శిథిలావస్థలో చెరువులు
ABN, Publish Date - May 24 , 2025 | 12:37 AM
చెరువులు.. పల్లెసీమల్లో సాగు, తాగునీటికి ఆధారం. పశువులకు దాహం తీర్చే జలపుంతలు. దశాబ్దాలుగా చెరువుల నిర్వహణ, మరమ్మతులపై ఏలికలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.
పల్లెసీమలకు జలాధారం చెరువులే
ట్రిపుల్ ఆర్ కింద మరమ్మతులకు కేంద్రం నిధులు
వెంటాడుతున్న ఇంజనీర్ల కొరత
21 చెరువులకు మాత్రమే రూ.33.88 కోట్లతో ప్రతిపాదన
ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాలపై ఎందుకీ నిర్లక్ష్యం
ఎమ్మెల్యేలు స్పందించకుంటే రైతులకు కన్నీళ్లే
చెరువులు.. పల్లెసీమల్లో సాగు, తాగునీటికి ఆధారం. పశువులకు దాహం తీర్చే జలపుంతలు. దశాబ్దాలుగా చెరువుల నిర్వహణ, మరమ్మతులపై ఏలికలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో చెరువుల గట్లు దెబ్బతింటున్నాయి. తూములు (స్లూయిస్), కాలువలు శిథిలావస్థకు చేరుతున్నాయి. పూడిక చేరి సామర్థ్యం తగ్గిపోతున్నాయి. ముళ్లకంపలతో నిండిపోతున్నాయి. పలు గ్రామాల్లో కబ్జాకు గురై ఆనవాళ్లు కోల్పోతున్నాయి. వర్షపు నీరు చేరే పరిస్థితి లేక.. చేరినా పొలాలకు మళ్లించే మార్గాలు కనిపించడం లేదు. సీజనల్లో రైతులకు సాగు కష్టాలు తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన (పీఎంకేఎస్‌వై)’లో భాగంగా దశాబ్దాలుగా గ్రామీణులకు జలాధారమైన చెరవుల మరమ్మతులు, నవీకరణ, పునరుద్ధరణ (ఆర్‌ఆర్‌ఆర్)కు శ్రీకారం చుట్టింది. వెనుకబడి జిల్లాల అభివృద్ధి కింద కేంద్రం 90 శాతం నిధులు ఇస్తుంది. కేవలం 21 చెరువులకే ప్రతిపాదనలు పంపారు. కరువు, వలస లకు నిలయమైన ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో ఒక్క చెరువు కూడా ఆ జాబితాలో లేదు. అక్కడ ఎంఐ ఇంజనీర్లు లేకపోవడమే ప్రధాన కారణం. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
కర్నూలు, మే 23 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా చిన్నతరహా నీటిపారుదల శాఖ పరిధిలోని కర్నూలు, డోన్, పత్తికొండ, ఆదోని సబ్ డివిజన్లలో 100 ఎకరాల ఆయకట్టు పైబడిన చెరువులు 60, వంద ఎకరాలులోపు ఆయకట్టు కలిగిన చెరువులు 250 ఉన్నాయి. 310 చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం 4.411 టీఎంసీలు (4411 ఎంసీఎఫ్‌టీ). 33,113 ఎకరాల ఆయకట్టు ఉంది. అత్యధిక చెరువులు శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించినవే. మరమ్మతులు, పూడిక తీత చేపట్టకపోవడం వల్ల పిచ్చిమొక్కలు, ముళ్ల కంపులతో నిండిపోయాయి. తూములు, పంట కాలువలు, ఆలుగులు పాడైపోతున్నాయి. గట్లు బలహీనంగా మారుతున్నాయి. వర్షాలు వచ్చిందంటే ఏ క్షణంలో ఏ చెరువు గట్టు తెగిపోతుందో..? అంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సాంప్రదాయంగా గ్రామీణుల నీటి అవసరాలు తీర్చే చెరువులు, నీటి సరస్సులు సంరక్షణకు శ్రీకారం చుట్టింది. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన (పీఎంకేఎస్‌వై)లో భాగంగా నిర్లక్ష్యానికి గురై సామర్థ్యం కోల్పోవడం, నిరుపయోగంగా మారిన చెరువులను వినియోగంలోకి తీసుకురావాలనే సంకల్పంతో నీటి వనరులు ‘మరమ్మతులు, నవీకరణ, పునరుద్ధరణ (ఆర్‌ఆర్‌ఆర్) పథకం ప్రయోగాత్మకంగా 2005లో ప్రారంభించారు. జల వనరుల సంరక్షణలో విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా సాంప్రదాయ నీటి వనరులైన చెరు వులు, సరస్సులు సంర క్షణ పనులకు శ్రీకారం చుట్టారు. ఫేజ్-3 కింద ప్రతిపాదనలు పంప మని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం కింద వెనుబడిన జిల్లాల కోటా లో 90 శాతం కేంద్రం నిధులిచ్చే అవకాశం ఉంది.
21 చెరువులు.. 33.88 కోట్లు
జిల్లాలో 310 చెరువులు ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ నిబంధనలు ప్రకారం మరమ్మతులు, పునరుద్ధరణ.. వంటి పనులు చేయాల్సిన చెరువులు 150-200లకు పైగానే ఉన్నాయి. అయితే.. కేవలం 21 చెరువులకు ట్రిపుల్ ఆర్ ఫేజ్-3 కింద రూ.33.83 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. కేవలం పత్తికొండ, కర్నూలు సబ్ డివిజన్ పరిధిలోకి వచ్చే పత్తికొండ నియోజకవర్గంలో 4 చెరువులకు రూ.7.14 కోట్లు, కోడుమూరు నియోజకవర్గంలో 5 చెరువులకు రూ.4.26 కోట్లు, పాణ్యం నియోజకవర్గంలో 5 చెరువులకు 4.89 కోట్లకు, మంత్రాలయం నియోజకవర్గంలో 2 చెరువులు రూ.8.90 కోట్లు, ఆలూరు నియోజకవర్గంలో 5 చెరువులకు రూ.8.68 కోట్ల ప్రతిపాదనలు పంపారు. ఆలూరు నియోజకవర్గంలో ఆస్పరి, దేవనకొండ మండలాలు చెరువులు పత్తికొండ సబ్ డివిజన్ పరిధిలోకి ఉండడంతో ఫేజ్-3 ఆ చెరువులకు ప్రతిపాదనల్లో స్థానం దక్కింది. టీబీపీ ఎల్లెల్సీ పరిధిలోని 10 చెరువులకు రూ.12.98 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. స్టేట్ లెవల్ టెక్నికల్ అడ్వజరీ కమిటీ ఫర్ ట్రిపుల్ ఆర్ కమిటీ ప్రాథమికంగా అంగీకరించినా, ప్రతిపాదనల్లో పలు లోపాలు కారణంగా ఆమోదం తెలపలేదు.
ట్రిపుల్ ఆర్ ఫేజ్-3 కింద ప్రతిపాదనలు రూ.కోట్లల్లో
నియోజకవర్గం చెరువులు ప్రతిపాదన
పత్తికొండ 4 7.14
కోడుమూరు 5 4.26
పాణ్యం 5 4.90
ఆలూరు 5 8.68
మంత్రాలయం 2 8.90
మొత్తం 21 33.88
ఎల్లెల్సీ చెరువులు 10 12.98
మొత్తం 31 46.86
మైనర్ ఇరిగేషన్ (ఎంఐ)లో ఏఈఈ వివరాలు
సబ్ డివిజన్ పోస్టులు భర్తీ చేసినవి ఖాళీలు
పత్తికొండ 4 4 --
ఆదోని 4 -- 4
డోన్ 6 3 3
కర్నూలు 4 3 1
మొత్తం 18 10 8
రెండో విడతలో పంపుతాం
ట్రిపుల్ ఆర్ ఫేజ్-3 కింద కర్నూలు డివిజన్ నుంచి తొలి విడతలో 21 చెరువులకు ప్రతిపాదనలు పంపారు. మిగిలిన చెరువుల ప్రతిపాదనలు రెండో విడతలో పంపుతాం. ఏఈఈల కొరత ఉన్నమాట నిజమే. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
- శ్రీనివాసులు, ఈఈ, మైనర్ ఇరిగేషన్ శాఖ, కర్నూలు
Updated Date - May 24 , 2025 | 12:37 AM