ఆలయాల్లో పురాతన కట్టడాలను కాపాడుతాం
ABN, Publish Date - Jun 09 , 2025 | 11:59 PM
ఆలయాల్లో పురాతన కట్టడాలను కాపాడేందుకు చర్యలు రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.
శ్రీశైలంలో రూ.6కోట్లతో రాతి కట్టడాల ఆధునికీకరణ
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
మహానందీశ్వరుడి ఆశీస్సులతో రాజకీయాల్లో ఎదిగా
న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
ఆలయ పరిసరాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
మహానంది, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): ఆలయాల్లో పురాతన కట్టడాలను కాపాడేందుకు చర్యలు రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. మహానంది ఆలయంలో భక్తుల వసతి కల్పనలో భాగంగా దేవదాయ శాఖ నిధులతో నిర్మిస్తున్న పలు అభివృద్ధి పనులకు సోమవారం మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఆలయం సమీపంలో రూ.10 కోట్లతో నిర్మిస్తున్న 55 వసతి గదుల సముదాయానికి భూమిపూజ, రూ.75 లక్షలతో ఏర్పాటు చేసిన స్టెయిన్ లెస్ స్టీల్ క్యూలైన్ పనులను ప్రారంభించారు. టీటీడీ రూ.1.60 కోట్లతో నిర్మించిన డార్మెంటరీ ప్రారంభం, రూ.3 కోట్ల టీటీడీ నిధులతో నిర్మిస్తున్న 16 గదుల వసతి సముదాయం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆలయాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే శ్రీశైలం ఆలయంలో ఒక స్వచ్ఛంద సంస్థ రూ.6కోట్లతో రాతి కట్టడాలను ఆధునికీకరిస్తుందన్నారు. మహానంది క్షేత్రంలో కూడ పురాతన కట్టడాలను కాపాడేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. విదేశాల్లోని ఆలయాల్లో రాతికట్టడాలకు నంద్యాల జిల్లాలోని ఆళ్ళగడ్డ నుంచి గ్రానైట్ రాళ్లను తరలిస్తున్నారని చెప్పారు. జిల్లాలో దేవదాయశాఖ పరిధిలో 200 ఆలయాలు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయన్నారు. సిక్స్ ఏ, సిక్స్ బి, సిక్స్ సి, సిక్స్ డి కింద రూ 7.34 కోట్ల నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ఆలయాల మాన్యం అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేక చట్టం తెచ్చామన్నారు.
మంత్రి ఫరూక్ మాట్లాడుతూ రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నికైన నాటి నుంచి తనకు మహానందితో ఎంతో అనుబంఽధం ఉందన్నారు. మహానందీశ్వరుడి ఆశీస్సులతోనే తాను ఇంతటి స్ధాయికి ఎదిగానని తెలిపారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ మహానంది క్షేత్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో దేవదాయశాఖ అధికారులు, మండలంలోని టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jun 09 , 2025 | 11:59 PM