షర్మిల గృహ నిర్బంధం సరికాదు
ABN, Publish Date - May 01 , 2025 | 11:44 PM
కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను గృహ నిర్బంధం చేయడం ఏమాత్రం సరికాదని నంద్యాల డీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ సభ్యుడు జె.లక్ష్మీనరసింహ యాదవ్ పేర్కొన్నారు.
నంద్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహయాదవ్
కల్లూరు, మే 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను గృహ నిర్బంధం చేయడం ఏమాత్రం సరికాదని నంద్యాల డీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ సభ్యుడు జె.లక్ష్మీనరసింహ యాదవ్ పేర్కొన్నారు. వైఎస్ షర్మిలపై కోడిగుడ్లు, గాజుపెంకులతో దాడిచేసేందుకు యత్నించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం నంద్యాల చెక్‌పోస్టులోని దామోదరం సంజీవయ్య భవన్ ఆయన విలేకరులతో మాట్లాడారు. 2015 ఉద్దండరాయుని పాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మళ్లీ మే 2న భూమిపూజ చేయడమంటే కేంద్ర ప్రభుత్వ మోసపూరిత ధోరణి తేటతెల్లం అయినట్లేనని ఆరోపించారు. బీజేపీ, టీడీపీ, జనసేన స్వలాభం కోసమే రాష్ట్రంలో స్వేచ్ఛాభావాలకు విఘాతం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్‌సిక్స్ పథకాల అమలులో ఎన్డీయే ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. చిత్తశుద్ధి ఉంటే గత పది సంవత్సరాల్లో రాష్ట్రంలో సాధించిన ప్రగతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.24,500 కోట్లు వచ్చి ఉంటే వెనకబడిన జిల్లాలో సాగు, తాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి అయ్యేవన్నారు. బీజేపీ ప్రభుత్వం వల్లే రాష్ట్రానికి నిధులు రాకుండాపోయాయన్నారు.
Updated Date - May 01 , 2025 | 11:44 PM