కందనవోలుది ఘనకీర్తి
ABN, Publish Date - Jul 01 , 2025 | 12:46 AM
కందనవోలుది ఘనకీర్తి
1858లో జిల్లాగా ఆవిర్భావం
ఆంధ్ర రాష్ట్ర మొదటి రాజధాని కర్నూలు
మార్కాపురం, కంభం,ఎర్రగొండపాలెం కందనవోలులో భాగమే
ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు 1953లో కర్నూలు జిల్లాలో విలీనం
నేటి కేఎంసీ ఫోరెన్సిక్ భవనమే నాటి కలెక్టర్ బంగ్లా
ప్రప్రథమంగా పద్మశ్రీ అవార్డు గ్రహీతలు జిల్లా వాసులే
తొలి దళిత సీఎం దామోదరంసంజీవయ్య మనవారే
నేడు కర్నూలు జిల్లా ఆవిర్భావ దినోత్సవం
రాయలసీమ ముఖద్వారం కర్నూలు.. రాజులు, చక్రవర్తులు, నవాబులు, పాలేగాళ్లు పాలించిన నేల ఇది. బ్రిటీష్ పాలకులు భరత గడ్డపై అడుగు పెట్టాక వారి పెత్తనాన్ని సవాల్ చేస్తూ తొలి తిరుగుబాటుకు బీజం వేసిన ఘనచరిత్ర మనది. పాలేగాళ్ల పాలనకు స్వస్తి చెప్పాలని రాయలసీమ జిల్లాలను దత్త మండలాలుగా ప్రటించారు. పాలన సౌలభ్యం కోసం బ్రిటీష్ పాలకులు జిల్లాలను ఏర్పాటు చేశారు. మొదట కడప, బళ్లారి జిల్లాలు ఉండేవి. ఆ తరువాత కర్నూలు జిల్లా 1858 జూలై 1న ఆవిర్భవించింది. నేటితో 167 వసంతాలు పూర్తి చేసుకున్న కర్నూలు జిల్లా ఘనచరిత్రపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
కర్నూలు, జూలై 30 (ఆంధ్రజ్యోతి): బ్రిటీష్ పాలకులు దత్త మండలాల(రాయలసీమ జిల్లాలు)ను 1801లో కడప, బళ్లారి రెండు జిల్లాలుగా చేశారు. ప్రస్తుత ఉమ్మడి కర్నూలు జిల్లా సగ భాగం కడపలో, మరో సగభాగం బళ్లారి జిల్లాలో ఉండేవి. అంతకుముందు 1800 నవంబరు 1న థామస్‌మన్రో దత్త మండలాలకు ప్రధాన కలెక్టర్ బాధ్యతలు స్వీకరిం చారు. ఆతరువాత నాలుగు జిల్లాలుగా ఏర్పాటు చేశారు. 1858లో కడప జిల్లా నుంచి విడిపోయి కర్నూలు జిల్లా, బళ్లారి జిల్లా నుంచి కొంత భాగం విడదీసి అనంతపురం జిల్లాను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ విభాగం నిర్వహిస్తున్న భవనమే కర్నూలు జిల్లా తొలి కలెక్టర్ బంగ్లా. కర్నూ లు, నందికొట్కూరు, రామళ్లకోట, పత్తికొండ, నంద్యాల, శిరువెళ్ల, మార్కాపురం, కంభం తాలుకాలు కలిపి కర్నూలు కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం వచ్చే వరకు జిల్లా స్వరూపంలో ఏ మార్పు రాలేదు. స్వాతం త్య్రం తరువాత కూడా బనగానపల్లె సంస్థానం కొన్నాళ్లు స్వతంత్రంగానే ఉన్నా.. 1948 సెప్టెంబరు 18న కర్నూలు జిల్లాలో అంతర్భాగం అయ్యింది. 1953లో మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి.. కర్నూలు రాజధాని కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది. అదే ఏడాది అక్టోబరు 1న బళ్లారి జిల్లా నుంచి ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు తాలుకాలను విడిదీసి కర్నూలులో విలీనం చేశారు. అయితే.. రాయలసీమ (దత్త మండలాలు)లో భాగమైన బళ్లారిని కోల్పోక తప్పలేదు.
జిల్లాల పునర్విభజన తరువాత..
కేంద్ర ప్రభుత్వం 1971లో జిల్లాలు పునర్విభజన చేశారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న మార్కాపురం, గిద్దలూరు, కంభం, ఎర్రగుండపాలెం నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో కలిపేశారు. కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ, నందికొట్కూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, కోవెలకుంట్ల, బనగానపల్లె, డోన్ నియోజకవర్గాలతో కర్నూలు మిగిలింది. నియోజకవర్గాల పునర్విభజనతో కోవెలకుంట్ల కనుమరుగై పాణ్యం, మంత్రాలయం నియోజకవర్గాలు ఏర్పాడ్డాయి. ఆత్మకూరు స్థానంలో శ్రీశైలం నియోజకవర్గం వచ్చింది. 2022లో జిల్లాలో పునర్విభజనతో 167 ఏళ్లు పాటు కర్నూలు జిల్లాలో అంతర్భాగంగా ఉన్న నంద్యాల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడింది. కర్నూలు జిల్లాలో కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గంలోని రెండు మండలాలలో కర్నూలు జిల్లా మిగిలింది. నంద్యాల, బనగానపల్లె, ఆళ్లగడ్డ, డోన్, నందికొట్కూరు, శ్రీశైలం నియోజకవర్గాలతో నంద్యాల జిల్లా ఏర్పడింది.
తొలి తిరుగు బాటు..
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్ పాలకుల వార్ రూంలోకి మన జిల్లాకు చెందిన రాజ నీతిజ్ఞుడు ఆర్కాట్ రామస్వామి మొదిలియర్ ఆహ్వానం పలికారు. జిల్లాకు చెందిన తెర్నేకల్లు ముత్తుకూరు గౌడప్ప, కర్నూలు నవాబు గులాం రసూల్‌ఖాన్, పాలేగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా తొలి తిరుగబాటు చేశారు. 1908లో జిల్లాకు చెందిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు బ్రిటీష్ పాలకులు తొలి రాజకీయ ఖైదీగా అరెస్టు చేశారు. స్వాతంత్య్రం తరవాత కర్నూలు చెందిన సర్దార్ నాగప్ప రాజ్యంగ సభకు ఎన్నికై రాజ్యాంగ నిర్మాణంలో సభ్యుడు అయ్యారు.
జిల్లానుంచి విద్యారంగం, రాజనీతిలో ఆర్కాట్ లక్ష్మణస్వామి మొదిలియార్, ఆర్కాట్ రామస్వామి మొదలియార్ సోదరులు, పారిశ్రామికవేత్తగా ఎమ్మిగనూరు మాచాని సోమప్పలు 1954లో భారత ప్రభుత్వం నుంచి ప్రప్రథమంగా పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతిగా, పీవీ నరసంహారావును ప్రధానిగా దేశానికి పంపించారు. తొలి దళిత సీఎం దామోదరం సంజీవయ్య, ఉమ్మడి ఏపీకి రెండు పర్యాయాలు సీఎం బాధ్యతలు చేపట్టిన దివంగత నేత కోట్ల విజయభాస్కరరెడ్డి, బీహార్, పంజాబ్ గవర్నర్‌గా పని చేసిన పెండేకంటి వెంకటసుబ్బయ్య జిల్లా వాసులేకావడం గర్వకారణం.
చరిత్రకు సింహద్వారం కర్నూలు
కర్నూలు జిల్లా ఘనచరిత్రకు సింహద్వారం. 167ఏళ్ల చరిత్ర మన సొంతం. ఆదిమానవులు నడియాడిన నేల. అశోకుడి శాసనాలు ఇక్కడ ఉన్నాయి. దేశానికి రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్‌ను, రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులను అందించిన జిల్లా కర్నూలు. రాజధానిగా సేవలు అందించి తెలుగుజాతి ఐక్యత కోసం రాజధానిని త్యాగం చేశాం. జిల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి.. చరిత్రను తరంవాళ్లకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
ఆచార్య షేక్ మన్సూర్ రహ్మాన్, వ్యవస్థాపకుడు, మానవశక్తి పరిశోధన కేంద్రం,
కర్నూలు త్యాగాలు, పోరాటాల గడ్డ
కర్నూలు జిల్లా ఆవిర్భవించి నేటితో 167 ఏళ్ల పూర్తి చేసుకుంది. ఎన్నో త్యాగాలు, పోరాటలు చేసిన గడ్డ. స్వాతంత్య్ర పోరాటంలో సీమ పౌరుషం ఎలా ఉంటుందో బ్రిటీష్ పాలకులకు చూపించి గడ్డ. జిల్లా చరిత్ర చెరగనిది. స్వాతంత్ర్యానికి ముందు, ఆ తరువాత కర్నూలు వాసుల చేసిన త్యాగాలు గురించి నేటి పౌరువులకు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా అవిర్భావ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి.
కల్కూరు చంద్రశేఖర్, వ్యాపారవేత్త, కర్నూలు
Updated Date - Jul 01 , 2025 | 12:46 AM