లాభాల‘పాలు’
ABN, Publish Date - May 22 , 2025 | 12:15 AM
బొప్పాయి పాలు రైతులకు, వ్యాపారులకు లాభాల బాట పట్టిస్తున్నాయి. ఈపాలకు యమ డిమాండ్ ఉంది. బొప్పాయి పంటలో వైరస్ ఎక్కువ. సీజనల్ ఇబ్బందుల వల్ల పంట దిగుబడిలో అంచనాలు తారుమారు అవుతాయి. ఒక్కోసారి బొప్పాయి కాయల ధర, డిమాండ్ స్థిరంగా ఉండదు. బొప్పాయి పాలకు పెరుగు తున్న ప్రాధాన్యత వల్ల రైతులు ఊరట చెందుతున్నారు.
కేజీ పాలు రూ.60 నుంచి రూ.200
ఔషఽధ తయారీల్లో వినియోగం
బొప్పాయి పాలతో రైతులకు ఊరట
ఉత్తర భారతదేశంలో బొప్పాయి కాయలకు తగ్గిన గిరాకీ
పాల సేకరణ వైపు మొగ్గు
ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వస్తున్న వ్యాపారులు
చాగలమర్రి, మే 21 (ఆంధ్రజ్యోతి): బొప్పాయి పాలు రైతులకు, వ్యాపారులకు లాభాల బాట పట్టిస్తున్నాయి. ఈపాలకు యమ డిమాండ్ ఉంది. బొప్పాయి పంటలో వైరస్ ఎక్కువ. సీజనల్ ఇబ్బందుల వల్ల పంట దిగుబడిలో అంచనాలు తారుమారు అవుతాయి. ఒక్కోసారి బొప్పాయి కాయల ధర, డిమాండ్ స్థిరంగా ఉండదు. బొప్పాయి పాలకు పెరుగు తున్న ప్రాధాన్యత వల్ల రైతులు ఊరట చెందుతున్నారు.
పాల సేకరణ ఇలా..
బొప్పాయి పాల సేకరణకు మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రంలోని కొ య్యంబత్తూరు, కడప జిల్లాలోని రైల్వేకోడూరుకు చెందిన కొందరు వ్యాపారులు చిన్నవంగలి గ్రామాన్ని సందర్శించి వైరస్ సోకి పూర్తిగా దెబ్బతిన్న బొప్పాయి పంటను ఎకరాకు రూ.6 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న పంటకు రూ.10వేలు చెల్లించి పాలను సేకరిస్తున్నారు. కేజీ పాలను రూ.60నుంచి రూ.200 వరకు కొంటున్నారు. ఈపాలను ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారని వారు చెబుతున్నారు. బొప్పాయి కాయలకు బ్లేడ్‌తో మూడు చోట్ల గాట్లు వేస్తారు. పాలు కారే సమయంలో చెట్ల కింద ప్లాస్టిక్ ప్లేట్లు ఏర్పాటు చేస్తారు. ఇలా సేకరించిన పాలు ముద్దగా మారిపోతాయి. వాటిపై నీళ్లు చల్లి ప్లేట్లలో ఉన్న పాలను డ్రమ్ముల్లోకి మార్చి ఎగుమతి చేస్తారు. పాలు కారాక బొప్పాయి కాయలు పనికి రాకుండా పోతాయి. రైతులు బొప్పాయి చెట్లను తొలగిస్తారు. దెబ్బతిన్న బొప్పాయి తోటల్లో పాల సేకరణ తో రైతులకు ఉపశమనం కలుగుతుంది.
రోజుకు 50 నుంచి 70 కేజీల..
బొప్పాయి పండ్లు ఎగుమతి చేసే ఏజెంట్ సురేష్ మాట్లాడుతూ బొప్పా యి పాలకు గిరాకీ ఉండటంతో తోట లను కొనుగోలు చేసి పాలు సేకరిస్తున్నా మన్నారు. 10 మంది కూలీ లు రోజుకు 50 నుంచి 70 కేజీల బొప్పాయి పాలను సేకరిస్తారు. కూలీల కు రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు కూలీ ఇస్తున్నారు. పాక్షికంగా దెబ్బతిన్న ఎకరా బొప్పాయి పంట నుంచి 75 కేజీల పాలు, పూర్తిగా దెబ్బతిన్న పంట నుంచి 50 కేజీల పాలు వస్తాయి.
ఆదుకుంటున్న పాల సేకరణ
బొప్పాయి పండ్లు, పాలు పలురకాల వ్యాధులకు ఔషధంగా పని చేస్తాయని వైద్యులు చెబుతారు. డెంగీ, ఇతర వ్యాధుల బారిన పడిన వారు బొప్పాయి పండు విరివిగా తినాలని సూచిస్తున్నారు. బొప్పాయి ఆకు రసం కూడా సేవించవచ్చని కొందరు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం బొప్పాయికి వైరస్ సోకడంతో దిగుబడి తగ్గింది. ఉత్తర భారతదేశంలో గిరాకీ అనుకున్నంత లేకపోవడంతో ఎగుమతులు తగ్గాయి. దీంతో టన్ను ధర రూ.20వేలు నుంచి రూ.5వేలకు పడిపోయింది. ఈ పరిస్థితుల్లో బొప్పాయి పాల సేకరణ రైతులను ఆదుకుంటోంది. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో బొప్పాయి సాగు చేసి నష్టపోయిన రైతులకు బొప్పాయి పాల సేకరణతో కొంత ఊరట కలుగుతోంది.
బొప్పాయి పాలు సేకరిస్తున్నాం
ప్రతి రోజు ఒక ఎకర పంటలో నాణ్యతను బట్టీ 30 నుంచి 50 కేజీల పాలను సేకరిస్తాం. కేజీ పాలకు రూ.20 ఇస్తున్నారు. దీంతో కుటుంబాన్ని పోషించుకుం టున్నాం. బొప్పాయి పాల సేకరణ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి జీవిస్తున్నాం. - రాశి, మహిళా కూలీ, రైల్వే కోడూరు
బొప్పాయి పాలతో ఊరట..
ప్రకృతి వైపరీత్యాలతో బొప్పాయి పంటకు నష్టం వాటిల్లింది. గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నాం. పాల సేకరణకు తోటలు అమ్ముకుంటాం. బొప్పాయి పాల సేకరణతో కొంత ఊరట కలుగుతోంది. - గురునాథ్‌రెడ్డి, రైతు, చిన్నవంగలి గ్రామం
Updated Date - May 22 , 2025 | 12:15 AM