సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: కలెక్టర్
ABN, Publish Date - May 12 , 2025 | 11:33 PM
సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
పీజీఆర్‌ఎ్‌సకు 203 దరఖాస్తులు
నంద్యాల నూనెపల్లె, మే 12 (ఆంధ్రజ్యోతి): సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా పీజీఆర్‌ఎ్‌సకు 203 దరఖాస్తులు వచ్చినట్లు ఆమె తెలిపారు. రీ ఓపెన్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. దరఖాస్తుదారులు అర్జీల నమోదు, ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100 నెంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే పీజీఆర్‌ఎ్‌సకు రావాలని సూచించారు. వినతుల్లో ఎక్కువశాతం రెవెన్యూశాఖకు సంబంధించినవే వస్తున్నాయని, వాటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మనమిత్ర క్యాంపెయిన్ 4శాతం పెండింగ్‌లో ఉందన్నారు. ఆళ్లగడ్డ రూరల్, నందికొట్కూరు అర్బన్, డోన్ అర్బన్, పగిడ్యాల మండలాల్లో 26,052 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు 975 మార్గదర్శులను గుర్తించామని, పెండింగ్‌లో ఉన్న మరికొన్నింటిని పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ విష్ణుచరణ్, డీఆర్వో రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Updated Date - May 12 , 2025 | 11:33 PM