సీమపై ప్రభుత్వ వైఖరిని ఎండగడతాం
ABN, Publish Date - Apr 19 , 2025 | 12:13 AM
రాయలసీమపై ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరఽథరామిరెడ్డి అన్నారు.
రాయలసీమ సాగునీటి సాధన సమితి
నంద్యాల మున్సిపాలిటీ, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): రాయలసీమపై ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరఽథరామిరెడ్డి అన్నారు. సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 9వ వార్షికోత్సవం సందర్భంగా మే 31న సిద్ధేశ్వరంలో జరిగే ప్రజా బహిరంగ సభకు తరలిరావాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో శుక్రవారం కరపత్రాన్ని ఆవిష్కరించారు. దశరఽథరామిరెడ్డి మాట్లాడుతూ సిద్ధేశ్వరం ఉద్యమ అనంతరం అలుగు నిర్మాణానికి సానుకూల సందేశాలిస్తూ గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి ఎత్తిపోతల, ఆర్డీఎస్ కుడి కాలువ తదితర నిర్మాణాల శంకుస్థాపన, హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పుకు పాలనా పరమైన అనుమతులు ఇచ్చిన పాలకులు వాటి పురోగతిపై నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. తెగిన అలగనూరు, అన్నమయ్య ప్రాజెక్టులపై సైతం ప్రదిపాదనలతోనే ప్రభుత్వం కాలం వెల్లిబుచ్చుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గోరుకల్లు రిజర్వాయర్‌కు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవటం సీమసై ప్రభుత్వ శీతకన్నుకు నిదర్శనమని అన్నారు. ఎన్టీఆర్ మానస పుత్రిక తెలుగు గంగ ప్రాజెక్టు పనులు అసంపూర్తిగా ఉండటం సీమ పట్ల పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. జలమే జీవం.. జలమే సర్వం అని చెప్పిన ముఖ్యమంత్రి కరువు, వలసలతో సహజీవనం చేస్తున్న రాయలసీమ ప్రజలను సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసి కాపాడాలని కోరారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు వైఎన్ రెడ్డి, సామాజిక విశ్లేకుడు గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, యాగంటి బసవేశ్వర రైతు సంఘం కన్వీనర్ ఎంసీ కొండారెడ్డి, రైతు నాయకులు శ్రీహరి, నిట్లూరు సుధాకర్ రావు, అలగనూరు రిజర్వాయర్ పరిరక్షణ సమితా నాయకులు ఈశ్వర రెడ్డి తదీతరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 19 , 2025 | 12:13 AM