పీహెచ్‘డీలా’!
ABN, Publish Date - Jun 10 , 2025 | 12:31 AM
కృష్ణా యూనివర్సిటీలో పీహెచ్‌డీల ప్రదానం ప్రహసనంగా మారింది. లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి, పీహెచ్‌డీ పూర్తి చేసి, పరిశోధనా పత్రాలు సమర్పించిన అభ్యర్థులు పట్టాల కోసం ఏళ్ల తరబడి వర్సిటీ చుట్టూ తిరుగుతున్నారు. 57 మంది స్కాలర్‌లు సమర్పించిన పత్రాలు కనిపించకుండా పోవడం ఇక్కడి అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. దీనిపై ఉన్నత విద్యా మండలి అధికారులు, గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా వీరిలో చలనం ఉండటంలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
- కృష్ణా యూనివర్సిటీలో 200 మందికిపైగా స్కాలర్‌లు
- పరిశోధనా పత్రాలు సమర్పించిన 57 మంది ఫైల్స్ మాయం
- 2012 నుంచి పెండింగ్‌లోనే పీహెచ్‌డీల ప్రదానం
- కావాలనే జాప్యం చేస్తున్నారని అధికారులపై విమర్శలు
కృష్ణా యూనివర్సిటీలో పీహెచ్‌డీల ప్రదానం ప్రహసనంగా మారింది. లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి, పీహెచ్‌డీ పూర్తి చేసి, పరిశోధనా పత్రాలు సమర్పించిన అభ్యర్థులు పట్టాల కోసం ఏళ్ల తరబడి వర్సిటీ చుట్టూ తిరుగుతున్నారు. 57 మంది స్కాలర్‌లు సమర్పించిన పత్రాలు కనిపించకుండా పోవడం ఇక్కడి అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. దీనిపై ఉన్నత విద్యా మండలి అధికారులు, గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా వీరిలో చలనం ఉండటంలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
(ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం):
కృష్ణా యూనివర్సిటీలో కెమిస్ర్టీ, ఫార్మసీ, కామర్స్, ఇంగ్లీష్, బిజినెస్ మేనేజ్‌మెంట్, బయో టెక్నాలజీ తదితర విభాగాల్లో 200 మందికిపైగా రీసెర్చ్ స్కాలర్‌లు ఉన్నారు. రెగ్యులర్‌గా అయితే మూడు సంవత్సరాల్లో, పార్ట్‌టైమ్ పద్ధతిలో అయితే నాలుగేళ్లలో పీహెచ్‌డీని పూర్తి చేయాలి. తొలుత పీహెచ్‌డీ చేసేందుకు ముందుకు వచ్చిన స్కాలర్‌లకు ఆరు నెలల్లో పరీక్ష నిర్వహించి, వారు ఏ అంశంపై రీసెర్చ్ చేస్తున్నారో చూసుకుని అనుమతులు ఇవ్వాలి. ప్రతి ఏడాది జనవరి, జూన్ నెలల్లో ఒకసారి రీసెర్చ్ రెన్యువల్ కమిటీ సభ్యులు స్కాలర్‌లు చేస్తున్న పరిశోధనల తీరును పరిశీలించి వారికి తగు సూచనలు చేయాలి. యూనివర్సిటీలో రీసెర్చ్ విభాగంలో డైరెక్టర్‌లు రెగ్యులర్‌గా లేకపోవడం, వచ్చిన వారు మొక్కుబడిగా పనిచేయడంతో పీహెచ్‌డీల ప్రదానంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2012లో యూనివర్సిటీలో పీహెచ్‌డీ పరిశోధనలు ప్రారంభం కాగా, 2012, 2014, 2018 సంవత్సరాల్లో పరిశోధనలు ప్రారంభించి పూర్తిస్థాయిలో తమ పత్రాలను సమర్పించిన వారికి నేటికీ పీహెచ్‌డీ పట్టాలు అందజేయక పోవడం గమనార్హం. సైన్స్ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ చేసే వారు అధికశాతం మంది స్కాలర్‌లు ఉండగా, యూనివర్సిటీలో ఇంతవరకు సైన్స్ సబ్జెక్టులు బోధించే ప్రొఫెసర్‌లు, రీసెర్చ్ విభాగం డైరెక్టర్‌గా ఒక్కరు కూడా ఇంతవరకు పనిచేయకపోవడం విశేషం. గతంలో వివిధ అంశాలపై పరిశోధనలు చేసి పత్రాలు సమర్పించిన 57 మందికి సంబంధించిన పత్రాలు కనిపించకుండా పోయినట్టు సమాచారం. వీరంతా యూరివర్సిటీకి వచ్చి మాకు పీహెచ్‌డీ ఇవ్వాలని కోరుతుంటే మీ పరిశోధనపత్రాలు కనపడటం లేదని చెప్పి అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిలు వినిపిస్తున్నాయి. దీంతో పీహెచ్‌డీ కోసం లక్షలాది రూపాయలు ఫీజులు కట్టిన స్కాలర్‌లు తమకు న్యాయం చేయాలని ఉన్నత విద్యామండలి అధికారులకు, గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా యూనివ ర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిసింది. పలువురు స్కాలర్‌లు పీహెచ్‌డీ పూర్తిచేశామని, పూర్తిస్థాయిలో ఫీజులు చెల్లించామని, తమకు వైవాను నిర్వహించి పట్టా ఇవ్వాలని యూనివర్సిటీ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకా ఫీజులు చె ల్లించాలని, అవి కడితే అప్పుడు చూద్దామని చెప్పి పంపేస్తున్నారు. ప్రైవేటు కళాశాలల్లో తక్కువ జీతానికి పనిచేస్తూ పీహెచ్‌డీ పూర్తిచేశామని, ఇప్పటికిప్పుడు పెద్దమొత్తంలో అదనంగా ఫీజులు చెల్లించలేమని స్కాలర్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, స్కాలర్‌లు సమర్పించిన పత్రాలు గతంలో ఎవరైనా చేసిన పరిశోధనల నుంచి కాపీ చేసి, వాటినే సమర్పించారా అనే అంశాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేక సాఫ్ట్ట్‌వేర్ ఉండాలి. ఈ సాఫ్ట్ట్‌వేర్ ను నాలుగు సంవత్సరాల క్రితమే నిలిపివేశారు. సాఫ్ట్ట్‌వేర్ కొనుగోలు చేయకుండా యూనివర్సిటీ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
చెల్లించిన ఫీజులు రూ.15 కోట్ల పైనే..
యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసేందుకు అనుమతులు ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు స్కాలర్‌లు కట్టిన ఫీజులు రూ.15 కోట్లపైనే ఉంటాయని వర్సిటీ అధికారులే చెబుతున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఫీజులు వసూలు చేసినా పీహెచ్‌డీ పట్టాలు ఇవ్వకుండా స్కాలర్‌లను యూనివర్సిటీ చుట్టూ తిప్పుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
యూనివర్సిటీ నగదు ప్రైవేటు బ్యాంకులకు..
ఇటీవల కాలంలో యూనివర్సిటీకి చెందిన నగదును రెండు ప్రైవేటు బ్యాంకుల్లోకి మార్చిన అంశంపై అధికారుల్లో చర్చ నడుస్తోంది. యూనివర్సిటీలో ఎస్‌బీఐ బ్రాంచ్ ఉంది. ఇప్పటివరకు అందులోనే యూనివర్సిటీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను నడుపుతూ వచ్చారు. ఇటీవల కాలంలో ఎస్‌బీఐ బ్రాంచ్‌లోని మూడు కోట్ల రూపాయలను మచిలీపట్నంలోని రెండు ప్రైవేటు బ్యాంకుల్లోకి మార్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇది ఎవరి ప్రమేయంతో జరిగింది, పాత్రదారులు, సూత్రదారులు ఎవరు, ఇందుకు గల కారణాలు ఏమై ఉంటాయనే అంశంపై అనేక అనుమానాలను యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్‌లు, సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌బీఐ అధికారులు యూనివర్సిటీలో ఎస్‌బీఐ బ్రాంచ్ ఏర్పాటు చేయడం లాభదాయకంగా లేదని, వేరే ప్రాంతానికి ఈ బ్రాంచ్‌ను మార్చాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు లేఖ కూడా రాసినట్లు సమాచారం.
Updated Date - Jun 10 , 2025 | 12:31 AM