వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలలు
ABN, Publish Date - Jun 14 , 2025 | 01:24 AM
నంద్యాల జిల్లా స్థాయి ప్రభుత్వ ఆస్పత్రిలో ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న స్టాఫ్‌నర్స్‌లను కాదని తక్కువ కాలం సర్వీస్ ఉన్న స్టాఫ్‌నర్స్‌ల పేర్లను బదిలీ అర్హత జాబితాలో చేర్చడం చర్చనీయాంశంగా మారింది.
14 ఏళ్ల సీనియార్టీని కాదని ఆరేళ్ల సర్వీస్ ఉన్నవారికి బదిలీ
జాబితా తయారీలో సిబ్బంది చేతివాటం
జోన్-4లో బదిలీల అర్హతపై అభ్యంతరాలు
నంద్యాల హాస్పిటల్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా స్థాయి ప్రభుత్వ ఆస్పత్రిలో ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న స్టాఫ్‌నర్స్‌లను కాదని తక్కువ కాలం సర్వీస్ ఉన్న స్టాఫ్‌నర్స్‌ల పేర్లను బదిలీ అర్హత జాబితాలో చేర్చడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బదిలీ ప్రక్రియ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆఫీసు సిబ్బంది చేతివాట ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ జోన్-4లో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. నంద్యాల జీజీహెచ్ అప్‌గ్రేడ్ కాకముందు నుంచి ఒకేచోట పనిచేస్తున్న స్టాఫ్‌నర్స్‌లకు బదిలీ వర్తింపజేయకపోవడంపట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది బదిలీ కాకుండా ఆఫీస్ సిబ్బందితో కుమ్మక్కై తమ పేర్లను జాబితాలో లేకుండా చేయించుకున్నట్లు సమాచారం. పరిశీలించాల్సిన జీజీహెచ్ అధికారులు సైతం వత్తాసు పలకడం గమనార్హం. నంద్యాల జీజీహెచ్‌లో అప్‌గ్రేడ్ కాకముందు నుంచి 2011లో 8మంది, 2019లో ముగ్గురు, 2016లో ఇద్దరు వెరసి 13మంది స్టాఫ్‌నర్స్‌లు పనిచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండేళ్లు దాటితే రిక్వెస్ట్ బదిలీ, అయిదేళ్లు దాటితే తప్పనిసరి బదిలీ కావాల్సి ఉంది. అయితే జీజీహెచ్‌లో పనిచేస్తున్న ఈ 13మంది స్టాఫ్‌నర్స్‌ల పేర్లు లాంగ్‌స్టాండింగ్ జాబితాలో పొందుపరుస్తూ కడప ఆర్డీకి ప్రతిపాదనలు పంపారు. కడప ఆర్డీ నుంచి లాంగ్‌స్టాండింగ్ జాబితాలో ఈ 13మంది స్టాఫ్‌నర్స్‌ల పేర్లు ఉన్నాయి. కాగా బదిలీ అర్హత జాబితాలో కేవలం ముగ్గురి పేర్లు మాత్రమే ఉండటం పలు అనుమానాలకు దారితీస్తోంది. అర్హుల జాబితాలో అందరి పేర్లు తొలగించాలే కానీ పది మంది పేర్లు లేకపోవడంలోని మతలబు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బదిలీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయనేందుకు ఈ జాబితానే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ తతంగమంతా నంద్యాల వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరిగిందా? లేక కడప ఆర్డీ కార్యాలయంలో చోటుచేసుకుందా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇంతకూ జీజీహెచ్ అప్‌గ్రేడ్ అయినప్పటి నుంచి ఈ పది మంది స్టాఫ్‌నర్స్‌ల సర్వీస్ కాలం లెక్కించారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ జీజీహెచ్ అప్‌గ్రేడ్ నుంచే సర్వీస్ లెక్కిస్తే లాంగ్ స్టాండింగ్ జాబితాలో ఆ పదిమంది స్టాఫ్‌నర్స్‌ల పేర్లు ఎందుకు చేర్చారో అధికా రులకే తెలియాలి. ఈ జాబితాలోని మతలబు తేల్చాలని ఉన్నతాధికారులకు వారు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. కాగా ముగ్గురు స్టాఫ్‌నర్స్‌లు బదిలీల అర్హత జాబితాపై గ్రీవెన్స్ సెల్‌ను ఆశ్రయించినట్లు సమాచారం.
Updated Date - Jun 14 , 2025 | 01:25 AM