8 పంపుల ద్వారా హంద్రీనీవాకు నీటి విడుదల
ABN, Publish Date - Jul 25 , 2025 | 11:10 PM
ఇరిగేషన్ అధికారులు హంద్రీనీవా కాలువకు నీటి విడుదలను క్రమక్రమంగా పెంచుతున్నారు.
2,720 క్యూసెక్కులు లిఫ్ట్
కాలువను పరిశీలించిన సీఈ నాగరాజు
కర్నూలు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఇరిగేషన్ అధికారులు హంద్రీనీవా కాలువకు నీటి విడుదలను క్రమక్రమంగా పెంచుతున్నారు. శుక్రవారం మరో పంపు పెంచి నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరు సమీపంలో హంద్రీనీవా పంపింగ్ స్టేషన్ (పీఎస్-2) నుంచి 8 పంపుల ద్వారా 2,720 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు అనంతపురం సీఈ నాగరాజు, కర్నూలు సర్కిల్-1 ఎస్‌ఈ నాగరాజు, ఈఈ ప్రసాద్‌రావుతో పాటు ఇంజనీర్లు కాలువను పరిశీలించారు. కాలువ ప్రవాహ సామర్థ్యం 3,850 క్యూసెక్కులకు డిజైన్ చేశారు. 12 పంపులు ఏర్పాటు చేశారు. 2012లో కృష్ణా జలాలు ఎత్తిపోతలు చేపట్టినా 1,800 నుంచి 2 వేల క్యూసెక్కులకు మించి ఎత్తిపోయలేని పరిస్థితి ఉండేది. సీఎం చంద్రబాబు సారథ్యంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఫేజ్-1లో 3,850 క్యూసెక్కులు ప్రవాహానికి వీలుగా రూ.690 కోట్లతో విస్తరణ పనులు చేపట్టి దాదాపుగా పూర్తి చేశారు. ఈ నెల 17న సీఎం చంద్రబాబు మాల్యాల వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి కృష్ణా జలాలు ఎత్తిపోతలు ప్రారంభించారు. ఇంజనీర్లు క్రమక్రమంగా 8 పంపులకు పెంచి 2,720 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. 12 పంపులతో పూర్తిస్థాయిలో నీటిని తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణగిరి మండలం అలంకొండ నుంచి మద్దికెర మండలం బురుజుల గ్రామం వరకు హంద్రీనీవా కాలువను సీఈ నాగరాజు, ఎస్‌ఈ పాండురంగయ్య, ఈఈ ప్రసాద్‌రావు సహా డీఈఈ, ఏఈఈలు పరిశీలించారు. 3,850 క్యూసెక్కులు నీటిని ఎత్తిపోస్తే సాఫీగా నీటి ప్రవాహం ఉంటుందా..? సింగిల్‌లైన్ రోడ్డు బిడ్జిల వద్ద ఏమైనా సమస్యలు తలెత్తుతాయా? పంపింగ్ స్టేషన్ల వద్ద ఉన్న ఇబ్బందులు తదితర అంశాలను పరిశీలించారు. ప్రభుత్వం సంకల్పం సాకారం చేసే దిశగా పూర్తిస్థాయిలో కృష్ణా జలాలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, క్షేత్రస్థాయిలో ఇంజనీర్లు అప్రమత్తంగా ఉన్నారని సీఈ నాగరాజు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.
Updated Date - Jul 25 , 2025 | 11:10 PM