తడారిపోతున్న పల్లె గొంతు
ABN, Publish Date - Mar 19 , 2025 | 12:55 AM
తడారిపోతున్న పల్లె గొంతు
తాగునీటికి తల్లడిల్లుతున్న పశ్చిమ గ్రామాలు
76 పల్లెల్లో తీవ్ర ఎద్దడి
నీటి రవాణాకు రూ.3.90 కోట్లతో ప్రతిపాదనలు
ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవు
ఎండలు మండుతున్నాయి... మార్చిలోనే 41 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి.. పల్లెసీమల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి.. కందనవోలు జల కంఠాభరణంగా తుంగభద్ర నది ప్రవహిస్తున్నా దాహం తీరడం లేదు. ఎల్లెల్సీ, హంద్రీనీవా కాలువలు ఉన్నా.. గ్రామాల్లో తాగునీటికి అల్లాడుతున్నాయి.. జిల్లాలో 76 గ్రామాల్లో అరకొర తాగునీటి వసతులే ఉన్నాయి.. పల్లెలకు నీరు సరఫరా చేయడానికి రూ.3.90 కోట్లు నిధులు కావాలంటూ గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) ఇంజనీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పల్లెల్లో తాగునీటి ఎద్దడి ఎలా ఉందో తెలుసుకోడానికి ఇది చాలు. పశ్చిమ ప్రాంతంలోని మెజార్టీ గ్రామాల దాహం తీర్చడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అవసరంపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
కర్నూలు, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల్లో 484 పంచాయతీలు, 237 మజరా గ్రామాలు కలిపి 721 గ్రామాలు ఉన్నాయి. 33 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్) 354 గ్రామాలకు శుద్ధి చేసిన (ఫిల్టర్) తాగునీరు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మిగిలిన 367 గ్రామాలకు చేతిబోర్లు, పీడబ్ల్యూఎస్, ఎంపీడబ్ల్యూఎస్ పథకాలపై ఆధార పడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటితే.. ఈ పథకాలు ఒట్టిపోయి తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. సీపీడబ్ల్యూఎస్ పరిధిలో కూడా శివారు గ్రామాల్లో వారంలో ఒకటిరెండు రోజులు కూడా నీటి సరఫరా చేయడం లేదు. వేసవి ఎండలు బలపడడంతో పాటు గ్రామాల్లో తాగునీటి సమస్యలు కూడా తీవ్రం అవుతున్నాయి. ఎప్రిల్, మే, జూన్ మాసాల్లో నీటి సమస్యలు జఠిలం అవుతాయని క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు.
76 గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి
రాష్ట్రంలో కరువు మండలాలుగా గుర్తిస్తూ విపత్తుల నిర్వహణ శాఖ గత ఏడాది అక్టోబరు 29న జీఓ ఎంఎస్ నంబరు.15 జారీ చేసింది. దీని ప్రకారం జిల్లాలో 21 మండలాల్లో తీవ్రమైన కరువు, రెండు మండలాలను మధ్యంతర కరువు ప్రాంతాలుగా గుర్తించింది. ఈ నివేదిక ప్రకారం జిల్లాలో 76 గ్రామాల్లో వేసవిలో తీవ్రమైన నీటి ఎద్దడి ఎదుర్కునే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆ గ్రామాలకు తాగునీటి రవాణా (ట్రాన్స్‌పోర్టేషన్) కోసం రూ.3.90 కోట్లు, చేతిబోర్లు, పీడబ్ల్యూఎస్, ఎంపీడబ్ల్యూఎస్ పథకాల బోర్లు డీపెనింగ్, ఫ్లషింగ్, ఇతర మరమ్మతుల కోసం రూ.2.88 కోట్లు కావాలి. మొత్తం రూ.6.91 కోట్లకు ప్రతిపాదనలు పంపించారు. స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు పూర్తి చేసుకున్నా.. ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారా నీటిని రవాణా చేయాల్సి గ్రామాలు ఉన్నాయంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతున్నాయి.
తుంగభద్ర ఒట్టిపోతే.. పల్లె దాహం తీరదు!
జిల్లాలో 33 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్) ఉంటే.. ఎస్‌ఎస్ ట్యాంకులు 26 ఉన్నాయి. అందులో 24 ట్యాంకుల్లో 75 శాతం, రెండు ఎస్‌ఎస్ ట్యాంకుల్లో 25-50 శాతం మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. అవి కూడా 30 ఏళ్ల కిత్రం నిర్మించిన ఎస్‌ఎస్ ట్యాంకులు కావడంతో పెరిగిన జనాభాకు సరిపడా తాగునీరు సరఫరా చేయలేని పరిస్థితి ఉంది. కౌతాళం మండలం హాల్వి, కోసిగి మండలం సాతనూరు, మంత్రాలయం మండలం మంచాల, నందవరం మండలం చిన్నకొత్తిలికి, నాగులదిన్నె, సుంకేసుల సీపీడబ్ల్యూఎస్ పథకాలు తుంగభద్ర ఆధారంగా నిర్మించారు. 1989లో అమలు చేసిన ఎన్‌ఏపీ వాటర్ స్కీం, 1999లో అమలు చేసిన నంద్యాల వాటర్ సప్లయ్ స్కీంలో భాగంగా వీటిని నిర్మించారు. అప్పట్లో తుంగభద్రలో ఏడాది పొడవున నీటి ప్రవాహం ఉండడంతో ఎస్‌ఎస్ ట్యాంక్‌లు లేకుండా నది ప్రవాహ నీటిని ఎత్తిపోసి.. ఆ శుద్ధి చేసి సరఫరా చేసేవారు. ప్రస్తుతం తుంగభద్రకు వరద రోజులు తగ్గిపోయాయి. వేసవిలో చుక్కనీరు లేకుండా ఎండిపోతుంది. హాల్వి, మంచాల నీటి పథకాలకు మాత్రమే ఆరేడేళ్ల క్రితం ఎస్‌ఎస్ ట్యాంకులు నిర్మించారు. చిన్నకొత్తిలికి, నాగులదిన్నె నీటి పథకాలు నదిపై ఆధారపడ్డాయి. నది ఎండిపోతే ఆ స్కీం పరిధిలోని గ్రామాలకు నీటి కష్టాలు తప్పడం లేదు. జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలో భాగంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి అవసరం ఎంతైనా ఉంది.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం
జిల్లాలో వేసవిలో ఏ గ్రామంలో కూడా తాగునీటి సమస్యలు తలెత్తుకుండా ముందస్తు చర్యలు చేపట్టాం. ఇప్పటికే అవసరమైన గ్రామాల్లో బోర్లు, పీడబ్ల్యూఎస్ పథకాలు మరమ్మతులు చేస్తున్నాం. జిల్లాలో 76 గ్రామాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని అంచనా వేశాం. ఆ గ్రామాలకు తాగునీటి రవాణా చేసేందుకు ముందస్తు ప్రణాళికతో రూపొందించాం.
- నాగేశ్వరరావు, ఎస్‌ఈ, గ్రామీణ తాగునీరు, పారిశుద్ధ్యిం విభాగం, కర్నూలు
నీటి రవాణా కోసం ప్రతిపాదించిన మండలాలు, గ్రామాలు
మండలం గ్రామాలు
ఆదోని బిల్లెకల్లు, బస్సాపురం, చిన్నగోనేహాల్,
చిన్నహరివాణం, గణేకల్లు,
జాలిమంచి, కుప్పగల్,
పాండవగల్లు, కలకలకొండ
కౌతాళం బదినేహాల్, కుంటనహాల్,
మదిరె, పొదలకుంట, తోవి, ఉప్పరహాల్
ఆస్పరి జొహరాపురం, డి. కోటకొండ, తొగలగల్లు,
మంత్రాలయం చెట్నెహల్లి, కల్లుదేవకుంట
కోసిగి దుద్ది, కోసిగి, నేలకోసిగి
హలహర్వి మెదేహాల్, ఎంకేపల్లి, బివినేహాల్, శ్రీధర్‌హాల్
గూడూరు గుడిపాడు, గుడిపాడు, పొన్నకల్లు,
కె. నాగులాపురం, మల్లాపురం, పెంచికలపాడు
సి.బెళగల్ సి.బెళగల్, బ్యాతోలి, పలుకుదొడ్డి, పోలకల్
కోడుమూరు బైనదొడ్డి, మెరుగుదొడ్డి,
పులకుర్తి, రామచంద్రాపురం
మద్దికెర మదనంతాపురం, బురుజుల
పత్తికొండ చక్రాల, చందోలి, అటికలగుండు, నలకదొడ్డి
తుగ్గలి బాటతాండ, లింగనేనిదొడ్డి, సీజీ తాండ,
చెరువు తాండ, జప్లతాండ,
లక్ష్మితాండ, మిద్దెతాండ,
వాగులగుడిసెలు, లంకాయపల్లి,
రోళ్లపాడు, ఆర్‌ఎస్ పెండేకల్లు, రోళ్లపాడు తాండ
కల్లూరు ఎ. గోకులపాడు, పర్ల, సలకాపురం,
తడకనపల్లె, ఉల్లిందకొండ
ఓర్వకల్లు చెన్నంశెట్టిపల్లి, గుడుంబావితాండ,
తిప్పాయిపల్లి, ఉప్పలపాడు, వెంకటాపురం
కర్నూలు అంబేద్కర్‌నగర్, బసవాపురం,
దిగువపాడు, ఆర్‌కే దుద్యాల,
ఆర్.కొంతలపాడు, రేమట, తులిసాపురం
జిల్లాలో తాగునీటి వివరాలు
మొత్తం గ్రామాలు : 721
సీపీడబ్ల్యూఎస్ స్కీంలు,
నీళ్లిచ్చే గ్రామాలు : 33 స్వీంలు, 354 గ్రామాలు
నిర్వహణ వ్యయం : రూ.49.28 కోట్లు
తీవ్ర నీటి ఎద్దడి గ్రామాలు : 76
నీటి రవాణా, బోర్ల
మరమ్మతుల అంచనా : రూ.6.91 కోట్లు
Updated Date - Mar 19 , 2025 | 12:56 AM