ఆశల అన్వేషణ..
ABN, Publish Date - May 27 , 2025 | 11:43 PM
వర్షాలు పడితే చాలు ప్రతి ఒక్కరూ వేట షురూ చేస్తారు.
తొలకరి వర్షం కోసం ఎదురుచూపు
వజ్రాల కోసం వేలాదిగా వస్తున్న జనం
బస్టాండ్, ఆలయాల ప్రాంగణాలే వారి ఆవాసాలు
పత్తికొండ ప్రాంతానికి వేలాదిగా వస్తున్న ఆశావహులు
వర్షాలు పడితే చాలు ప్రతి ఒక్కరూ వేట షురూ చేస్తారు. అది మామూలు వేట కాదు.. వజ్రాల వేట. వర్షం తమకు అదృష్టాన్ని తీసుకొస్తుందా? లేదా? అని ఆశగా చూస్తుంటారు. సాధారణంగా వర్షాకాలం మొదలైందంటే అన్నదాతలు ఆకాశం వైపు చూస్తారు. చినుకు పడితే చాలు వారి ఆనందానికి అవధులు ఉండవు. కానీ అక్కడ మాత్రం రైతులతో పాటు సామాన్య ప్రజలు, ఉద్యోగులు వేలాదిగా తరలివచ్చి వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు. వరుణ దేవుడి రాక కోసం ప్రార్థనలు చేస్తారు. ఒక్క తొలకరి వర్షంతో లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోవాలనే ఆశతో వజ్రాల అన్వేషణ చేస్తుంటారు. తొలకరి వర్షాలతో భూ ఉపరితలంపై ప్రత్యక్షమయ్యే వజ్రాల కోసం పత్తికొండ, తుగ్గలి, మద్దికెర ప్రాంతాలకు వేలాది మంది తరలివస్తుంటారు. కర్నూలు, అనంతపురం, మహబూబ్ నగర్, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి సైతం ఈ వజ్రాలను వెతికేందుకు కార్లు, ప్రత్యేక వాహనాల్లో ఆశగా వస్తున్నారు.
పత్తికొండ, మే27 (ఆంధ్రజ్యోతి): ఒక్కరాయి దొరికితే తలరాత మారిపోతుంది. తమకష్టాలను తీర్చే ఆవిలువైన రాళ్ల కోసం అక్కడి పంటపొలాల్లో ఒళ్లంతా కళ్లుచేసుకుని వెతుకులాట సాగిస్తుంటారు. మట్టిలో దాగిఉన్న తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వందల మైళ్ల దూరం నుంచి ఆశల అన్వేషణకు ప్రజలు తరలివస్తుంటారు. పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని తుగ్గలి, మద్దికెర మండలాల పరిధిలోని ఎర్రగుడి, జొన్నగిరి, చిన్నజొన్నగిరి, పగడిరాయి, అమినేబాద్, తుగ్గలి, మదనంతపురం, పెరవలి పంట పొలాల్లో విలువైన వజ్రాలు దొరుకుతుంటాయి. ఇక్కడి నేలల్లో నేలపొరల్లో వజ్రాలు, బంగారు నిక్షేపాలు దాగి ఉండడమే అందుకు కారణంగా శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా తేల్చిచెప్పారు. భూమిపొరల్లో మార్పులు సంభవించినప్పుడు కొన్నివజ్రాలు ఉపరితలానికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు సైతం ధృవీకరించారు. పంటపొలాలను రైతులు దుక్కిదున్నినప్పుడు ఇక్కడి నేలలో దాగి ఉన్న వజ్రాలు బయటకు కనిపిస్తుంటాయి.
భూమిలో దాగి ఉన్న నిక్షేపాలు
ఎర్రగుడి నుంచి తుగ్గలి వరకు ఎస్ ఆకారంలో ఉన్న బంగారు నిక్షేపాలపై 1990 నుంచే కేంద్ర ప్రభుత్వం పలు పరిశోధనలు చేసింది. అందుకు సంబంధించి బంగారు నిక్షేపాలు తవ్వేందుకు అస్ట్రేలియాకు చెందిన కంపెనీకి లీజును ఖరారు చేసింది. బంగారు తవ్వకాల కోసం ఇప్పటికే కంపెనీ ఇప్పటికే పలు పరిశోధనలు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధమై ఉంది. దీనికి తోడు భూమిపొరల్లో వేల అడుగుల లోతులో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు కూడా ప్రభుత్వం కనుగొంది. అయితే అంత లోతులో ఉన్న నిక్షేపాలు వెలికితీయడం సాధ్యం కాదని ఆ ఆలోచనకు స్వస్తి చెప్పింది.
సుదూర ప్రాంతాల నుంచి
విలువైన వజ్రాల కోసం స్థానిక ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి వజ్రాన్వేషణ చేస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లో అణువణువు గాలిస్తూ వజ్రాల కోసం వెదుకుతుంటారు. వెతికేందుకు వచ్చిన రోజే వజ్రం దొరికితే అమ్ముకుని ఆ డబ్చుతో వారి ప్రాంతాలకు ఆనందంగా వెళ్తారు. ఏళ్ల తరబడి వజ్రాల కోసం వెదుకుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చే ఆశావహులు ఇక్కడ కనిపిస్తుంటారు. వచ్చే ఏడాదైనా తమకు వజ్రం దొరకకపోదా తమ కష్టం తీరకపోదా అని నమ్మకంతో నిరాశతో మరికొందరు తిరుగుముఖం పడుతుంటారు.
బస్టాండ్, దేవాలయాల ప్రాంగణాలే ఆవాసాలు
సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు పత్తికొండ ప్రాంతానికి వజ్రాన్వేషణకు వస్తుంటారు. ఒకసారి వచ్చినవారు మూడు, నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉంటూ వజ్రాన్వేషణ చేస్తుంటారు. గ్రామీణ ప్రాంతాలు కావడంతో వీరు సమీపంలోని బస్టాండ్లు, దేవాలయ ప్రాంగణాల్లో ఆవాసం ఏర్పరుచుకుంటారు. ఎలాంటి సదుపాయాలు అందుబాటులోలేని ఈ ప్రాంతంలో చలికి, వానకు ఇబ్బందులు పడుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు.
రెండేళ్లుగా వస్తున్నా...
ఈ ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయని పత్రికల్లో, టీవీల్లో చూసి తెలుసుకున్నా. రెండేళ్లుగా వజ్రాలు వెదికేందుకు ఇక్కడికి వస్తున్నాను. వారం, రెండు వారాలు ఇక్కడే ఉండి వెతికి వెళ్లిపోతున్నా. ఈసారైనా వజ్రం దొరుకుతుందన్న ఆశతో వచ్చాను.
- శ్యాంబాబు, గుంటూరు
కుటంబమంతా వచ్చాం
ఈ ప్రాంతంలో వజ్రాల గురించి నాకొడుకు తెలుసుకుని పోయినసారి వచ్చాడు. ఈసారి నాకొడుకుతో పాటు నేను మా ఆయన అందరం వచ్చాం. అదృష్టం తగిలి వజ్రం దొరికితే మాపాత ఇంటిని కొత్త ఇంటిగా మార్చుకుంటాం.
- లలితాబాయి, నల్లమాడ మండలం, శ్రీసత్యసాయి జిల్లా
ఈసారే వచ్చాం
మాది కర్నూలుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరు. ఇంటి దగ్గర పరిచయం ఉన్న నలుగురం కలిసి ఈసారే వజ్రాలు వెతికేందుకు వచ్చాం. తినేందుకు ఇంటి దగ్గరి నుంచి రొట్టెలు తెచ్చుకున్నాం. మూడు రోజులు ఇక్కడే ఉండి మా అదృష్టం ఎలాఉందో చూసుకుంటాం.
- లక్ష్మి, కర్నూలు
అమ్మాయి పెళ్లి చేశా, ఇళ్లు కట్టుకున్నా
మాది ఒంగోలు దగ్గర చిన్నపల్లెటూరు, నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు. కూలీచేస్తూ వారిని పోషిస్తున్నాను. ఈ ప్రాంతంలో వజ్రాల గురించి టీవీల్లో చూసి పోయిన సారి జూన్‌లో వజ్రాలు వెదికేందుకు వచ్చాను. రెండు వజ్రాలు దొరికాయి. ఒకటి రూ.4.5 లక్షలు, మరొకటి రూ.7 లక్షలకు విక్రయించి ఆ డబ్బుతో ఇంటికి వెళ్లాను. మా కుమార్తె వివాహం చేశాను. పాత ఇంటిని కొత్తగా మార్చుకున్నాను. ఈ ఏడాది మరోసారి దొరికితే మరో కుమార్తె వివాహం చేయాలని వచ్చాను.
- దేవయ్య, ఒంగోలు
పది మందితో వచ్చాం
మాది అన్నమయ్య జిల్లా మదనపల్లి దగ్గర చిన్న ఊరు. పది మందితో వజ్రాలు వెతికేందుకు వచ్చాం. వారంపాటు ఇక్కడే ఉంటాం. ఏదో గుడిలో పడుకునేందుకు ఏర్పాటు చేసుకుని అక్కడే తినేందుకు వంట తయారు చేసుకుంటాం. వజ్రం దొరికితే మా పేదరికం పోతుందని, మా పిల్లలకు ఆ డబ్చులు పనికొస్తాయన్న ఆశతో వచ్చాం.
- బేబమ్మ, మదనపల్లి, అన్నమయ్య జిల్లా
Updated Date - May 27 , 2025 | 11:43 PM