బియ్యం దొంగలు ఎవరు..?
ABN, Publish Date - Jun 17 , 2025 | 12:22 AM
ఆదోని శివారులో శుక్రవారం అర్ధరాత్రి తూకాలు వేసి రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన ఓ ప్రైవేటు గోదాములో ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లయ్ కార్పొ రేషన్ డైరెక్టర్ మహేశ్‌నాయుడు తనిఖీ చేశారు.
ఆదోని శివారులోని ప్రైవేట్ గోదాములో గుర్తించిన బియ్యం చుట్టూ సందేహాలు
నందికొట్కూరు ఎంఎల్‌ఎస్ పాయింట్‌లోని 94 బస్తాల బియ్యం ఏమయ్యాయి..?
కర్నూలు/ఆదోని, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): ఆదోని శివారులో శుక్రవారం అర్ధరాత్రి తూకాలు వేసి రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన ఓ ప్రైవేటు గోదాములో ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లయ్ కార్పొ రేషన్ డైరెక్టర్ మహేశ్‌నాయుడు తనిఖీ చేశారు. సుమారుగా 1,500- 1,800 బస్తాలు పేదల ఆకలి తీర్చే బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌కు సమాచారం ఇచ్చారు. గోదాముకు కల్లుబావి వీఆర్‌ఓ రాజశేఖర్‌గౌడ్ వేసిన తాళం శనివారం ఉదయం తెరిస్తే బియ్యం బస్తాలు కనిపించలేదు. ఇది ఎలా సాధ్యం..? బియ్యం దొంగలు ఎవరు..? కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నుంచి బీజేపీలో చేరిన ఓ యువనేత ఓ పోలీస్ అధికారితో కలసి రేషన్ బియ్యం మాఫియా నడిపారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ మూఠానే మాయం చేసిందా..? అనే ప్రశ్నలు ఎన్నో రేకెత్తాయి.
ఆదోని అడ్డాగా జరుగుతున్న బియ్యం దందా ఈ నాటికి కాదు. వైసీపీ ప్రభుత్వం రాక ముందు వరకు పలువురు వ్యాపారులు రేషన్ బియ్యం సేకరించి రహస్యంగా సరిహద్దులు దాటించి కర్ణాటకకు చేర్చేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాజకీయ అండతో ‘బియ్యం మాఫియా’ ఏర్పడటంతో భారీ దందా మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో ‘చిన్న బాస్’గా పేరుగాంచిన వైసీపీ యువ నాయకుడి నేతృత్వంతో బియ్యం మాఫియా పెట్రేగిపోయింది. ప్రతి నెల 25-35 లారీలు (ఒక్కో లారీ 18-20 టన్నులు) బియ్యం అక్రమంగా ఏపీ సరిహద్దులు దాటించేవారనే ఆరోపణులు ఉండేవి. ఆ యువనాయకుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. వైసీపీని వీడి బీజేపీలో చేరారు. పార్టీ మారినందుకు ప్రతిఫలంగా ఆ యువ నాయకుడికి బియ్యం అక్రమ రవాణా అప్పగిం చారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈయనకు ఓ పోలీస్ అధికారి కూడా అండగా నిలిచారని సమాచారం. వైసీపీ నుంచి వచ్చిన యువ నాయకుడిని కాదని రెండు నెలల క్రితం అధికార పార్టీకి చెందిన మరో వర్గం రేషన్ బియ్యం మాఫియాగా మారిందనే చర్చ కూడా ఉంది. కొత్తగా బియ్యం అక్రమ రవాణాలోకి దిగిన వ్యక్తులు వివిధ మార్గాల్లో సేకరించిన రేషన్ బియ్యం రవా ణాకు సిద్ధం చేయగా.. పక్కగా సమాచారంతో ఏపీ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డైరెక్టర్ మహేశ్‌నాయుడు దాడులు చేసినట్లు తెలుస్తోంది.
బియ్యం మాయం వెనుక పాత్ర ఎవరిది?
సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశాల మేరకు వెళ్లిన కల్లుబావి గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్‌ఓ) రాజశేఖర్‌గౌడ్ సమక్షంలో ఏపీ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డైరెక్టర్ మహేశ్ నాయుడు బియ్యం అక్రమంగా నిల్వ చేసిన గోదాముకు తాళం వేశారు. ఆ తాళం చెవి వీఆర్‌వో వద్దే ఉంచినట్లు తెలుస్తోంది. తాళం వేసిన గోదాములో సుమారు 750-900 క్వింటాళ్ల బియ్యం ఉంటాయని అంచనా. సివిల్ సప్లయ్ శాఖ లెక్కల ప్రకారం వాటి విలువ సుమారుగా రూ.35 లక్షలు పైమాటే అని అధికారులే అంటున్నారు. ఇంత విలువైన బియ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులదే. కానీ రాత్రికిరాత్రే బియ్యం మాయం కావడం చర్చనీ యాంశమైంది. బియ్యం నిల్వలు ఉన్న వీడియోలు రాత్రే సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌కు చేరాయి. ఆయన తక్షణమే స్పందించి పోలీసుల రక్షణ కల్పించి ఉంటే బియ్యం మాయం అయ్యేవి కాదుకదా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వేసిన తాళం వేసినట్లే ఉంది.. బియ్యం మాత్రం కనిపించడం లేదు. ఇవి అంతుచిక్కని ప్రశ్నలుగా మిగిలిపోయాయి.
ఆ బియ్యం ఎలా వచ్చాయి..?
నందికొట్కూరు సివిల్ సప్లయ్ మండల లెవల్ స్టాక్ (ఎంఎల్‌ఎస్) పాయింట్ గోదాములో వివిధ దాడుల్లో పట్టుబడిన 984 బస్తాల(492 క్వింటాళ్లు) రేషన్ బియ్యం నిల్వ ఉన్నాయి. ప్రభుత్వం ఆదేశాల మేరకు వాటిని బహిరంగ వేలాం ద్వారా విక్రయించి వచ్చిన నగదును ట్రెజరీలో జమ చేయాలి. అయితే.. 15 రోజుల క్రితం ఏపీ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డైరెక్టర్ మహేశ్ నాయుడు ఆ గోదామును తనిఖీ చేశారు. ఆ సమయంలో రికార్డుల్లో ఉన్న పట్టుబడి రేషన్ బియ్యం 984 బస్తాలు గోదాములో మాయం అయినట్లు గుర్తించారు. గోదాము ఇన్‌చార్జిగా ఉన్న అధికారే మాయం చేశారా..? అనే ప్రశ్న తలెత్తింది. ఇటీవల బదిలీల్లో భాగంగా గోదాము ఇన్‌చార్జి బదిలీ అయ్యారు. ఆ స్థానంలో వచ్చిన డీటీ మాయమైన సీజ్ చేసిన బియ్యం లెక్కలు చెబితే తప్ప బాధ్యతలు తీసుకోలేనని తెగేసి చెప్పినట్లు సమాచారం. మాయమైన రేషన్ బియ్యం ఎంఎల్‌ఎస్ గోదాములో కనిపించాయి. వీటి చుట్టూ ఉన్న ప్రశ్నలపై సమగ్ర విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - Jun 17 , 2025 | 12:22 AM