ప్రభుత్వమే పొగాను కొనాలి
ABN, Publish Date - Jun 24 , 2025 | 11:00 PM
పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆంద్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేష్‌కుమార్, రాజశేఖర్ డిమాండ్ చేశారు.
రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా
జాతీయ రహదారి దిగ్బంధం
నంద్యాల నూనెపల్లె, జూన్ 24 (ఆంధ్రజ్యోతి) : పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆంద్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేష్‌కుమార్, రాజశేఖర్ డిమాండ్ చేశారు. జిల్లాలో పొగాకు పండించిన రైతాంగం గత రెండు నెలల నుంచి కొనుగోలు చేయాలని ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేయకుండా తాత్సారం వహించడంతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పొగాకు రైతులు పెద్ద ఎత్తున మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. పొగాకు బేళ్లను కుప్పగా పోసి నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ధర్నాను విరమింపజేయాలని త్రీ టౌన్ సీఐ కంబగిరిరాముడు, సిబ్బంది చెప్పినప్పటికీ సంఘం నాయకులు, రైతులు కలెక్టరేట్ ఎదుట ఉన్న కర్నూలు-కడప జాతీయ రహదారిపై బైఠాయించి దిగ్బంధించారు. ఆందోళనను విరమింపజేయాలని పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సీఐ కంబగిరి రాముడు నచ్చచెప్పడంతో రైతులు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పొగాకు కొనుగోలులో జరుగుతున్న లోపాలపై చర్చించి మూడురోజుల్లోపు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని జేసీ చెప్పడంతో రైతులు ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ కంపెనీలు ఒప్పందం ప్రకారం పొగాకును కొనుగోలుచేయకపోవడంతో రైతులు రూ. లక్షల్లో నష్టపోవాల్సివస్తోందని, ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు, సుబ్బరాయుడు, వెంకటేశ్వరరావు, నరసింహుడు, మార్క్, సుధాకర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
Updated Date - Jun 24 , 2025 | 11:01 PM