గిరిజన హాస్టళ్లలో టెండర్ల గోల్‌మాల్..!
ABN, Publish Date - Jun 05 , 2025 | 11:21 PM
గిరిజన హాస్టళ్లలో టెండర్ల గోల్‌మాల్..!
పాత కాంట్రాక్టర్‌కు కట్టబెట్టాలనే పీవో ఎత్తుగడ
నిబంధనల పేరిట 12 మంది టెండరుదారుల తొలగింపు
ఆందోళనతో దిగొచ్చిన పీవో.. తాత్కాలికంగా వాయిదా
నంద్యాల, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు, ప్రకాశం జిల్లాల పరిధిలోని గిరిజన సంక్షేమ హాస్టళ్లకు సరుకుల సరఫరా సంబంధించిన టెండర్ల ప్రక్రియలో గోల్‌మాల్ జరిగినట్లు తెలుస్తోంది. గిరిజన హాస్టళ్లకు సంబంధించిన 32రకాల ప్రొవిజన్స్ సరఫరాలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గం సున్నిపెంటలోని సమీకృత గిరిజనా భివృద్ధి కార్యాలయంలో గురువారం నిర్వహించిన టెండర్ పక్రియలో గోల్‌మాల్ జరిగిందని కాంట్రాక్టర్లు ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని నిబంధనలు పెట్టి గతంలో సరఫరా చేసిన కాంట్రాక్టర్‌కే (వైసీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తి) అప్పగించాలనే ఆలోచనతో పీవో శివప్రసాద్ వ్యవహరిస్తున్నారని పలువురు టెండర్‌దారులు ఆరోపిస్తున్నారు. టెం డర్లు దాఖలు చేసిన 13మంది కాంట్రాక్టర్లలో 9 మంది కాంట్రాక్టర్లను అనర్హులుగా గుర్తిస్తూ వారి టెండర్లను రద్దుచేశామని అధికారులు తెలిపారు. దీంతో అధికారులు, టెండర్‌దారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం బాధిత కాంట్రాక్టర్లు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. చివరికి ఐటీడీఏ పీవో స్పందించి తాత్కాలికంగా టెండర్ ఎంపిక పక్రియ వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. ఏది ఏమైనా సదరు టెండర్ పక్రియ వ్యవహారం ఉమ్మడి కర్నూలు, ప్రకాశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
32 రకాల సరకుల సరఫరాకు టెండర్లు
ఐటీడీఏ అధికారులు గిరిజన హాస్టళ్లకు 32 రకాల నిత్యావసర సరుకులను 2025-26 విద్యా సంవత్సరానికి టెండర్లు పిలిచారు. దీంతో 13 మంది కాంట్రాక్టర్లు రూ.2లక్షల చొప్పున డీడీలు తీసి షీల్డ్ కవర్ టెండర్ వేశారు. దీంతో గురువారం టెండర్లను తెరిచారు. అయితే 9 టెండర్లను నిబంధనల హాల్‌మార్క్, టర్నోవర్ తదితర నిబంధనల పేరుతో పీవో రద్దు చేశారు. మిగిలిన మూడు టెండర్లను అర్హులుగా గుర్తించారు. ఈ ముగ్గురు కూడా గతంలో వైసీపీ హయాంలో సరఫరా చేసిన పల్నాడు జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లని సమాచారం. పైగా వారు వైసీపీ అనూకూలంగా వ్యవహరిస్తూ రెండేళ్లలో సక్రమంగా నిత్యావసర వస్తువులు సరఫరా చేయకుండా సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఐటీడీఏ పీవో నిబంధనలను సాకుగా చూపి తమ టెండర్లను రద్దు చేయడం సమంజసం కాదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారుల మతలబు
హాల్‌మార్కు పేరుతో అధికారులు మతలబు చేస్తున్నారు. గతంలో కాంట్రాక్టర్‌పై పలు ఆరోపణలు ఉన్నప్పటికి హాల్‌మార్క్ ఉందని పాత కాంట్రాక్టర్లకే టెండర్లు దక్కేలా అధికారులు వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ స్పందించి అర్హులకు టెండర్ దక్కేలా చూడాలి.
భగవన్ (నెల్లూరు)
ముగ్గురు కాంట్రాక్టర్ల కోసమే
అధికారులు గతంలో నిత్యావసర సరుకులు సరఫరా చేసే పాత కాంట్రాక్టర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులకే ఈ టెండర్ అప్పగించాలని లేనిపోని నిబంధనలు పెట్టారు. రాష్ట్రంలో ఎక్కడా ఈ నిబంధన లేదు. గతంలో ఆరోపణలు ఉన్నప్పటికి పాత కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టలేదు. కావున మంత్రి, కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలి.
రఘు (మార్కాపురం)
హాల్‌మార్క్ అన్నింటికి ఉండదు
హాల్‌మార్క్ అనేది కందిపప్పు, ఆయిల్, రవ్వలు తదితర వస్తువులకు ఉండదు. పదేళ్లుగా మేమే చేశాం. కానీ మమ్మల్ని తొలగించడం అన్యాయం. ఒకే కుటుంబానికి చెందిన పాత కాంట్రాక్టర్ వ్యూహం ప్రకారం మూడు పేర్ల మీద సదరు టెండర్ దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇందుకు అధికారులు కూడా సహకరిస్తున్నారు. ప్రశ్నిస్తే అధికారులు మమ్మల్ని బయటకు వెళ్లాలని హెచ్చరిస్తున్నారు. ఈ టెండర్ పక్రియను రద్దు చేసి అర్హులైన వారికి ఇవ్వాలి.
వెంకటేశ్వర్లు (నెల్లూరు)
Updated Date - Jun 05 , 2025 | 11:21 PM