వంద శాతంఉత్తీర్ణతకు కృషి చేయండి
ABN, Publish Date - May 07 , 2025 | 12:03 AM
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషిచేయాలని డీఈవో శామ్యూల్ పాల్ పేర్కొన్నారు.
లోపాలను ఉపాధ్యాయులు సరిదిద్దాలి
డీఈవో శామ్యూల్ పాల్
ఆదోని అగ్రికల్చర్, మే 6 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషిచేయాలని డీఈవో శామ్యూల్ పాల్ పేర్కొన్నారు. మంగళవారం సెయింట్‌జోసెఫ్ ఉన్నత పాఠశాలలో ఆదోని డివిజన్‌లోని పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల రెమెడియల్ తరగతులపై ప్రభుత్వ ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంచి నైపుణ్యత కలిగిన సబ్జెక్టు టీచరులు ఉన్నా పదో తరగతి ఫలితాలలో రాష్ట్రంలోని చివరి రెండోస్థానంలో ఉండడం ఆవేదనకు గురి చేసిందన్నారు. ఈలోపాలను సరిదిద్దుకొని సప్లిమెంటరీ పరీక్షల్లో కనీస మార్కులతో ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం ప్రభుత్వం సూచించిన విధంగా వీలైన విద్యార్థుల కోసం రెమిడియల్ తరగతులను నిర్వహించాలన్నారు. ఫెయిల్ అయిన పదివేల మంది విద్యార్థులను సప్లమెంటరీలో గట్టెక్కించాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడుపై ఉందన్నారు. కలెక్టర్ 40 శాతం ఉత్తీర్ణత సాధించలేని సబ్జెక్టు ఉపాధ్యాయులకు నోటీసులు జారీచేయాలని సూచించారన్నారు. కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రభుత్వ పాఠశాలను తమకు అప్పగిస్తే వంద శాతం ఉత్తీర్ణత సాధించి చూపిస్తామని అడుగుతున్నారని, దీనిపై తమతో సమాధానం లేదన్నారు ప్రభుత్వం రూ.25కోట్ల జీతాలు చెల్లిస్తుందని, అది గుర్తించి పనిచేయాలని చురకలు అంటించారు. డిప్యూటీ ఈవో వెంకటరమణారెడ్డి, ఎంఈవో శ్రీనివాసులు, ఉపాధ్యాయులు ఆదిమూర్తి, సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - May 07 , 2025 | 12:03 AM