సిద్దాపురం ఆయకట్టును స్థిరీకరిస్తాం
ABN, Publish Date - Jul 28 , 2025 | 10:50 PM
సిద్దాపురం ఎత్తిపోతల పథకం పూర్తి ఆయకట్టును స్థిరీకరించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు.
వైసీపీ హయాంలో ప్రాజెక్ట్ అభివృద్ధి శూన్యం
ప్రస్తుతం రూ.9కోట్లతో పనులు, మరో రూ.86కోట్లతో ప్రతిపాదనలు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి
ఆత్మకూరు, జూలై 28(ఆంధ్రజ్యోతి): సిద్దాపురం ఎత్తిపోతల పథకం పూర్తి ఆయకట్టును స్థిరీకరించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోమవారం వెలుగోడు జలాశయం నుంచి ఎత్తిపోతల ద్వారా సిద్దాపురం చెరువుకు నీటివిడుదలను ప్రారంభించారు. ముం దుగా స్టేజ్-1 వద్ద పంపింగ్ మోటార్లకు పూజలు చేపట్టారు. అనంతరం డెలివరీ పాయింట్ వద్ద వీబీఆర్ జలాలకు గంగహారతి నివేదించారు. ఆ తర్వాత ఎడమ ప్రధాన కాల్వ తూము వద్దకు పాదయాత్రగా చేరుకుని చెరువు స్థితిగతులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2018 జనవరి 7వ తేదీన సీఎం చంద్రబాబు చొరవతోనే సిద్దాపురం ఎత్తిపోతలను ప్రారంభించినట్లు చెప్పారు. ఆక్రమంలోనే ప్రాజెక్ట్ అభి వృద్ధి మరిన్ని ప్రతిపాదనలు చేశామని గుర్తుచేశారు. వైసీపీ అధికా రంలోకి రావడంతో ప్రాజెక్ట్ నిర్వహణ అధ్వానంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా సిద్దాపురం ఎత్తిపోతల పథకం అభివృద్ధిపై దృష్టి సారించినట్లు వివరించారు. రూ.9కోట్ల నిధులను మంజూరు చేయించి ఎల్‌ఎంసీ, ఆర్‌ఎంసీ కెనాల్స్ తూముల వద్ద శాశ్వతమైన కాంక్రీట్ పనులతో పాటు మట్టికట్టపై జంగిల్ క్లియరెన్స్, తదితర పనులు చేపట్టామన్నారు. అదేక్రమంలో మండలంలోని ఇందిరేశ్వరం, శ్రీపతిరావుపేట, వెంకటాపురం, అమలాపురం, కృష్ణాపురం గ్రామాల్లోని సుమారు 5వేల ఎకరాల అదనపు ఆయకట్టు కోసం రూ.25కోట్లు, డిస్టిబ్యూరీ సిస్టమ్స్, ఫీల్స్ కెనాల్స్‌కు రూ.16కోట్లు, వీబీఆర్ నుంచి స్టేజ్-1 వరకు అప్రోచ్‌కెనాల్ కాంక్రీట్ బెడ్, లైనింగ్ పనుల కోసం రూ.30కోట్లు, ఓవర్ హెడ్ కరెంట్ లైన్ కోసం రూ.15కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయించామన్నారు. సిద్దాపురం చెరువు వద్ద ఎన్టీఆర్, బుడ్డా వెంగళరెడ్డి స్మృతివనాలను ఏర్పాటు చేసి పర్యాటక అభివృద్ధికి కృషిచేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కేసీ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి, టీడీపీ మండల, పట్టణాధ్యక్షులు రవీంద్రబాబు, వేణుగోపాల్, నాయకులు శేషిరెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, అబ్దుల్లాపురం బాషా, రాజారెడ్డి, మల్లె ఎలీషా, కొండలరావు, నజీర్‌అహ్మద్, వెన్నా శ్రీధర్‌రెడ్డి, స్వామిరెడ్డి, వెంకటరమణ, జనసేన పార్టీ నాయకులు శ్రీరాములు, అరుణ్, తెలుగుగంగ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 28 , 2025 | 10:51 PM