ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మరమ్మతులు మరిచారు..!

ABN, Publish Date - May 26 , 2025 | 12:06 AM

గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం దుస్థితి ఎవరికీ పట్టడం లేదు. గత వైసీపీ హయాంలో ఐదేళ్లు ఈ పథకం నిర్వహణ గాలికొదిలేశారు

మాధవరం స్టేజ్‌-1 పంప్‌హౌస్‌

గురు రాఘవేంద్ర ప్రాజెక్టు విద్యుత్‌ పంపులు, ట్రాన్స్‌ఫార్మర్ల్లు చోరీ

కాపర్‌ వైరు దోచుకెళ్లిన దుండగులు మరమ్మతులకు రూ.17.05 కోట్లతో ప్రతిపాదనలు

30,585 ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకం?

తుంగభద్రకు ముందే వరదొచ్చినా ఎత్తిపోసుకోలేని దైన్యం

గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం దుస్థితి ఎవరికీ పట్టడం లేదు. గత వైసీపీ హయాంలో ఐదేళ్లు ఈ పథకం నిర్వహణ గాలికొదిలేశారు. ఆ తర్వాత వచ్చిన కూటమి పాలనలో కూడా అదే స్థితే. ప్రాజెక్టు కాపలాదారులు (వాచ్‌ అండ్‌ వార్డ్డ్‌) లేరని గుర్తించిన దొంగలు రాత్రికిరాత్రే విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, ప్యానల్‌ బోర్డులు ధ్వంసం చేసి కాపర్‌వైరు, పవర్‌ ఆయిల్‌ దోచుకెళ్లారు. మరమ్మతులకు రూ.17.05 కోట్లు ఇవ్వాలని గతేడాది నవంబరు 1న ఇరిగేషన్‌ ప్రాజెక్ట్స్‌ సీఈ కబీర్‌బాషా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఎస్‌డీఎంఎఫ్‌ కింద రూ.1.28 కోట్లు ఇస్తే తాత్కాలిక మరమ్మతులతో సరిపుచ్చారు. శాశ్వత మరమ్మతులు కాగితాలకే పరిమితమైంది. తుంగభద్రకు ముందస్తు వరదొచ్చినా మెట్టపొలాలకు ఎత్తిపోయలేని దైన్య పరిస్థితి. ఈ ఏడాదైనా మరమ్మతులు చేయకపోతే 30,585 ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారనుంది.

కర్నూలు, మే 25 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అంటే గుర్తుకొచ్చేంది కరువు.. వలసలు. తుంగభద్ర చెంతనే ప్రవహిస్తున్నా కరువు రైతులకు క‘న్నీటి’ కష్టాలు తప్పడం లేదు. యేటేటా వందల టీఎంసీలు కృష్ణాలో కలసి సముద్రం పాలవుతున్నా మెట్టచేలకు మళ్లించలేని దైన్యపరిస్థితి ఉంది. తుంగభద్ర జలాలు ఎత్తిపోస్తే కరువు నేలలో పసిడి పంటలు పండించవచ్చని 2003లో టీడీపీ ప్రభుత్వం గుర్తించింది. అప్పటి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్ర మంత్రి బీవీ మోహన్‌రెడ్డి సీఎం చంద్రబాబును ఒప్పించి గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును సాధించారు. ఫేజ్‌-1 కింద రూ.177 కోట్లు మం జూరు చేయించారు. తుంగభద్ర వరద జలాలు 3.786 టీఎంసీలు ఎత్తిపోసి మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 66,815 ఎకరాలకు సాగునీరు అందించే 9 ఎత్తిపోతల పథకాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టి పూర్తి చేశారు. 2005లో ప్యాకేజీ-97 కింద రూ.65.21 కోట్లతో నాలుగు లిఫ్టులు, రూ.255 కోట్లతో పులికనుమ లిఫ్టు, రూ.119 కోట్లతో పులకుర్తి ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. అందులో పులికనుమ, పులకుర్తి లిఫ్టులు 15 ఏళ్లు కాంట్రాక్ట్‌ సంస్థ నిర్వహించాలి. మూగలదొడ్డి, బలసదొడ్డి, పులచింత, మాధ వరం, చిలకలడోణ, సోగనూరు, దుద్ది లిఫ్టులు జలవనరుల శాఖ, కృష్ణదొడ్డి, రేమట, మునగాల, కంబదహాల్‌, చింతమానుపల్లె ఎత్తిపోతల పథకాలు ఏపీ స్టేట్‌ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఐడీసీ) పర్యవేక్షణలో ఉన్నాయి. పంప్‌ హౌస్‌ల వద్ద రూ.కోట్లు ఖర్చు చేసి విద్యుత్‌ పంపులు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. గత వైసీపీ హయాంలో వీటి నిర్వహణకు ఐదేళ్లు ఒక్కపైసా నిధులు ఇవ్వలేదు. ఆపరేటర్లు, కాపలా సిబ్బంది (వాచ్‌ అండ్‌ వార్డు) కూడా లేరు. వేసవి సమయంలో అటువైపు ఇంజనీర్లు కన్నెత్తి చూడడం లేదు. దోపిడీ దొంగలకు ఇది అనుకూలంగా మారింది.

మహారాష్ట్రకు చెందిన దోపిడీ దొంగలు..

గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాలు పంప్‌హౌస్‌ల వద్ద కాపలాదారులు లేరని గుర్తించిన మహారాష్ట్రకు చెందిన దోపిడీ దొంగలు రెక్కీ నిర్వహించి లిఫ్ట్‌ల పంప్‌హౌస్‌ తలుపులు బద్దలుకొట్టి హెచ్‌టీ, హెల్‌టీ ప్యానల్‌ బోర్డులు, స్టార్టర్లు, పంప్‌హౌస్‌ల పక్కనే ఉన్న 1000 కేవీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం చేసి కాపర్‌ వైర్‌, కాయిన్స్‌, పవర్‌ ఆయిల్‌ దోచుకెళ్లారు. మూగలదొడ్డి, మాధవరం స్టేజ్‌-1, స్టేజ్‌-2, బసలదొడ్డి స్టేజ్‌-1, చిలకలడోణ స్టేజ్‌-1, స్టేజ్‌-2, సోగనూరు స్టేజ్‌-1, పులచింత స్టేజ్‌-1, స్టేజ్‌-2 ఎత్తిపోతల పథకాలు పంప్‌హౌస్‌ దగ్గర ఏర్పాటు చేసిన 1000 కేవీ విద్యుత్‌ 14 ట్రాన్స్‌ఫార్మర్లు ఽధ్వంసం చేశారు. మాధవరం స్టేజ్‌-1 లిఫ్ట్‌లో హెచ్‌టీ, ఎల్‌టీ ప్యానల్‌ బోర్డులు, స్టార్టర్లు, బలసదొడ్డి స్టేజ్‌-1 పంప్‌హౌస్‌లో ప్యానల్‌ బోర్డులు ధ్వంసం చేసి విలువైన కాపర్‌ వైర్‌, కాయిన్స్‌, పవర్‌ ఆయిల్‌ దోచుకెళ్లారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా ఎత్తిపోతల పథకాలను పరిశీలించిన కడప జిల్లాకు చెందిన ఇంటిగ్రేటెడ్‌ ఇంజనీరింగ్‌ సంస్థ ఎండీ శివశంకర్‌రెడ్డి ధ్వంసం చేసిన ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు పనికిరావని, కొత్తది ఏర్పాటు చేయాలని జీఆర్‌పీ ఇంజనీర్లకు నివేదిక ఇచ్చారు. జీఆర్‌పీ లిఫ్టుల్లో దోపిడీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. మహారాష్ట్రకు చెందిన ఐదుగురు దొంగలు ఈ దోపిడీలో పాల్గొన్నట్లు గుర్తించారు. వారిలో ఇద్దరిని అరెస్టు చేసి రూ.15-20 లక్షల విలువైన కాపర్‌వైర్‌ను రికవరీ చేశారు. నెలలు గడిచినా మరమ్మతులు మాత్రం చేయలేదు.

రూ.17.05 కోట్లు ఇవ్వండి

దోపిడీ దొంగలు ధ్వంసం చేసిన గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాలు శాశ్వత మరమ్మతులు చేయ లేదు. అలాగే.. 2024 ఏప్రిల్‌ నుంచి జూలై వరకు పంపులు ఆపరేట్‌ చేయలేదు. 2023-24లో నిధుల కొరతతో పంప్‌ హౌస్‌ల్లో ఎలకో్ట్ర-మెకానికల్‌ మరమ్మతు కూడా చేపట్టలేదు. దీంతో పలు లిఫ్టులు ఒక్క పంపుతోనే నీటిని ఎత్తిపోయాల్సి వస్తుంది. దీనికి తోడు ఐదేళ్లుగా నిధులు లేమితో ఆపరేటర్లు, వాచ్‌ అండ్‌ వార్డ్‌ సిబ్బంది లేకపోవడం నిర్వహణ ఎండ మావిగా మారింది. గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఎదుర్కొంటున్న మరమ్మతులు, నిర్వహణ సమస్యలపై గత ఏడాది జూన్‌ 25న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ (వీసీ)లో మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు యంత్రాల అత్యవసర మరమ్మతు కోసం ప్రతిపాదనలు పంపితే.. అదే ఏడాది అక్టోబరు 10న రూ.1.28 కోట్లు ఎస్‌డీఎంఎఫ్‌ నిధులు ఇచ్చారు. అత్యవసర మరమ్మతులు చేపట్టారు. శాశ్వత మరమ్మతుల కోసం రూ.17.05 కోట్లు నిధులు ఇవ్వాలని 2024 నవంబరు 1న ఉమ్మడి కర్నూలు జిల్లా ఇరిగేషన్‌ ప్రాజెక్ట్స్‌ సీఈ కబీర్‌బాషా రాష్ట్ర జలవనరుల శాఖకు ప్రతి పాదనలు పంపారు. నెలలు గడుస్తున్నా నిధులు ఇవ్వలేదు. మరమ్మతులు చేయకపోవడంతో ఆయా లిఫ్టుల కింద 30,585 ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది. తుంగభద్రలో ముందు గానే వరద మొదలైనా ఎత్తిపోసి కరువు నేలకు మళ్లించలేని పరిస్థితి ఉంది. ఎమ్మిగనూరు, కోడుమూరు ఎమ్మెల్యేలు బీవీ జయనాగేశ్వరరెడ్డి, బొగ్గుల దస్తగిరి, మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి ఎన్‌.రాఘవేంద్రరెడ్డి సీఎం చంద్రబాబును ఒప్పించి నిధులు మంజూరు చేయించాలి. జీఆర్‌పీ లిఫ్టులు మరమ్మతులు, నిర్వహణ బాధ్యతలు పక్కాగా చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

ఎత్తిపోతల పథకాల వారీగా మరమ్మతులకు అవసరమైన నిధులు (రూ.కోట్లల్లో), ఆయకట్టు (ఎకరాల్లో) వివరాలు

ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం అయకట్టు

మూగలదొడ్డి 1.53 3,793

బసలదొడ్డి 2.66 6,450

పులచింత 3.93 4,400

మాధవరం 2.14 4,211

చిలకలడోణ 2.25 4,083

సోగనూరు 3.64 4,648

దుద్ది 0.89 3,000

మొత్తం 17.05 30,585

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం

గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాల్లో గతేడాది దొంగలు పడి హెచ్‌టీ, హెల్‌టీ ప్యానల్‌ బోర్డులు, స్టార్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు పగులగొట్టి కాపర్‌, పవర్‌ వైర్‌ దోచుకెళ్లారు. దీనిపై సంబంధిత పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశాం. ఎస్‌డీఎంఎఫ్‌ నిధులతో అత్యవసరమైన తాత్కాలిక మరమ్మతులు చేశాం. శాశ్వత మరమ్మతులు, నిర్వహణ కోసం రూ.17.05 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. నిధులు రాగానే మరమ్మతులు చేపడుతాం. రైతులకు ఇబ్బందులు లేకుండా ఒక పంపుతో తుంగభద్ర జలాలు ఎత్తిపోసేలా ఏర్పాట్లు చేశాం.

- బాలచంద్రారెడ్డి, ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ, కర్నూలు

Updated Date - May 26 , 2025 | 12:06 AM