రతనాల సీమగా మారుస్తాం
ABN, Publish Date - Jul 28 , 2025 | 10:52 PM
రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ మాధవ్ పేర్కొన్నారు.
స్థానికసంస్థల ఎన్నికలో బీజేపీ జెండా ఎగరవేస్తాం
ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ మాధవ్
నంద్యాలలో భారీ ర్యాలీ
నంద్యాల కల్చరల్, జూలై 28(ఆంధ్రజ్యోతి): రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ మాధవ్ పేర్కొన్నారు. సోమవారం నంద్యాల సౌజన్య ఫంక్షన్‌హాలులో జిల్లాస్ధాయి విస్తృత సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ముందుగా పార్టీ కార్యాలయం చేరుకొని సీనియర్ కార్యకర్తలను సన్మానించారు. పద్మావతీనగర్ నుంచి వైజంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీలో నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సౌజన్య ఫంక్షన్ హాలులో ఏర్పాటుచేసిన సమావేశం లో మాధవ్ మాట్లాడారు. రాబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను త్వరలో పూర్తిచేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే సామాన్య ప్రజలకు కూడా పార్టీలో ఉన్నతస్థాయికి ఎదిగే అవకాశం ఉందన్నారు. జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు మాట్లాడుతూ నంద్యాల జిల్లాను స్పిరుచువల్ హబ్‌గా అభివృద్ది చేయాలన్నారు. కార్యకర్తలకు భరోసా ఇచ్చే నాయకుడు మాధవ్ అని ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి కొనియాడారు.
Updated Date - Jul 28 , 2025 | 10:52 PM