ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నాసిరకం విత్తు.. నమ్మితే చిత్తు..!

ABN, Publish Date - May 18 , 2025 | 11:48 PM

ముందుగానే తొలకరి పలకరించింది. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలో జోరుగా బీటీ-2 నాసిరకం పత్తి విత్తనాలు విక్రయం

తెలంగాణ రాష్ట్రం భూత్‌పుర్‌ నుంచి సరఫరా

తక్కువ ధర పేరిట మోసపోతున్న అన్నదాతలు

యంత్రాంగం అప్రమత్తమైతేనే కష్టజీవులకు మేలు

రైతుల్లో అవగాహన కల్పించడంలో వ్యవసాయాధికారులు విఫలం

ముందుగానే తొలకరి పలకరించింది. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దుక్కులు దున్ని విత్తనాలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మట్టిలో చిందించే స్వేదానికి దిగుబడి రూపంలో ఫలితం దక్కాలంటే ‘విత్తనం’ ఎంపికలో అన్నదాతలు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. తక్కువ ధరకు వస్తాయనో.. ఉద్దర (అరువు) ఇస్తారనో నాసిరకం, నకిలీ విత్తనాలను నమ్ముకుంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. తెలంగాణ రాష్ట్రం బూత్‌పుర్‌ నుంచి ఇప్పటికే అనుమతి లేని బీటీ-2 పత్తి విత్తనాలు ఉమ్మడి జిల్లాలో పలు గ్రామాలకు చేర్చి, రహస్యంగా అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం. అరికట్టడం, వాటివల్ల కలిగే నష్టంపై రైతుల్లో అవగాహన కల్పించడంలో వ్యవసాయ యంత్రాంగం వైఫల్యం చెందిందనే ఆరోపణలు లేకపోలేదు. 2025 ఖరీఫ్‌ సీజన్‌లో ఉమ్మడి జిల్లాలో దాదాపు 3.25 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేస్తారని అంచనా. వ్యవసాయ యంత్రాంగం అప్రమత్తమవ్వాలి. రైతులను ముంచేసే నాసిరకం పత్తి విత్తనాలు జిల్లాకు రాకుండా సరిహద్దుల్లోనే అడ్డుకోవాలి. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

కర్నూలు, మే 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పత్తి ఉత్పత్తిలో ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలు మూడో స్థానంలో ఉన్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో కర్నూలు జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 4.19 లక్షల హెక్టార్లు. నంద్యాల జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 2.36 లక్షల హెక్టార్లు ఉమ్మడి జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 6.55 లక్షల హెక్టార్లలో పత్తి, వరి ధాన్యం, మిరప, కంది, మినుము.. వంటి పంటలు సాగు చేస్తున్నారు. అగ్రస్థానం బీటీ-2 పత్తి సాగు చేస్తున్నట్లు అంచనా. 2025-26 ఖరీఫ్‌ సీజన్‌లో 3.25 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేస్తారని అంచనా. ఒక్క కర్నూలు జిల్లాలోనే 2.25 లక్షల హెక్టార్లలో సాగు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఎకరాలకు 3 విత్తన ప్యాకెట్లు (హెక్టారుకు 7-8 ప్యాకెట్లు) పత్తి విత్తనాలు భూమిలో వేస్తారు. కొందరు రైతులైతే ఎకరాకు 4-5 ప్యాక్యెట్లు నాటుతున్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాకు 25-30 లక్షలు పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం అవుతాయని అంచనా. కర్నూలు జిల్లాలో 17-20 లక్షలు అవసరమైతే.. అందుబాటులో ఉన్నది కేవలం 15 లక్షలు ప్యాకెట్లే.

భూత్‌పుర్‌ టు కర్నూలు

తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్‌పుర్‌ అనుమతి లేని, నాసికరం బీటీ-2 పత్తి విత్తనాలకు అడ్డాగా మారింది. భూత్‌పుర్‌ నుంచి కర్నూలు మండలం పంచలింగాల చెక్‌పోస్టు మీదుగా కర్నూలు, పాణ్యం, కోడుమూరు, డోన్‌ నియోజకవర్గాలకు, నందవరం మండలం నాగులదిన్నె చెక్‌పోస్టు దాటించి ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలకు, మంత్రాలయం మండలం మాధవరం చెక్‌పోస్టు దాటి మంత్రాలయం, ఆదోని, ఆలూరు నియోజకవర్గాలు, అలంపూర్‌ మండలం రాలంపాడు దగ్గర తుంగభద్ర నదిపై వంతెన దాటి నందికొట్కూరు, శ్రీశైలం, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె నియోజకవర్గాలకు నాసికరం పత్తి విత్తనాలు చేరవేస్తున్నట్లు సమాచారం. కోసిగి మండలానికి చెందిన ఓ బడా విత్తన వ్యాపారి (సెటిలర్‌) ఒకరు కర్ణాటక రాష్ట్రం రాయచూరును అడ్డాగా మార్చుకొని అక్రమంగా విత్తన వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి జిల్లాకు ప్రభుత్వ అనుమతుల పేరిట నాసికరం విత్తనాలు చేరవేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే భూత్‌పుర్‌, రాయచూరు నుంచి లక్షల బీటీ-2 పత్తి విత్తనాలు ఉమ్మడి జిల్లాలోని ఆయాగా గ్రామాల్లో రహస్య ప్రాంతాలకు చేర్చినట్లు సమాచారం. వ్యవసాయ, విజిలెన్స్‌ నిఘా యంత్రాంగం అప్రమత్తమై సరిహద్దులు దాటి రహస్యంగా జిల్లాకు చేరుతున్న నకిలీ, నాసికరం పత్తి విత్తనాలకు కళ్లెం వేయాలని పలువురు కోరుతున్నారు. ఆదోని పట్టణం ఆస్పత్రి రోడ్డులో జైన్‌ టైంపుల్‌ విధిలో పెద్దఎత్తున నాసిరకం పత్తి విత్తనాలు విక్రయిస్తున్నా.. సంబంధిత అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారనే ఆరోపణులు ఉన్నాయి.

పెరిగిన ధర.. రైతుపై భారం

బీటీ-2 పత్తి విత్తనాల కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. గతేడాది 475 గ్రాములు (450 గ్రామలు బీటీ రకం, 25 గ్రాములు నాన్‌ బీటీ రకం) విత్తన ప్యాకెట్‌ కనీస మద్దతు ధర రూ.863 ఉండేది. ఈ ఏడాది రూ.901లకు పెంచారు. ఒక్కో ప్యాకెట్‌పైన రూ.38 పెరిగింది. ఉమ్మడి జిల్లాలో సరాసరి 25-30 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా. ఈ లెక్కన రూ.9.50 కోట్ల నుంచి రూ.11.50 కోట్లు పత్తి సాగు రైతులపై అదనపు భారం తప్పడం లేదు. అయితే.. 2023 ఖరీఫ్‌లో ఎకరాకు 6-8 క్వింటాళ్ల దిగుబడి వస్తే.. 2024 ఖరీఫ్‌లో 8-12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అదే క్రమంలో విత్తనోత్పత్తి దిగుబడి కూడా పెరగడం వల్ల వివిధ కాటన్‌ సీడ్‌ కంపెనీలు డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయడంతో ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు గ్రేడ్‌-1 కంపెనీలు పత్తి విత్తన ప్యాకెట్‌ ఒకటి రూ.750 - 850లకు, గ్రేడ్‌-2 కంపెనీల విత్తన ప్యాకెట్‌ రూ.650 - 750లకే విక్రయిస్తున్నామని ఆదోనికి చెందిన ప్రముఖ విత్తన వ్యాపారి ఒకరు పేర్కొన్నారు. గతేడాది డిమాండ్‌ ఉన్న ప్రముఖ కంపెనీల పత్తి విత్తనం నల్లబజారులో ఒక్కో ప్యాకెట్‌ రూ.1,200 నుంచి 1,400లకు విక్రయించిన మాట నిజమేనని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, రైతులు అనాథరైజ్డ్‌ విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోవద్దని ఆ వ్యాపారి సూచిస్తున్నారు.

పత్తి విత్తనోత్పత్తి రైతులు పండించిన పత్తి విత్తనాలను వివిధ విత్తన కంపెనీలు ముందస్తు ఒప్పందం మేరకు 450 గ్రాముల ప్యాకెట్‌ రూ.400-450లకు తీసుకుంటున్నారని ఓ రైతు తెలిపారు. ఎకరాకు 550-600 ప్యాకెట్లు (2.50 - 2.70 క్వింటాళ్లు) దిగుబడి వస్తుందని అంచనా. గ్రో-అవుట్‌ టెస్ట్‌ (జీవోటీ), జెనెటికల్లి మోడిఫైడ్‌ ఆర్గనిజమ్స్‌ (జీఎంవో) టెస్టులు రైతులే చేయించాలి. ఆ టెస్టుల్లో ఉత్తమ ఫలితాలు వస్తేనే తీసుకుంటాయి. ఆ విత్తనాలను కంపెనీ లేబుల్‌పై మార్కెట్‌లో ఒక్కో ప్యాకెట్‌ కనీస మద్దతు ధర రూ.901లకు విక్రయిస్తున్నారు. విత్తన కంపెనీలు ధర గిట్టుబాటుకాక, విత్తనోత్పత్తి రైతులు ఒప్పందం ప్రకారం ఎకరాకు 400-450 ప్యాకెట్లు కంపెనీలకు ఇచ్చి, మిగిలిన విత్తనాలు మధ్య దళారులు ద్వారా అనధికారిక అమ్మకాలు సాగిస్తున్నారు. కొందరు దళారులైతే జీవోటీ, జీఎంవో పరీక్షల్లో సరైన ఫలితాలు రాని విత్తనాలను సేకరించి, వాటిని నాణ్యమైన విత్తనాలలో కలిపి వివిధ లేబుల్స్‌ పేరిట ప్యాకింగ్‌ చేసి విక్రయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని బూత్‌పూర్‌ అడ్డాగా ఈ బాగోతం సాగుతున్నట్లు సమాచారం. తక్కువ ధరకు వస్తాయని నాసిరకం విత్తనాలు కొనుగోలు చేసి మోసపోతున్నారు. నాసిరకం, అనుమతి లేని విత్తనాలు వల్ల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఎకరాకు 3-4 క్వింటాళ్లు దిగుబడి కోల్పోవాల్సి వస్తుందని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విషయాలపై రైతుల్లో అవగాహన కల్పించడంలో వ్యవసాయ అధికారులు వైఫల్యం చెందారనే ఆరోపణులు లేకపోలేదు.

జాగ్రత్తలు పాటించాలి

వ్యవసాయ శాఖ లైసెన్స్‌ పొందిన డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలి

విత్తన ప్యాకెట్లపై పేరు, గడువు తేదీ వివరాలు తప్పకుండా గమనించాలి

సీలు వేసిన బస్తాలు, ధృవీకరణ పత్రాలు ఉన్న విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలి

రసీదు తప్పకుండా తీసుకోవాలి. ఆ రసీదుపై విత్తనం రకం, గడువు తేదీ, డీలర్‌ సంతకం, రైతు సంతకం ఉండేలా చూసుకోవాలి.

విత్తనాలు కొనుగోలు చేయడానికి ముందు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు తీసుకోవడం ఉత్తమం.

475 గ్రాముల బీటీ-2 పత్తి విత్తన

ప్యాకెట్‌ కనీస మద్దతు ధర పెరుగుదల ఇలా:

సంవత్సరం ఎమ్మార్పీ భారం

2019 710 --

2020 730 20

2021 767 37

2022 810 80

2023 853 43

2024 863 10

2025 901 38

ప్రత్యేక బృందాలతో నిఘా

జిల్లాల్లో ఈ ఏడాది 2.25 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేస్తారని అంచనా. ఎకరాకు 3 ప్యాకెట్లు పత్తి విత్తనాలు భూమిలో వేస్తున్నారు. ప్రస్తుతం 15 లక్షల విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. నాసికరం, అనుమతి లేని విత్తనాలు గ్రామాల్లో అమ్మకాలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. నిరోధించడానికి ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశాం. ఏ గ్రామంలోనైనా అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం ఇస్తే దాడులు చేస్తాం. రైతులు కూడా అనుమతి లేని విత్తనాలు కొనుగోలు చేయరాదు. దీనిపై రైతుల్లో చైతన్యం తీసుకొస్తాం.

- వరలక్ష్మి, జేడీ, వ్యవసాయ శాఖ, కర్నూలు

Updated Date - May 18 , 2025 | 11:48 PM