ప్రగతి పథాన..
ABN, Publish Date - May 16 , 2025 | 11:43 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరి 11 నెలలు పూర్తయింది. జూన్ 11న ఏడాది సంబరాలు జరుపుకోవడానికి కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులు సన్నద్ధం అవుతున్నారు
హంద్రీనీవా విస్తరణ పరుగులు
ఓర్వకల్లుకు పారిశ్రామిక వైభవం
కూటమి ప్రభుత్వం రాకతోబాగుపడిన రహదారులు
కందనవోలు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి
టిడ్కో ఇళ్లు పేదలకు ఇవ్వాలి
కర్నూలు స్మార్ట్‌సిటీ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలి
పాణ్యం నియోజకవర్గంలో‘ప్రజావేదిక’
నేడు కర్నూలు జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు
కర్నూలు, మే 16 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరి 11 నెలలు పూర్తయింది. జూన్ 11న ఏడాది సంబరాలు జరుపుకోవడానికి కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులు సన్నద్ధం అవుతున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ప్రగతి వైపు అడుగులు పడ్డాయి. వైసీసీ హయాంలో నిర్లక్ష్యంగా వదిలేసిన గుంతల దారులు బాగుపడ్డాయి. ఓర్వకల్లు కేంద్రంగా పారిశ్రామిక ప్రగతికి బీజం వేశారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయి. కరువు సీమ జీవనాడి హంద్రీనీవా కాల్వ విస్తరణ పనులు పరుగులు పెడుతున్నాయి. ఇప్పుడిప్పుడే అభివృద్ధి పనులు ఊపందుకుంటున్నాయి. జూన్‌లో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం ఆరంభంలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ డబ్బులు తల్లులు, రైతుల ఖాతాలో జమ చేస్తామని ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఇంతవరకు భాగానే ఉన్నా కరువు, వలసలతో నిత్యం తల్లడిల్లే కందనవోలు పశ్చిమ ప్రాంతం పల్లెసీమల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి. వేదవతి, ఆర్డీఎస్ కుడి కాలువ, గుండ్రేవుల ప్రాజెక్టులు చేపట్టాలి. నిరుపయోగంగా ఉన్న ఏపీ టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలని కోరుతున్నారు. కూటమి పార్టీల్లో కుమ్మలాటపై దృష్టి సారించాలి. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య సమన్వయం చేయకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దీనిపై అధినేత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజావేదిక, మార్గదర్శి-బంగారు కుటుంబం (పీ-4) కార్యక్రమంలో భాగంగా శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు నగరానికి వస్తున్న సందర్భంగా చేపట్టిన ప్రగతి, చేయాల్సిన అభివృద్ధిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
పేదరికం లేని సమాజమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పీ-4 కార్యక్రమంలో భాగంగా ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ఉగాది పర్వదినాన శ్రీకారం చుట్టారు. ప్రతి నెల మూడో శనివారం ఒక జిల్లాలో ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నేడు సీఎం చంద్రబాబు జిల్లాకు రానున్నారు. పాణ్యం నియోజకవర్గం పరిధిలోని కల్లూరు అర్బన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే గౌరు చరిత అధ్వర్యంలో అత్యంత పేదరికంలో మగ్గుతున్న రెండు కుటుంబాలను ఎంపిక చేసి దత్తత తీసుకుంటారు. పేదరికం నుంచి ఆ కుటుంబాలను పైకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు చేయూత అందిస్తాయి. నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో కేంద్రీయ విద్యాలయం పక్కనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఎమ్మెల్యే గౌరు చరిత, జిల్లా కలెక్టరు రంజిత్ బాషా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’ కార్యక్రమం విజయంవంతం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ప్రగతి పరుగులు
ఓర్వకల్లు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ 2,612 ఎకరాల్లో రూ.2,786 కోట్లతో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎన్‌ఐసీడీపీ)లో భాగంగా ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల అభివృద్ధికి ఫేజ్-1 కింద 2,612 ఎకరాల్లో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో రూ.2,786 కోట్లతో మౌలిక వసతులు కల్పించనున్నారు. వివిధ పరిశ్రమలు ఏర్పాటు ద్వారా రూ.12 వేల కోట్లు పెట్టుబడులు, 45,071 మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.
జపాన్‌కు చెందిన ఇటోయె మైక్రో టెక్నాలజీ కార్పొరేషన్, ఇండియాకు చెందిన హైడ్రెన్ గ్రూప్, బీఎన్ గ్రూపులు సంయుక్తంగా దాదాపు రూ.14వేల కోట్ల పెట్టుబడులతో సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమను 130 ఎకరాల్లో స్థాపించేందుకు ఒప్పందం చేసుకున్నారు. 1200 ఎకరాల్లో రూ.13వేల కోట్లతో ‘ఈవీ పార్క్’ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. 300 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో డ్రోన్ హబ్‌ను ఏర్పాటు చేయబోతున్నారు.
ఉమ్మడి జిల్లాలో రూ.690 కోట్లతో హంద్రీనీవా విస్తరణ చేపట్టారు. జూలై 10 తరువాత 3,860 క్యూసెక్కులు కృష్ణా జలాలు తీసుకోవాలని లక్ష్యం. కరువు రైతులకు పెద్ద ఊరట ఇది.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమల్లో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కసరత్తు దాదాపు పూర్తయింది. లీగల్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ అండ్ జస్టిస్, లా డిపార్ట్‌మెంట్ ప్రభుత్వ కార్యదర్శి వి.సుమీ అక్టోబరు 28న నంబరు. 2589691/ఎస్‌సీ.ఎఫ్/ఏ2/2024 కింద హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాశారు.
పత్తికొండ మండలం కనకదిన్నె వద్ద రెండు ఎకరాల్లో టమోటా ప్రాసెసింగ్ యూనిట్‌కు రూ.11 కోట్లతో శంకుస్థాపన చేశారు.
ఎమ్మిగనూరు మండలం బనవాసి జెర్సీ పశుక్షేత్రంలో చేనేతలకు ఉపాధి లక్ష్యంగా 97.24 ఎకరాల్లో మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు.
జలసిరులు రావాలి.. కరువు తీరాలి
మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో కరువు, వలసలు నివారించాలని 2019లో నాటి టీడీపీ ప్రభుత్వం ఆర్డీఎస్ కుడి కాలువ చేపట్టింది. 40 వేల ఎకరాలకు సాగు, 1.20 లక్షల జనాభాకు తాగునీరు అందించాలని రూ.1,985.42 కోట్లతో పనులు మొదలు పెట్టారు. ప్రధాన కాలువ, కోటేకల్లు, కోసిగి, పెద్దకడుబూరు, చిన్నమరివీడు జలాశయాల నిర్మాణాలు చేయాలి. వైసీపీ ప్రభుత్వంలో అటకెక్కించారు.
ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు, 1.50 లక్షల జనాభాకు సాగునీటి అందించాలని వేదవతి ఎత్తిపోతల పథకం రూ.1,94.80 కోట్లతో చేపట్టి పనులు మొదలు పెట్టారు. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల నిర్లక్ష్యం కారణంగా పురోగతి పడకేసింది. వేదవతి ప్రాజెక్టు పనులు 6 శాతమే జరిగాయి.
గాజులదిన్నె జలాశయం సామర్థ్యం 4.5 టీఎంసీలు నుంచి 5.50 టీఎంసీలకు పెంచాలనే ఉద్ధేశంతో గత వైసీపీ ప్రభుత్వంలో రూ.35 కోట్లతో పనులు చేపట్టారు. కాంట్రాక్టరుకు సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడంతో అసంపూర్తిగా వదిలేశారు.
హంద్రీనీవా ప్రాజెక్టు పత్తికొండ (పందికోన) జలాశయం కుడి, ఎడమ కాలువలు, పంటల కాలువలు అసంపూర్తిగా ఉన్నాయి. పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో 61,394 ఎకరాలకు సాగునీరు అందని ద్రాక్షగా మారింది. అసంపూర్తి పనులకు రూ.202 కోట్లు ఇవ్వాలి.
హంద్రీనీవా నుంచి 68 చెరువులను నింపే ఎత్తిపోతల, గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకాల నిర్వహణకు నిధులు ఇవ్వాలి.
అలగనూరు జలాశయం 2.96 టీఎంసీలు సామర్థ్యం. మట్టి ఆనకట్ట కుంగిపోయి ఐదేళ్లు దాటింది. రూ.26.33 కోట్లు నిధులు మరమ్మతులు చేపట్టాలి.
కేసీ కెనాల్ కింద ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు, కర్నూలు నగరానికి తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం 20 టీఎంసీల సామర్థ్యంలో తుంగభద్రపై గుండ్రేవుల జలాశయం నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వం రూ.2,980 కోట్లు మంజూరు చేస్తే.. అంతర్రాష్ట్ర సమస్య అని వైసీపీ హయాంలో పక్కన పడేశారు. కూటమి ప్రభుత్వం రావడంతో ఆశలు చిగురిస్తున్నాయి.
పేదలకు టిడ్కో యోగం ఎప్పుడో?
ఉమ్మడి జిల్లాలో గత టీడీపీ ప్రభుత్వం ఏపీ టిడ్కో కింద 52,318 ఇళ్లు మంజూరు చేసింది. వైసీపీ హయాంలో 21,038 ఇళ్లను రద్దుచేశారు. 31,289 ఇళ్లలో 23,645 ఇళ్లలో మెజార్టీ ఇళ్లు వంద శాతం పూర్తవ్వగా.. కొన్ని టీడీపీ ప్రభుత్వంలో 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. వైసీపీ హయాంలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. 23,645 ఇళ్లకు గానూ 7,007 ఇళ్ల లబ్ధిదారులకు తాళాలు అప్పగించారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో నేటికీ 150-200 లబ్దిదారులు కూడా నివాసం లేరు. కర్నూలు జిల్లాలో కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరులో 16,595 ఇళ్లు, నంద్యాల జిల్లాలో నంద్యాల, డోన్, ఆళ్లగడ్డలో 7,050 ఇళ్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. మౌలిక వసతులు కల్పించి పేదలకు అప్పగించాల్సిన అవసరం ఉంది.
తారస్థాయికి కూటమిలో కుమ్ములాటలు
రాష్ట్రంలో కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ అధిష్ఠానం మధ్య సఖ్యత, సమన్వయం ఉంది. కానీ నియోజకవర్గాల్లో సమన్వయం కొరవడడంతో కూటమి పార్టీ నాయకుల మధ్య కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆదోని నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుల మధ్య సమన్వయంలోపం టీడీపీ కార్యకర్తలకు తీవ్ర నష్టం చేకూర్చుతుంది. ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందని, అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో టీడీపీకి 60 శాతం జనసేన, బీజేపీకి 40 శాతం అందేలా ఒప్పుకున్నారని కార్యకర్తల సమక్షంలో చెప్పారు. నెలలు గడుస్తున్నా ఆ ఒప్పందం అమలు కావడం లేదు. వైసీపీ నుంచి బీజే పీలో చేరిన వారికే ఎమ్మె ల్యే ప్రాధాన్యత ఇస్తు న్నారనే టీడీపీ ఆరో పణ. సమన్వయం చే యకపోతే ఆ నియోజ కవర్గంలో టీడీపీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆలూ రు, మంత్రా లయం నియోజక వర్గాల్లో టీడీపీ వర్గాల్లో విభేదాలు పార్టీకి నష్టం చేకూర్చేలా మారాయి. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా కూటమి పార్టీల మధ్య ఆశించిన స్థాయిలో సమన్వయం కనిపించడం లేదు. ప్రతిపక్షంలో ఐదేళ్లు టీడీపీ జెండా చేతపట్టి వైసీపీ దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన వారిని గుర్తించడం లేదని టీడీపీ నాయకులు, కార్యకర్తలు మదనపడుతున్నారు. అధికారం వచ్చాక ఎమ్మెల్యేలు తమను పక్కన పెట్టి.. వైసీపీ నుంచి వచ్చిన వారికే పనులు, పదవులు ఇస్తున్నారని కార్యకర్తల ఆవేదన. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం లేకపోలేదని సీనియర్ నేతలే అంటున్నారు.
వీటిపై దృష్టి సారించాలి
కర్నూలు సర్వజన వైద్యశాలతో పాటు మెడికల్ కళాశాలల భవన నిర్మాణాలు రూ.450 కోట్లతో, ఆదోని మెడికల్ కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణాలు రూ.480 కోట్లతో చేపట్టారు. వివిధ దశల్లో ఆ నిర్మాణాలు ఆపేశారు. వీటిని పూర్తి చేసి పేదలకు వైద్య సేవలు మెరుగు పరచాలి.
రాయలసీమ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల 192 ఎకరాల్లో జగన్నాథగట్టుపై నిర్మాణం చేపట్టారు. రూసా నిధులు రూ.20 కోట్లు ఇచ్చారు. పునాదులతో పనులు ఆగిపోయాయి.
డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వావిద్యాలయం శాశ్వత భవనాలు ఓర్వకల్లు విమానాశ్రయం పక్కనే 144.92 ఎకరాల విస్తీర్ణంలో ఫేజ్-1 కింద రూ.18 కోట్లతో గత టీడీపీ ప్రభుత్వంలో చేపడితే వైసీపీ హయాంలో ఆపేశారు.
జగన్నాథగట్టుపై 52 ఎకరాల్లో రూ.80 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ‘క్లస్టర్ యూనివర్సిటీ’ పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి.
ఆదోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాశ్వత పక్కా భవనాలు నిర్మాణం, కోడుమూరు పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైపులైన్ హామీలు అమలు చేయాలి.
కర్నూలు స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ. అవసరమైన నిధులు మంజూరు చేసి ఆ దిశగా పనులు చేపట్టాలి.
Updated Date - May 16 , 2025 | 11:43 PM