భయం గుప్పిట్లో కొల్లంపల్లి తండా..!
ABN, Publish Date - Jul 22 , 2025 | 12:36 AM
వెయ్యిలోపు జనాభా ఉన్న కొల్లంపల్లి తండాకు ఇప్పుడు క్వారీ కష్టమొచ్చింది. అర కిలోమీటరు దూరంలో క్వారీ, క్రషర్లు ఏర్పాటు చేయడంతో గ్రామం మొత్తం నిత్యం దద్దరిల్లిపోతోంది
బ్లాస్టింగు శబ్దాలతో దద్దరిల్లుతున్న గ్రామం
ఇళ్లకు పగుళ్లు, ధ్వంసమవుతున్న రోడ్లు
చెరువు ఫోర్‌షోర్ ఏరియాను అక్రమించి రహదారి నిర్మాణం
క్వారీల నుంచి రక్షణ కల్పించాలని రైతుల ఆవేదన
కర్నూలు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): వెయ్యిలోపు జనాభా ఉన్న కొల్లంపల్లి తండాకు ఇప్పుడు క్వారీ కష్టమొచ్చింది. అర కిలోమీటరు దూరంలో క్వారీ, క్రషర్లు ఏర్పాటు చేయడంతో గ్రామం మొత్తం నిత్యం దద్దరిల్లిపోతోంది. క్వారీలో బ్లాస్టింగ్ చేపడుతుంటంతో ఆ శబ్ధాలకు ఊరు మొత్తం బెంబేలెత్తిపోతోంది. వచ్చిపోయే టిప్పర్ల వేగానికి రహదారులు ధ్వంసమవుతున్నాయి. గ్రామానికే పెను కుంపటిగా మారిన క్వారీల నుంచి రక్షణ కల్పించాలని, చెరువుకు హంద్రీనీవా ద్వారా నీళ్లు విడుదల చేయాలని కోరుతూ ఆ పల్లె రైతులు అధికారులను వేడుకుంటున్నారు. తాజాగా సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టరు పి.రంజిత్ బాషాకు ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు.
కల్లూరు మండలం ఉల్లిందకొండ పంచాయతీ మజరా గ్రామం కొల్లంపల్లి తండాలో 150 కుటుంబాలు, వెయ్యిలోపు జనాభా ఉంటుంది. 85 శాతానికి పైగా గిరిజన తెగకు చెందిన ప్రజలు నివాసం ఉండే ఆ గ్రామం ప్రధాన జీవనాధారం పశుపోషణ, వ్యవసా యం. సమీపంలో సుమారుగా వెయ్యి ఎకరాలకు వరకు ప్రభుత్వ భూములు ఉన్నాయి. వివిధ పంటలు పం డిస్తూ జీవనం సాగిస్తున్న ఆ గ్రామస్థులకు నాలుగేళ్ల క్రితం గ్రామానికి అర కిలోమీటర్లులో ఏర్పాటు చేసిన ఓ క్వారీ, క్రషర్ యూనిట్ కుంపటిలా మంట రేపింది. కంకర క్రషింగ్ కోసం సమీపంలోనే క్వారీ మైనింగ్ కోసం గనులు భూగర్భ వనరుల శాఖ అనుమతులు తీసుకున్నారు. అయితే బోరు ఘాతాలు వేసి, సాయంత్రం 4-6 గంటల మధ్యలో బ్లాసింగ్ చేస్తుండడంతో భారీ శబ్దాలకు ఊరుఊరంతా దద్దరిల్లుతుందని, ఇంట్లో సామాన్లు కింద పడిపోతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు 20-30 టన్నుల కంకరతో వెళ్లే టిప్పర్ల వేగం ఒత్తిడికి ఉల్లిందకొండ నుంచి కొల్లంపల్లి గ్రామం వరకు దాదాపు 4 కిలోమీటర్లు రహదారి గుంతలమయంగా మారింది. ఆ రోడ్డులో ఆటోలను మళ్లించేందుకు కూడా డ్రైవర్లు జంకుతున్నారు. ఈ క్వారీ మాకొద్దు.. మా గ్రామానికి రక్షణ కల్పించాలని పలుమార్లు అడ్డుకున్నా ప్రయోజనం లేదు.
క్వారీ యజమానికి ఉన్న రాజకీయ కలుకుబడితో పోలీసులు, అధికారులు భయపెట్టిస్తు న్నారని గ్రామస్థులు ఏకరువు పెడుతున్నారు. గ్రామానికి జీవనాడి అయిన చెరువు గట్టుపై లారీలో తిప్పుతున్నారని, ఏ క్షణంలో గట్టు తెగిపోతుందో అని భయాందోళలను వ్యక్తం చేస్తున్నారు. చెరువు ఫోర్‌షోర్ ఏరియాను అక్రమించి క్వారీకి రోడ్డు ఏర్పాటు చేసుకున్నారని, ప్రశ్నిస్తే పోలీసుల ద్వారా భయపెట్టిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు క్రషర్ నుంచి వచ్చే కంకర ధూళి, దుమ్ము పంటలపై చేరడంతో పైర్లు నాశనం అవుతున్నాయని, దిగుబడి రూపంలో తీవ్రంగా నష్టపోతున్నామని అంటున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టరు పి.రంజిత్‌బాషాను కలసి తమ గోడును విన్నవించారు. న్యాయం చేస్తానని కలెక్టరు హామీ ఇచ్చారు. అంతకుముందు తమ గ్రామానికి తలనొప్పిగా మారిన క్వారీ నుంచి రక్షణ కల్పించాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు.
భారీ శబ్దాలకు ఇళ్లు పగుళ్లు
క్వారీ వల్ల మేం అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాం. బోరు ఘాతాలు వేసి సాయంత్రం 4-5 గంటల సమయంలో బ్లాస్టింగ్ చేస్తున్నారు. భారీ శబ్దాలకు ఊరుఊరంతా వణిపోతోంది. ఇళ్లు పగుళ్లు ఇస్తున్నాయి. పంట పొలాలు క్రషింగ్ దుమ్ముతో నిండిపోయి నష్టపోతున్నాం. ఈ క్వారీ మాకొద్దు సారూ..! కలెక్టరు సారే న్యాయం చేయాలి. - ఎం.దీపానాయక్,
ఉప సర్పంచ్, కొల్లంపల్లి గ్రామం
పోలీసులతో భయపెడుతున్నారు
మా పల్లెకు అర కిలోమీటరు దూరంలో క్వారీ, క్రషర్ యూనిట్ ఏర్పాటు చేశారు. 30 టన్నులు వచ్చిపోయే టిప్పర్ల వేగానికి చెరువు గట్టు దెబ్బ తింటుంది. రోడ్లు గుంతల మయంగా మారి దెబ్బతిన్నాయి. చెరువును కబ్జా చేసి రోడ్డు వేశారు. రెండేళ్ల క్రితం గ్రామస్తులంతా ఏకమై నిలదీస్తే తారురోడ్డు వేయిస్తానని మాట ఇచ్చినా ఇంత వరకు పట్టించుకోలేదు. క్వారీ నుంచి మా గ్రామానికి రక్షణ కల్పించాలి. - రత్నా నాయక్, కొల్లంపల్లి తండా
Updated Date - Jul 22 , 2025 | 12:36 AM