ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రోడ్ల విస్తరణ ఎప్పటికి?

ABN, Publish Date - Jun 21 , 2025 | 11:14 PM

కర్నూలు చారిత్రాత్మక నగరం. ఓల్డ్‌ సిటీలో ఇప్పటికీ పాత తరం ఆనవాళ్లు ఉన్నాయి. జనాభా, నగర విస్తీర్ణం, వాహనాలు పెరిగినంతగా రహదారులు విస్తరించలేదు

కొండారెడ్డి బురుజు- డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం దగ్గరి నుంచి రాఘవేంద్రస్వామి మఠం వెళ్లే రోడ్డు

ఓల్డ్‌ టౌన్‌లో పద్మవ్యూహంగా మారిన ట్రాఫిక్‌

పెరిగిన వాహనాల రద్దీ

తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

రహదారుల విస్తరణకు సిద్ధమైన నగర పాలక యంత్రాంగం

సర్వే చేస్తున్న పట్టణ ప్రణాళిక అధికారులు

కర్నూలు చారిత్రాత్మక నగరం. ఓల్డ్‌ సిటీలో ఇప్పటికీ పాత తరం ఆనవాళ్లు ఉన్నాయి. జనాభా, నగర విస్తీర్ణం, వాహనాలు పెరిగినంతగా రహదారులు విస్తరించలేదు. పైగా స్వార్థపరుల ఆక్రమణలతో కుచించుకుపోయాయి. దీంతో పాతబస్తీలో ట్రాఫిక్‌ పద్మ వ్యూహాన్ని తలపిస్తున్నది. బయటికి వెళ్లిన వ్యక్తి క్షేమంగా ఇల్లు చేరుతారనే నమ్మకం లేదు. 160 ఏళ్ల చరిత్ర కలిగిన ఓల్డ్‌ టౌన్‌ రోడ్లు విస్తరణకు నోచుకోకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. కర్నూలును స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేయాలని, నగరం రూపురేఖలు మార్చాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్‌ సంకల్పించారు. రోడ్ల అభివృద్ధిపై ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో అధికారుల తో చర్చించారు. ముఖ్యంగా పాత బస్తీలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి మూడు రహ దారుల విస్తరణ సర్వేకు సిటీ ప్లానింగ్‌ యంత్రాంగం సన్నాహాలు చేస్తు న్నది. మంత్రి టీజీ భరత్‌ లక్ష్యానికి రాజకీయ అడ్డంకులు లేకుండా పాతబస్తీ రోడ్ల విస్తరణ జరిగేనా..? అనేది ప్రజలను వేధిస్తున్న ప్రశ్న.

కర్నూలు, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): 12వ శతాబ్దం నుంచి కర్నూలు పట్టణం రాజులు, నవాబుల ఏలుబడిలో భాగం. 1839లో బ్రిటీష్‌ పాలన కిందకు వచ్చింది. 1947 వరకు ఆంగ్లేయుల పాలన సాగింది. ఆ సమయంలో 1866లో కర్నూలు మున్సిపాలిటీగా ఏర్పడింది. ఇంత చరిత్రగల గ్రేడ్‌-1 మున్సిపాలిటీ, స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ 1994లో నగరపాలక సంస్థ (కార్పొరేషన్‌)గా ఆవిర్భవించింది. 2002 ఫిబ్రవరిలో మేజర్‌ కల్లూరు గ్రామ పంచాయతీ, 2014 ఫిబ్రవరిలో మామిదాలపాడు, మునగాలపాడు, స్టాం టన్‌పురం పంచాయతీలను విలీనం చేశారు. నగర వైశాల్యం దాదాపు 69.51 చదరపు కిలోమీటర్లు ఉంది. 125 ఏళ్ల క్రితం అంటే 1901లో కర్నూలు పట్టణ జనాభా 25,376 మాత్రమే. 2011 జనాభా గణాంకాల ప్రకారం 4,60,184 మందికి చేరింది. ప్రస్తుత జనాభా 6.25 లక్షలు పైమాటే. జనాభాతో పాటు వాహనాలు విచ్చలవిడిగా పెరుగుతున్నా.. రహదారుల విస్తరణ చేయకపోవడంతో ప్రజలు పడుతున్న అవస్థలు ఎన్నో. ఓల్డ్‌ సిటీలో ఎక్కువగా సామాన్యులు, చిరు వ్యాపారులు, రోజు వారి కూలీలు ఎక్కువ. వాళ్లు ఇరుకు రోడ్లతో ఇబ్బందులు పడుతున్నారు.

రాజకీయ అడ్డంకులు

పాతబస్తీలో రోడ్ల విస్తరణకు పలుమార్లు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసినా.. రాజకీయ నేతల స్వార్థం, ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా పనులు జరగడం లేదు. ప్రధాన రహ దారుల పక్కన అత్యధికంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులను ప్రభావితం చేయగలిగే బడా వ్యాపారులు, ధనవంతులకు వాణిజ్య దుకాణాలు, బంగళాలు ఉన్నాయి. విస్తరణ ప్రతిపాదనలు వచ్చిన ప్రతిసారి తమ దుకాణాలు కాపాడుకోడానికి రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకొని రోడ్లు విస్తరణ జరగకుండా అడ్డుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఈ ప్రతిపాదన వచ్చింది. రోడ్ల విస్తరణలో వాణిజ్య దుకాణాలతోపాటు నివాసాలు కోల్పోయే వారికి నష్ట పరిహారం కోసం రూ.18 కోట్ల నిధులు మంజూరు చేశారు. అయితే.. అప్పటి విస్తరణ ప్రతిపాదన ఫైల్‌ బుట్టదాఖలు అయ్యింది. ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలు మిగిలాయి.

విస్తరణ జరిగేనా..?

కర్నూలు నగరం అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్‌ ఈనెల 17న సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ రవీంద్రబాబు, ఇన్‌చార్జి ఎస్‌ఈ శేషసాయి, సిటీ ప్లానర్‌ ప్రదీప్‌కుమార్‌ సహా వివిధ శాఖ అధికారులు హాజరు అయ్యారు. పాతబస్తీలో ట్రాఫిక్‌ సమస్య పరి ష్కారంపై చర్చిం చారు. రోడ్ల విస్తరణ, అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అందులో భాగంగానే ప్రధానమైన మూడు రోడ్లు విస్తరణ, అభివృద్ధిపై సర్వే చేసి ఏడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని టౌన్‌ సర్వేయర్‌ మద్దిలేటిని ఆదేశిస్తూ సిటీ ప్లానర్‌ ప్రదీప్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రీసర్వేలో డబ్ల్యూపీఆర్‌ఎస్‌లు జి. మహేశ్‌, ఎస్‌. ఇమ్మాన్యుయేలు, ఎం.జెబా అమ్రీన్‌, కె. హేమంత్‌రెడ్డి, కె. గోపాల్‌కృష్ణా, కె. కుమారిబాయి, హరిశ్రీనివాస్‌, అశ్వక్‌, సుధీర్‌, షెక్షావలి పాల్గొనాలని ఆదేశించారు.

విస్తరించే రహదారులు ఇవే

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కూడలి నుంచి రాఘవేంద్రస్వామి మఠం రోడ్డు 25-30 అడుగలు నుంచి 60అడుగులకు, శ్రీలక్ష్మీనరసింహ స్వామి కల్యాణ మండపం నుంచి చిన్న అమ్మవారిశాల వయా కింగ్‌ మార్కెట్‌, గడి యారం ఆస్పత్రి, పూలబజార్‌ రోడ్డు వెడల్పు 20 అడుగులకు ఉంటే 40 అడు గులకు, మించిన్‌ బజార్‌ నుంచి గడియారం అస్పత్రి వయా పెద్ద అమ్మ వారిశాల రోడ్డు 15-18 అడుగులకు నుంచి 30 అడుగులకు అభివృద్ధి చేసేం దుకు సర్వే చేపట్టారు. సిటీ ప్లానింగ్‌ నిబంధనలు మేరకు ఏ ఏ భవనాలు ఏ మేరకు కోల్పోయేదీ గుర్తించి మార్క్‌ వేస్తూ.. సమగ్ర వివరాలతో నివేదిక తయారు చేస్తున్నారు.

ప్రజల సహకరించాలి

ఓల్డ్‌ సిటీలో ఇరుకు రోడ్లతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్‌ రద్దీని అధిగమించాలంటే రోడ్ల విస్తరణ, అభివృద్ధి చేయకతప్పదు. ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలి.

- టీజీ భరత్‌, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి, కర్నూలు

రోడ్ల అభివృద్ధి సర్వే చేస్తున్నాం

పాతబస్తీలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు మంత్రి టీజీ భరత్‌ ఆదేశం మేరకు ప్రధానమైన మూడు రోడ్ల్ల విస్తరణ, అభివృద్ధికి సర్వే ప్రారంభించాం. వారం రోజుల్లో నివేదిక ఇస్తాం.

- ప్రదీప్‌కుమార్‌, సిటీ ప్లానర్‌, కర్నూలు

Updated Date - Jun 21 , 2025 | 11:14 PM