టీడీపీ కార్యకర్త లక్ష్మన్న దంపతులపైవైసీపీ నాయకుల దాడి
ABN, Publish Date - Apr 11 , 2025 | 12:08 AM
మండలంలోని చిన్నభూంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కొలిమి లక్ష్మన్న, హైమావతి దంపతులపై వైసీపీకి చెందిన గ్రామ సర్పంచ్ కే. చిన్నహుశేనీ తదితరులు బుధవారం అర్ధరాత్రి దాడి చేశారు.
చిన్నభూంపల్లి గ్రామంలో అర్థరాత్రి ఘటన
ఇంటి గేటును ఢీకొట్టి.. భార్యాభర్తలపై దాడి
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
కోసిగి, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్నభూంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కొలిమి లక్ష్మన్న, హైమావతి దంపతులపై వైసీపీకి చెందిన గ్రామ సర్పంచ్ కే. చిన్నహుశేనీ తదితరులు బుధవారం అర్ధరాత్రి దాడి చేశారు. గ్రామానికి చెందిన గంగి హుశేనీ, కల్లూరు లక్ష్మయ్య, పుడితిని సోమిరెడ్డితో, సర్పంచ్ చిన్న హుసేసీ కలిసి లక్ష్మన్న, హైమావతి దంపతుల ఇంటి గేటును బైక్‌తో ఢీకొట్టి, ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా గూటాలతో దాడి చేశారు. వైసీపీ నాయకుల చేతుల్లో దెబ్బలు తింటున్న దంపతులను చుట్టుపక్కల వారు వచ్చి రక్షించారు. చిన్నభూంపల్లి గ్రామంలో సర్పంచ్‌పై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినందుకే మనసులో పెట్టుకుని తమపై దాడి చేశారని బాధితులు తెలిపారు. తమ ఇంటి మీద వైసీపీ నాయకులు దాడి చేయడానికి తీసుకొచ్చిన బైక్‌ను అక్కడే వదిలి పారిపోయారని కోసిగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోసిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం 108లో వారిని ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ హనుమం తరెడ్డిని వివరణ కోరగా.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కర్నూలులో టీడీపీ కార్యకర్తపై దాడి
కర్నూలు క్రైం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్లూరు దర్వాజ వెళ్లే రహదారిలో టీడీపీ కార్యకర్త షేక్ ఇంతియాజ్ అనే వ్యక్తిపై దాడి జరిగింది. ఉస్తాద్ మహబూబ్ ఆలి అనుచరులు సమీర్, కలాంలు ఈ దాడి చేశారు. వైసీపీకి చెందిన ఉస్తాద్ మహబూబ్ ఆలి అనే వ్యక్తి అక్రమా లపై ఇంతియాజ్ రెండు మూడుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ పట్టాల కేసులో ఉస్తాద్ రిమాండ్‌కు కూడా వెళ్లాడు. ఇది మనసులో ఉంచుకున్న అతని అనుచరులు ఇంతియాజ్‌పై బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దాడి చేసి గాయపరిచారు. ఆయనను ఆసుపత్రికి తరలించారు. గురువారం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామయ్య నాయుడు తెలిపారు
Updated Date - Apr 11 , 2025 | 12:08 AM