పాతుకుపోయారు..
ABN, Publish Date - Jun 18 , 2025 | 11:44 PM
పాతుకుపోయారు..
రెవెన్యూ కార్యాలయమే వారి అడ్డా
రెవెన్యూ ఉద్యోగుల బదిలీలలో పైరవీలు అదేస్థానంలో కొనసాగింపు
డిప్యుటేషన్ కోసం జాయింట్ కలెక్టర్‌కు ఫైలు
బదిలీ అయిన ఉద్యోగులకు రిలీవ్ చేయని రెవెన్యూ అధికారులు
గాడి తప్పిన రెవెన్యూ శాఖ
పాలనాపరంగా రెవెన్యూ శాఖ అత్యంత కీలకమైనది. డీఆర్వో కార్యాలయంలో కొందరు ఉద్యోగులు కొన్నేళ్లుగా పాతుకుపోయారు. రెవెన్యూ శాఖ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపణలున్నాయి. రెవెన్యూ సెక్షన్‌లో జరిగే బదిలీలు, పదోన్నతులు వంటి అంశాలను కింది స్థాయి ఉద్యోగులకు చేరవేసి అవరోధంగా తయారవుతున్నారు. ఇటీవల రెవెన్యూ ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ఈ బదిలీల్లో డీఆర్వో కార్యాలయంలో కొందరు ఉద్యోగులు పైౖరవీలు చేశారన్న విమర్శలున్నాయి. ఐదేళ్లు దాటిన వారికి తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ప్రభుత్వ ఉత్తర్వులను తుంగలో తొక్కి మరలా అదే సెక్షన్‌లో అదేస్థానం లేదంటే మరొక సెక్షన్‌లో స్థానాన్ని ఉన్నతాధికారులు కేటాయించారు. కొందరిని డిప్యుటేషన్‌పై కొనసాగించడానికి మరలా జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఫైల్ పెట్టడం కొసమెరుపు. దీంతో పాలన గాడితప్పిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కర్నూలు కలెక్టరేట్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): జిల్లా రెవెన్యూ కార్యాలయంలో పని చేసే కొందరు ఉద్యోగులకు కొన్నేళ్లుగా రెవెన్యూ కార్యాలయం అడ్డాగా మారింది. ప్రభుత్వాలు మారినా, వేరే ప్రాంతాలకు బదిలీ అయినా కూడా అదేస్థానంలో కొన్ని సంవత్సరాల నుంచి నేటికీ కొనసాగుతున్నారు. డీఆర్వో కార్యాలయంలో వీరు కొన్ని సంవత్సరాలుగా పాతుకుపోవడంతో జిల్లా రెవెన్యూ శాఖ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపణలున్నాయి. రెవెన్యూ సెక్షన్‌లో జరిగే బదిలీలు, పదోన్నతులు వంటి అంశాలను కింది స్థాయి ఉద్యోగులకు చేరవేసి అవరోధంగా తయారయ్యారన్న విమర్శలున్నాయి. డీఆర్వో కార్యాలయం నుంచి బదిలీ అయితే డీఎస్‌వో ఆఫీసుకు, మరలా బదిలీ అయితే.. డీఎస్‌వో నుంచి డీఆర్వో కార్యాలయానికి బదిలీ వస్తున్నారు. డీఆర్వో కార్యాలయంలోని ఏ నుంచి హెచ్ వరకు సెక్షన్‌లో కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్న కొందరు ఉద్యోగులు ఉన్నతాధికారులను శాసించే స్థాయికి ఎదిగారు. బదిలీలలో స్థానం మారినా కూడా ముడుపులతో సరిపుచ్చి డిప్యుటేషన్‌పై నేటికి కొనసాగుతున్నారు. రెవెన్యూ శాఖలో బదిలీలు పూర్తయ్యాయి. బదిలీల్లో నూతన స్థానాలు కేటాయించారు. నూతన స్థానాలు కేటాయించినా ఇంకా జిల్లా రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. బదిలీ ఉత్తర్వులు పొందిన ఇతర స్థానాల ఉద్యోగులు కొత్తస్థానాలకు వచ్చారు. పాత స్థానాల్లో కొనసాగుతున్న రెవెన్యూ కార్యాలయంలోని ఉద్యోగులను రిలీవ్ చేయకుండా 11 రోజులుగా రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు ఇవ్వడం లేదు. అధికారులు కాలయాపన చేస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి.
నామాటే శాసనం..
క్రిష్ణగిరి మండలం ఎమ్మార్వో కార్యాలయానికి చెందిన రెవెన్యూ అధికారి డీఆర్వో కార్యాలయంలోని ఏ-సెక్షన్‌లో అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు లేకుండా నేటికి అనధికారికంగా పని చేస్తున్నారు. క్రిష్ణగిరి ఎమ్మార్వో కార్యాలయంలో పని చేస్తున్నారా... డీఆర్వో కార్యాలయంలో పని చేస్తున్నారా అని ఆయనపై అనేక సందేహాలు వ్యక్తమవతుఉన్నాయి. ఆయనను ఎవరు అడిగినా డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నాను.. మరికొందరు అడిగితే ఉన్నతాధికారులు పిలిచారు కాబట్టి డీఆర్వో కార్యాలయానికి వచ్చానని సమాధానం చెబుతున్నారు. నేడు ఆయన మీద వీరాభిమానంతో ఏ సెక్షన్‌లో డిప్యుటేషన్‌పై కొనసాగించడానికి ఇటీవల జాయింట్ కలెక్టర్‌కు ఫైల్ పెట్టారు. పదోన్నతులు, బదిలీలు తదితర రెవెన్యూ అంశాల్లో ఆయన విపరీతమైన జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇటీవల గ్రేడ్-2 వీఆర్వో పదోన్నతుల నుంచి గ్రేడ్-1 పదోన్నతులు కల్పిస్తానని కొందరు వీఆర్వోలకు ఆశ కల్పించినట్లు సమాచారం. అదే విదంగా జిల్లా ఉన్నతాధికారులకు అందుతున్న ఆకాశరామన్న ఉత్తరాల ప్రమేయంపై ఆయన మీద సందేహాలు వ్యక్తమవుతున్నాయి..
బదిలీల్లో పైరవీలు
ఇటీవల రెవెన్యూ ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ఈ బదిలీల్లో డీఆర్వో కార్యాలయంలో కొందరు ఉద్యోగులు పైరవీలు చేశారని ఆరోపణలున్నాయి. ఐదేళ్లు దాటిన వారికి తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ప్రభుత్వ ఉత్తర్వులను తుంగలో తొక్కి మరలా అదే సెక్షన్‌లో అదే స్థానం లేదంటే మరొక సెక్షన్‌లో స్థానాన్ని ఉన్నతాధికారులు కేటాయించారు. ఏ సెక్షన్‌లో పనిచేస్తున్న ఏ1, ఏ7 దాదాపు పది సంవత్సరాలుగా అదేస్థానంలో మరలా బదిలీలలో నేటికి అదే పోస్టింగ్ ఇచ్చారు. బీ-సెక్షన్‌లోని బీ-1, సీ-సెక్షన్‌లోని సీ-1, డి-సెక్షన్‌లోని డీ-5, ఈ-సెక్షన్‌లోని ఈ-1, జీ-సెక్షన్‌లోని ఏ2, అలాగే మరికొందరు ఏడు నుంచి పదేళ్ల వరకు ఇక్కడే పని చేస్తున్నారు. కొందరిని డిప్యుటేషన్‌పై కొనసాగించడానికి మరలా జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఫైల్ పెట్టడం కొసమెరుపు. కొత్తవారికి అవకాశం ఇస్తే రెవెన్యూ శాఖ కార్యాలయం గాడిలో పడుతుందని ప్రజాసంఘాలు వ్యక్తం చేస్తున్నాయి.
రెండు రోజుల్లో రిలీవ్ చేస్తాం
బదిలీ అయిన ఉద్యోగులకు రెండులేదా మూడు రోజుల్లో రిలీవ్ చేస్తాం. బదిలీ అయిన స్థానాల్లో కొత్తవారు త్వరగా విధుల్లో చేరాలి. విధుల్లో చేరిన తర్వాత డీఆర్వో కార్యాలయంలో వీలైనంత త్వరగా నూతన స్థానాలను కేటాయిస్తాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టాం.
- వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జి డీఆర్వో, కర్నూలు
Updated Date - Jun 18 , 2025 | 11:45 PM