వేల వరకు కౌలుగా చెల్లించాల్సి ఉందని, ఈ ఖర్చులన్నీ లెక్కగడితే కౌలురైతులకు ఏమీ మిగలదు. స్వామినాథన్ కమిషన్ రైతులు పెట్టిన పెట్టుబడికి అదనంగా 30శాతం కలిపి మద్దతు ధరగా ఇస్తేనే రైతులకు వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని తన నివేదికలో పేర్కొన్నారని, ఆయన ఇచ్చిన నివేదికను ఇంతవరకు అమలు చేయలేదని రైతులు వాపోతున్నారు.
ప్రకృతి విపత్తులు సంభవిస్తే..
వరి సాగులో నారుమడులు పోసే దశ నుంచి కుప్పనూర్పిడి చేసి మిల్లులకు ధాన్యం చేరే వరకు వాతావరణం అనుకూలంగా ఉంటే రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పంట చేతికొచ్చే సమయంలో తుపానుల కారణంగా భారీవర్షాలు కురిసి రైతులు నష్టపోతూనే ఉన్నారు. వరికోతలు ప్రారంభమయ్యే నవంబర్, డిసెంబర్ నెలల్లో కురిసే మంచుకారణంగా ధాన్యంలో తేమశాతం అధికంగా ఉందని, ధాన్యంలో నూకశాతం అధికంగా ఉందని, తప్పతాలు పేరుతో ధాన్యం మద్దతు ధరలో వ్యాపారులు, మిల్లర్లు కోత పెడుతూనే ఉన్నారు. ఈ ఏడాది ఖరీఫ్, రబీసీజన్‌లలో వరికోతల సమయంలో వర్షాలు కురవడంతో ధాన్యం భద్రపరిచేందుకు జాగా లేక రైతులు 75కిలోల బస్తా ధాన్యం రూ. 1,725 నుంచి రూ.1740 బదులుగా రూ.1500లోపు విక్రయించాల్సి వచ్చింది. ఇన్ని ఇబ్బందుల మధ్య వ్యవసాయం లాభసాటిగా ఉండటం లేదని అంటున్నారు. మద్దతు ధరలను మరింతగా పెంచితే రైతులకు మేలు జరుగుతుందని అన్నదాతలు పేర్కొంటున్నారు.
Updated Date - May 30 , 2025 | 03:09 PM