బ‘యోగ్యం’ కానివి..!
ABN, Publish Date - May 29 , 2025 | 11:30 PM
ఆరుగాలం కష్టపడే అన్నదాతకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు కాగా మరో వైపు నకిలీ విత్తనాలు, మందులు తదితర వాటితో సైతం నిత్యం నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
నకిలీ బయో ఉత్పత్తులతో మోసపోతున్న అన్నదాతలు
రెచ్చిపోతున్న వ్యాపారులు, తయారీదారులు
పక్క రాష్ట్రాల నుంచి భారీగా సప్లయ్
రెండు సీజన్లలో అమ్మకాలు రూ.100 కోట్ల పైనే
కర్నూలు సమీప ప్రాంతాల్లో స్టాక్ పాయింట్లు
ఫర్టిలైజర్ షాపుల వద్ద కనిపించని సూచిక బోర్డులు
డీలర్లకు భారీగా నజరానాలు
మామూళ్ల మత్తులో వ్యవసాయ యంత్రాంగం
ఆరుగాలం కష్టపడే అన్నదాతకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు కాగా మరో వైపు నకిలీ విత్తనాలు, మందులు తదితర వాటితో సైతం నిత్యం నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా ఒకప్పుడు నకిలీ బయో ఉత్పత్తుల తయారీకి, అమ్మకాలకు అడ్డాగా ఉండేది. అప్పట్లో ఉన్నతాధికారులు ఉక్కుపాదం మోపడంతో నకిలీ బయో ఉత్పత్తుల తయారీ అయితే తగ్గింది. కానీ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నేటికీ జిల్లాలో స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేసి నకిలీ మాఫియా రెచ్చిపోతున్నారు. వ్యవసాయాధికారులకు మామూళ్లు ఇస్తూ ఈ వ్యవహారం కొనసాగిస్తున్నారు. అలాగే డీలర్లకు అత్యధిక కమీషన్ల ఆశ చూపుతూ అమ్మకాలు చేపడుతున్నారు. ఇప్పటికీ ఏటా రూ.కోట్లలో నకిలీ బయో ఉత్పత్తుల వ్యాపారం కొనసాగుతుండటం గమనార్హం.
కర్నూలు అగ్రికల్చర్, మే 29 (ఆంధ్రజ్యోతి): నకిలీ బయో ఉత్పత్తులతో అన్నదాతలు నిలువునా మునుగుతున్నారు. వ్యాపారులు, తయారీదారులు మాత్రం రెచ్చిపోతు న్నారు. ఒకప్పుడు నకిలీ బయో ఉత్పత్తుల తయారీకి, అమ్మకాలకు ఉమ్మడి కర్నూలు జిల్లా అడ్డాగా ఉండేది. ముడి సరుకులను పక్క దేశాలు, రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని మారుమూల గ్రామాల్లో బిల్డింగ్‌లు, గోదాములను అద్దెకు తీసుకుని బయో ఉత్పత్తులను తయారుచేసేవారు. వాటిని రైతులకు అంటగట్టేందుకు ఏకంగా కొను గోలు కేంద్రాలు, స్టాక్ పాయింట్లను కూడా నిర్వహించేవారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నకిలీ బయోఉత్పత్తుల వ్యాపారం ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో వంద కోట్లకు పైగానే నిర్వహిస్తున్నారు. రసాయనాలు లేని బయో ఉత్పత్తులను రైతులకు అమ్ముకు నేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బయో ఉత్పత్తులకు గుట్టుగా కెమికల్స్‌ను కలిపి తయారీదారులు పెద్దఎత్తున రైతులకు వీటిని అంటగడుతున్నారు.
బోర్డులు ఏర్పాటు చేయకుండానే..
ఈ చిత్రంలో కనిపిస్తున్న అంగడి బయట పురుగు మందులు, అదే విధంగా బయో ఉత్పత్తులు ఎంత పరిమాణంలో ఉన్నాయో వాటి ధరలు ఎంతో తెలిపే బోర్డు ఏర్పాటు చేయలేదు. ఈ దుకాణాలను పర్యవేక్షిస్తున్న కల్లూరు ఏవో శ్రీనివాసరెడ్డి మాత్రం ప్రతి దుకాణం ముందు తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేయాల్సిందేనని, తప్పనిసరిగా ఆ బోర్డుపై మందులు ఎంత పరిమాణంలో ఉన్నాయో, ఏ ధరకు అమ్ముతున్నారో నమోదు చేయాలని నోటీసులు కూడా డీలర్లకు అందజేసినట్లు స్పష్టం చేస్తున్నారు. కొత్తబస్టాండులో దాదాపు 20 అంగళ్లు ఉన్నాయి. ఎక్కడా క్రిమిసంహారక మందులు, బయో ఉత్పత్తులు ఏ కంపెనీలకు చెందినవి తమవద్ద ఉన్నదీ బోర్డు ఏర్పాటు చేయకపోవడం దారుణం. వ్యవసాయా ధికారులు తమను ఏమీ చేయలేరనే ధైర్యంతోనే డీలర్లు బోర్డులు ఏర్పాటు చేయకుండా నానా రకాల నకిలీ బయో ఉత్పత్తులు అమ్ముతున్నారని అనడానికి ఇదే సాక్ష్యం.
రైతులు మొగ్గు చూపుతుండటంపై...
జూన్ నుంచి మొదలయ్యే ఖరీఫ్ సీజన్‌తో పాటు ఆ తర్వాత రానున్న రబీ సీజన్‌లో చౌకగా బయో ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. దీంతో వీటి అమ్మకాలు వ్యాపారులకు, తయారీదారులకు కనకవర్షం కురిపిస్తున్నాయి. అమాయక రైతులు డీలర్లు, వ్యాపారుల మాటలు నమ్మి నకిలీ బయో ఉత్పత్తులను కొని వాటిని పంటలపై వినియోగిస్తున్నారు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టినా ఈ బయో మందులు పనిచేయక కళ్ల ముందే పంట ఎండిపోతుంటే.. రైతులు మరో దారి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో అనేకం.
ఉన్నతాధికారుల మాటలు..
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ శాఖ కమిషనర్‌గా పనిచేసిన మధుసూదన్ రావు నకిలీ బయో ఉత్పత్తుల తయారీదారులపై ఉక్కుపాదం మోపారు. కర్నూలు జిల్లాలో నకిలీ బయో ఉత్పత్తుల తయారీ, అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయని అప్పట్లో వ్యవసాయాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తయారీదారులు, డీలర్ల నుంచి భారీగా మామూళ్లు అందుతుండటంతో వ్యవసాయాధికారులు రాష్ట్ర ఉన్నతాధి కారుల మాటల్ని, హెచ్చరికలను పెడచెవిన పెడుతున్నారు.
గతంలో దిన్నెదేవరపాడులో హైవే పక్కనే ఉన్న గోదాములో హైదరాబాదుకు చెందిన వ్యక్తులు అద్దెకు తీసుకుని చైనా నుంచి ముడి సరుకులు తెప్పించి బాసిల్ అనే ప్రముఖ సంస్థ పేరుతో నకిలీ బయో ఉత్పత్తులు తయారుచేస్తుండగా విజిలెన్స్ అధి కారులు దాడులుచేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2 కోట్లుపైనే ఉంటుందని అప్పట్లో అంచనా వేశారు. కర్నూలు బాలాజీనగర్ కేశవరెడ్డి స్కూల్ సమీపం లోని గోదాముల్లో రూ.25 లక్షలు విలువ చేసే బయో మందులను (ఓసో కంపెనీ పేరుతో ఉన్న) క్రాంతి ట్రాన్స్‌పోర్టు ద్వారా తరలించేందుకు ప్రయత్నిస్తున్న సమాచారం తెలుసుకుని వ్యవసాయాధికారులు స్వాధీనం చేసుకున్నారు. పందిపాడు వద్ద ఒక పాతబిల్డింగులో ఉన్న రూ.10 లక్షలు విలువచేసే నకిలీ ఉత్పత్తులను స్వాధీ నం చేసుకున్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో కల్లూరు మండలంలోని వివిధ గ్రామాలతో పాటు కర్నూలు నగర శివారులోని బళ్లారిచౌరస్తా, ఉల్చాల, పందిపాడు తదితర గ్రా మాల్లో నకిలీ బయోఉత్పత్తులను గోదాముల్లో నిల్వచేసి స్థానిక పురుగుమందుల అంగళ్లకు చేరవేస్తున్నట్లు సమాచారం.
కొరవడిన నిఘా
ఉమ్మడి కర్నూలు జిల్లాలో నకిలీ బయోఉత్పత్తులు డీలర్లు రైతులకు అంటగడు తున్నారు. వీటితో రైతులు నష్టపోతూనే ఉన్నా వ్యవసాయ యంత్రాంగం మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తుందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఎక్కడైనా ఈ నకిలీ బయో ఉత్పత్తులు పట్టుబడితే జిల్లా అధికారులు కింది స్థాయి సిబ్బందికి మెమోలు జారీచేసి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. వీటి నకిలీ బయో ఉత్పత్తులను గతంలో కొంత మంది రైతులకు అమ్మేందు కోసం కర్నూలుతో పాటు పక్కనే ఉన్న అలంపూర్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఏకంగా స్టాక్ పాయింట్లను కూడా ఏర్పాటుచేసుకుని ఏకంగా కొనుగోలు కేంద్రాలను తెరిచారు. వివిధ రాష్ట్రాల్లో, కోస్తా జిల్లాలో, హైదరాబాదు పరిసరాల్లో ఈ నాసిరకం బయో ఉత్పత్తులను తయారుచేసి వాటిని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డీలర్లకు చేరవేసి పెద్దఎత్తున రైతులకు అంటగట్టేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. రూ.100లు విలువ చేసే బయో బాటిల్‌ను డీలర్లతో రైతులకు రూ.50కే అమ్మించి మిగిలిన రూ.50ను వారికి కమిషన్‌గా ఇస్తూ తమ ఉత్పత్తులను భారీగా అమ్ముకుంటున్నారు.
విజిలెన్స్ అధికారులు స్పందిస్తేనే...
విజిలెన్స్ విభాగం అధికారులు కూడా నకిలీ బయో ఉత్పత్తుల స్వాధీనానికి పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదనే ఫిర్యాదులు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. ఏటా రైతులు ఈ నకిలీ బయో ఉత్పత్తులపై ఆధారపడుతూ పంటలను నష్టపోతున్నారు. ఇప్పటికైనా నకిలీ బయో ఉత్పత్తుల స్వాధీనానికి విజిలెన్స్ అధికారులు, వ్యవసాయ శాఖ యంత్రాంగం సమన్వయంతో పనిచేసి తయారీదారులతో పాటు వీటి అమ్మకా లు చేపట్టిన డీలర్ల భరతం పట్టాలని అన్నదాతలు కోరుకుంటున్నారు.
ఉక్కుపాదం మోపుతాం
ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుండటంతో నకిలి బయో ఉత్పత్తుల తయారీతో పాటు వీటి అమ్మకాలను చేపడుతున్న డీలర్లపై ఉక్కుపాదం మోపేం దుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి అకస్మిక తనిఖీలు చేస్తున్నాం. ఎక్కడైనా ఈ నకిలీ బయో ఉత్పత్తులు పట్టుబడితే వారిపై కఠినచర్యలు తీసుకుంటాం. డీలర్ల లైసెన్సులు కూడా రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.
- వరలక్ష్మి, జేడీ వ్యవసాయ శాఖ
Updated Date - May 29 , 2025 | 11:30 PM