గుండ్రేవుల పూర్తి చేస్తారా?
ABN, Publish Date - Jul 17 , 2025 | 12:24 AM
రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి బనకచర్లకు గోదావరి జలాలు తెస్తామని ప్రభుత్వం అంటోంది. రూ.80 వేల కోట్లతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది
కరువు, వలసలు నివారించే బృహత్తర ప్రాజెక్టు
2019లో రూ.1,985 కోట్లు మంజూరు చేసిన టీడీపీ ప్రభుత్వం
వైసీపీ హయాంలో ఐదేళ్లు నిర్లక్ష్యం
వేదవతి, ఆర్డీఎస్ కుడి కాలువ, రాయలసీమ లిఫ్ట్‌ను ఓకే చేసిన ప్రస్తుత ప్రభుత్వం
నేడు హంద్రీ-నీవాకు కృష్ణా జలాలు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి బనకచర్లకు గోదావరి జలాలు తెస్తామని ప్రభుత్వం అంటోంది. రూ.80 వేల కోట్లతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది. ఎక్కడి నుంచో కరువు సీమకు నీళ్లు ఇస్తా అనడం సరే.. హక్కుగా కృష్ణా నది నుంచి రావాల్సిన నీరు ముందు ఇవ్వాలి. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా జీవనాడి గుండ్రేవుల ప్రాజెక్టును ప్రథమ ప్రాధాన్యతగా చేపట్టి పూర్తి చేయాలి. హంద్రీనీవా కాలువకు కృష్ణా జలాలు విడుదల చేసేందుకు నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాకు వస్తున్న సీఎం చంద్రబాబు దృష్టికి గుండ్రేవుల ప్రాజెక్టు అవసరాన్ని మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు తీసుకువెళ్లాలని ప్రజలు కోరుతున్నారు. ఈ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
కర్నూలు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): కర్నూలు-కడప (కేసీ) కాలువ పరిధిలో కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో 2.65,628 ఎకరాల ఆయకట్లు ఉంది. 31.90 టీఎంసీలు నికర జలాలు కేటాయింపు ఉన్నా నిల్వ చేసుకునే జలాశయం లేదు. తుంగభద్ర డ్యాం నుంచి 10 టీఎంసీలు, సుంకేసుల బ్యారేజీ నుంచి తుంగభద్ర ప్రవాహం ద్వారా 21.90 టీఎంసీలు మళ్లించాలి. ఈ బ్యారేజీ సామర్థ్యం కేవలం 1.20 టీఎంసీలే. తుంగభద్రకు వరద రోజులు తగ్గడం, టీబీ డ్యాం నుంచి ఇచ్చే వాటా జలాలు నదిలో దాదాపు 350 కిలోమీటర్లు ప్రవహించి సుంకేసుల బ్యారేజీకి 25 శాతం కూడా చేరడం లేదు. దీంతో కేసీ కాలువ చివరి ఆయకట్టు, కర్నూలు నగరానికి సాగు, తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఈ కష్టాలకు చెక్ పెట్టి.. కష్టజీవుల కన్నీళ్లు తుడవాలంటే సుంకేసుల ఎగువన 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల జలాశయం నిర్మాణమే ఏకైక మార్గమని సాగునీటి నిపుణుడు, రిటైర్డ్ ఈఈ సుబ్బరాయుడు గుండ్రేవుల ప్రాజెక్టుకు డిజైన్ చేశారు. గత టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గురించి ఎన్నికల ముందు పట్టించుకుంది. 2019 ఫిబ్రవరి 21న ప్రస్తుత డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కోరిక మేరకు రూ.2,890 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఆర్‌టీ నం.154 జారీ చేసింది. అప్పటి కల్లా పుణ్యకాలం ముగిసి ఎన్నికలు రావడం, టీడీపీ ఓడిపోవడం, జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వెంట వెంటనే జరిగాయి. వైసీపీ ప్రభుత్వం గుండ్రేవులను అంతర్రాష్ట్ర సమస్య అంటూ అటకెక్కించింది. మళ్లీ సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం రాకతో రైతుల్లో గుండ్రేవులపై ఆశలు చిగురించాయి. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను కేఆర్‌ఎంబీ సహా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు పంపించారు. 35 టీఎంసీలకు పెంచి, అందులో 15 టీఎంసీలు ఆర్డీఎస్ ఎడమ కాలువ ఆయకట్టుకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తున్నది. అంటే ఇప్పుడు గుండ్రేవులకు ఏ ఆటంకం లేనట్లే. మరి పదవీ కాలం ఆరంభం నుంచే ఈ ప్రాజెక్టు మీద కేంద్రీకరిస్తే ఉమ్మడి జిల్లా ప్రజల కలలు నెరవేరుతాయి. మరి ఆ దిశగా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు టీజీ భరత్, ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎంపీలు బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరి సహా ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబును ఒప్పించగలరా? జిల్లా రైతాంగం మీద తమకు ప్రేమ, బాధ్యత ఉన్నాయని నిరూపించుకోగలరా? జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయిన జలనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడులపై ఒత్తిడి తేగలరా? 2019 ఎన్నికల ముందు హడావిడిగా వేసిన శిలాఫలకం చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు పనులు చేపట్టగలరా? ఈ విడత అయినా గుండ్రేవులను పూర్తి చేస్తారా? అని రైతులు ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఆ ప్రాజెక్టులు తక్షణం చేపట్టాలి
ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు, 196 గ్రామాలకు తాగునీరు అందించాలనే లక్ష్యంగా వేదవతి ఎత్తిపోత పథకం ప్రాజెక్టును 2019 జవనరి 29న రూ.1,942.80 కోట్లు మంజూరు చేసి జీవో.ఆర్‌టీ.నెం.77 జారీ చేశారు. రూ.106.2 కోట్లు (6.61 శాతం) పనులు చేశారు. మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఆశయంగా ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణానికి రూ.1,985.42 కోట్లు మంజూరు చేస్తూ 2019 జనవరి 20న జీవో ఆర్‌టీ నెం.76 జారీ టెండర్లు హెడ్ వర్క్ పనులు, కాలువ నిర్మాణం రూ.11.90 కోట్లు విలువ పనులు (0.73 శాతం) మాత్రమే చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఐదేళ్లు నిర్లక్ష్యం వెంటాడింది. వైసీపీ హయాంలో రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్ (ఆర్‌డీఎంపీ)లో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారు. సంగమేశ్వరం నుంచి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ఎస్‌ఆర్‌ఎంసీలో వేయాలనే లక్ష్యంతో రూ.2020 మే 5న రూ.3,825 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఆర్టీ నంబరు 203 జారీ చేశారు. 2021 ఫిబ్రవరిలో పనులు మొదలు పెట్టి రూ.745.46 కోట్లు (22.54 శాతం) విలువైన పనులు చేశారు. తాజాగా ఈ ప్రాజెక్టులు కొనసాగించేందుకు ఈ నెల 9న సీఎం చంద్ర బాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం ఆమోదం తెలపడం రైతుల ఆశలకు జీవం పోసింది. తక్షణం పనులు మొదలు పెట్టాలని రైతులు కోరుతు న్నారు.
పారిశ్రామిక రంగంలో ఆశలు
కూటమి ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లాలో పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లడానికి హడావిడి చేస్తోంది. అదంతా నేల మీదికి వస్తే జిల్లా ప్రగతికి దోహదం చేస్తుంది. నేషనల్ ఇండస్ర్టియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎన్‌ఐసీడీపీ)లో భాగంగా ఓర్వకల్లు ఇండస్ర్టియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి ఫేజ్-1 కింద 2,612 ఎకరాల్లో రూ.2,786 కోట్లతో మౌలిక వసతులు కల్పనకు టెండర్లు పిలించారు. ఇక్కడ వివిధ పరిశ్రమలు ఏర్పాటు ద్వారా రూ.12 వేల కోట్లు పెట్టుబడులు, 45,071 మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం అంటోంది. జపాన్‌కు చెందిన ఇటోయె మైక్రో టెక్నాలజీ కొర్పొరేషన్, ఇండియాకు చెందిన హైడ్రెన్ గ్రూప్, బీఎన్ గ్రూపులు సంయుక్తంగా 130 ఎకరాల్లో రూ.14 వేల కోట్ల పెట్టుబడు లతో సెమీకండక్టర్ తయారీ పరిశ్రమను స్థాపనకు ఒప్పందం చేసుకుంది. 1200 ఎకరాల్లో రూ.13 వేల కోట్లతో ‘ఈవీ పార్క్’ ఏర్పాటుకు ఒప్పందం, 300 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో డ్రోన్ హబ్‌ను ఏర్పాటు చేయబోతోంది. పత్తికొండ వద్ద రూ.11 కోట్లతో టమోటా ప్రాసెసింగ్ యూనిట్, ఎమ్మిగనూరు మండలం బనవాసి జెర్సీ పశుక్షేత్రంలో చేనేతలకు ఉపాధి లక్ష్యంగా 97.24 ఎకరాల్లో మెగా టెక్స్ టైల్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. ఆలూరు, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో విండ్ వపర్ యూనిట్లు ఏర్పాటుకు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. అయితే.. పెండింగ్ ప్రాజెక్టులు, అసంపూర్తి పనులపై కూడా దృష్టి సారించాలి:
వీటిపై దృష్టి సారించాలి
రూ.210 కోట్లు మంజూరు చేసి హంద్రీ నీవా ప్రాజెక్టు పత్తికొండ (పందికోన) జలాశయం కుడి, ఎడమ కాలువల డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువలు చేసి పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో 61,394 ఎకరాలకు సాగునీరు అందించాలి.
అసంపూర్తిగా ఉన్న గాజలదిన్నె జలాశయం సామర్థ్యం 5.50 టీఎంసీలకు పెంపు పనులు నిధులు ఇచ్చి పూర్తి చేయాలి.
అలగనూరు జలాశయం 2.96 టీఎంసీలు సామర్థ్యం. మట్టి ఆనకట్ట కుంగిపోయి ఐదేళ్లు దాటింది. రూ.26.33 కోట్లు నిధులు మరమ్మతులు చేపట్టాలి.
రూ.450 కోట్లతో చేపట్టిన కర్నూలు సర్వజన వైద్యశాల, మెడికల్ కాలేజీ భవనాలు, రూ.480 కోట్లతో చేపట్టిన ఆదోని మెడికల్ కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణాలు పూర్తి చేసి పేదలకు వైద్య సేవలు అందించాలి.
జగన్నాథగట్టుపై 192 ఎకరాల్లో రూ.20 కోట్లతో చేపట్టిన రాయలసీమ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల, ఓర్వకల్లు వద్ద 144.92 ఎకరాల విస్తీర్ణంలో రూ.18 కోట్లతో చేపట్టిన డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వావిద్యాలయం, 52 ఎకరాల్లో రూ.80 కోట్లతో చేపట్టిన క్లస్టర్ యూనివర్సిటీ భవనాల పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి.
ఉమ్మడి జిల్లాలో గత టీడీపీ ప్రభుత్వం ఏపీ టిడ్కో కింద 52,318 ఇళ్లు మంజూరు చేస్తే, 31,289 ఇళ్లు నిర్మాణాలు మొదలు పెట్టి 23,645 ఇళ్లు వంద శాతం పూర్తి చేశారు. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరులో 16,595 ఇళ్లు, నంద్యాల, డోన్, ఆళ్లగడ్డలో 7,050 ఇళ్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అప్పగించాలి.
ఓర్వకల్లు విమానాశ్రయంలో భద్రత ఏర్పాట్లు
ఓర్వకల్లు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఓర్వకల్లు విమానాశ్రయానికి రానున్న సందర్భంగా అక్కడ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. బుధ వారం కలెక్టర్, ఎస్పీలు ఓర్వకల్లు విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 12.25 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఇక్కడి నుంచి మల్యాలకు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో 12.45 గంటలకు బయలుదేరి వెళుతారన్నారు. అక్కడ పర్యటనను ముగించుకుని ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు మధ్యాహ్నం 3.50గంటలకు చేరుకుని ప్రత్యేక విమానంలో సాయంత్రం 4.40గంటలకు విజయవాడకు బయలుదేరను న్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎయిర్‌పోర్టు డైరెక్టర్ విద్యా సాగర్, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, కర్నూలు డీఎస్‌పీలు బాబు ప్రసాద్, భాస్కర్‌రావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ తేజమూర్తి తదితరులు పాల్గొన్నారు.
సీఎం పర్యటన ఇలా..
నంద్యాల/నందికొట్కూరు, జూలై 16( ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు గురువారం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీలోని జన్‌పథ్ నుంచి బయలుదేరి 10 గంటలకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఢిల్లీలో ఉదయం10.10 గంటలకు బయలుదేరి 12.25 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.35 గంటలకు బయలుదేరి 12.45 గంటలకు నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు వస్తారు. 12.45 నుంచి 12.50 గంటల వరకు హెలిప్యాడ్ వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. 12.50 గంటలకు హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా 1.00 గంటకు మల్యాలలోని హెచ్‌ఎన్‌ఎ్‌స.ఎ్‌స పంపింగ్ స్టేషన్-1 వద్దకు చేరుకుంటారు. 1 గంట నుంచి 1.45 గంటల వరకు కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. 1.45 నుంచి 2.15 భోజన విరామం తీసుకుంటారు. 2.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు మల్యాల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన నీటి సహాయక సంఘాలు, రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 3.35 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 3.50 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. 4.45 గంటలకు విజయవాడకు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులు పాల్గొంటారు.
Updated Date - Jul 17 , 2025 | 12:24 AM