విభిన్న ఆలోచనలతో ముందుకెళ్లాలి
ABN, Publish Date - Jun 09 , 2025 | 11:49 PM
‘విద్యార్థులు గేమ్ చేంజర్స్.. విభిన్న ఆలోచనలతో ముందుకెళ్తే విజయాలు సొంతమవుతాయి..’
టెక్నాలజీని వినియోగించుకోండి
మంత్రి టీజీ భరత్ పిలుపు
విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం
కర్నూలు ఎడ్యుకేషన్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): ‘విద్యార్థులు గేమ్ చేంజర్స్.. విభిన్న ఆలోచనలతో ముందుకెళ్తే విజయాలు సొంతమవుతాయి..’ అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. సోమవారం పెద్దపాడు శివారులోని ఓ ఫంక్షన్ హాలులో పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతిభా పురస్కారం అవార్డుతో పాటు రూ.20వేలు, సర్టిఫికెట్ అందజేయడం చాలా గొప్ప విషయమన్నారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలను అమలు చేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చరిత్ర సృష్టించారన్నారు. విద్యార్థులు కేవలం సాధకులు మాత్రమే కాదని, భవిష్యత్తులో ప్రపంచాన్ని మార్చేవారు కూడా అవుతారన్నారు. షైనింగ్ స్టార్స్‌గా ఎంపికైన వారు మిగతా విద్యార్థులకు స్ఫూర్తిగా ఉంటారన్నారు. తల్లిదండ్రులు తమ ఆలోచనలను పిల్లల మీద రుద్దవద్దని సూచించారు. పిల్లలు జీవితంలో ఏదీ కావాలనుకుంటున్నారో ఆ దిశగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందని, ఈ టెక్నాలజీని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విజయాలు సాధించాలన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులు మంచి మార్కులు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. విద్యకు పేదరికం అడ్డం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తుందని, అన్ని వసతులతో పాటు మంచి ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోందని చెప్పారు. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ రెసిడెన్షియల్ పాఠశాలకు ఆరు అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం పదో తరగతి పరీక్షలో ప్రతిభ చాటిన 142 మంది, ఇంటర్మీడియట్ పరీక్షలో ప్రతిభ చాటిన 35 మంది విద్యార్థులకు మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి, జాయింట్ కలెక్టర్ బి.నవ్య, డీఈవో శామ్యూల్ పాల్ మెడల్స్, సర్టిఫికెట్‌తో పాటు రూ.20వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సందీప్ కుమార్, డీవీఈవో సుధీర్, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Jun 09 , 2025 | 11:49 PM