జానెడు స్థలం ఇవ్వలేరా?
ABN, Publish Date - Jun 02 , 2025 | 11:38 PM
పేదలకు జానెడు స్థలం ఇవ్వలేరా? అని సీపీఐ కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సీపీఐ కార్యదర్శి వర్గ సభ్యుడు రామచంద్రయ్య
పత్తికొండ టౌన్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): పేదలకు జానెడు స్థలం ఇవ్వలేరా? అని సీపీఐ కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం పట్టణంలోని సీఆర్ భవన్ నుంచి నాలుగు స్థంభాల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉందని చెప్పుకుంటూ, ఏడాదవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు, సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకపోవడం దారుణమన్నారు. జగన్ ప్రభుత్వం నివాస యోగ్యం కానీ ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చి అన్యాయం చేశారని చెప్పిన టీడీపీ నాయకులు తాము అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి, ఇళ్లు నిర్మిస్తామని వాగ్దానాలు చేశారన్నారు. అనంతరం తహసీల్దార్ రమేష్‌కు వినతి పత్రం అందజేశారు. స్పందించిన తహసీల్దార్ స్థలాలు కావాలసిన వారు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి రాజాసాహేబ్, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, ప్రజా సంఘాల నాయకులు సురేంద్ర కుమార్, కారన్న, గురుదాస్, వంశీ, కారుమంచి, కృష్ణ, ఎంపీటీసీ వీరన్న, సిద్ధలింగప్ప పాల్గొన్నారు.
ఆదోని రూరల్: పేదలందరికి ఇళ్ల స్థలాలను ఇవ్వాలని సీపీఐ నాయ కులు అజయ్ బాబు, సుదర్శన్, కల్లుబావి రాజు డిమాండ్ చేశారు. సోమవారం డీటీకి గుండాల నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.
ఆలూరు: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ నాయకుడు భూపేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి వి.రంగన్న అధ్యక్షతన పట్టణంలోని గెస్ట్‌హౌస్ నుంచి ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేసి, తహసీల్దార్ గోవింద్‌సింగ్‌కు వినతి పత్రం ఇచ్చారు. వి.చంద్రకాంత్‌రెడ్డి, చాపల గోపాల్, సిద్ధలింగ, రాముడు, పొన్నూరువలి, తులసమ్మ పాల్గొన్నారు.
తుగ్గలి: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ నాయకులు నబీరసూల్, సుల్తాన్ కోరారు. సోమవారం తుగ్గలిలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ రమాదేవికి వినతి పత్రం అందజేశారు.
Updated Date - Jun 02 , 2025 | 11:38 PM