పీఎంఏవై.. ‘పూర్’గతి
ABN, Publish Date - May 24 , 2025 | 11:41 PM
పేదోడి సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయి
మందకొడిగా గృహ నిర్మాణ పనులు
జిల్లా వ్యాప్తంగా 39,003 ఇళ్లు మంజూరు
క్షేత్రస్థాయిలో అసంపూర్తిగా 15,191 ఇళ్లు
అత్యధిక శాతం పునాదులకే పరిమితం..
లక్ష్య సాధనలో ఎమ్మిగనూరు ఫస్ట్.. ఆలూరు లాస్ట్
వేధిస్తోన్న సిబ్బంది కొరత
పేదోడి సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ (పీఎంఏవై) పథకం కొనసాగుతోంది. జిల్లాలో పీఎంఎవై పనుల్లో పురోగతి అంతంత మాత్రమే అని చెప్పవచ్చు. నిధుల పుష్కలంగా ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం ప్రగతి కనబడటం లేదు. అధికారిక లెక్కలు ఒకటి చెబుతుండగా వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ పథకం అథోగతి చేరింది. దీనికి తోడు సిబ్బంది కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. అయినప్పటికీ జిల్లా హౌసింగ్ శాఖ అధికారులు మాత్రం ఎలాగైనా లక్ష్యానికి చేరి జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. వారి శ్రమ ఫలిస్తుందో లేదో వేచి చూడాల్సిందే..
కర్నూలు రాజ్‌విహార్ సర్కిల్, మే 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో పురోగతి లేకుండా పోయింది. గృహనిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిధుల లభ్యత పుష్కలంగా ఉన్నా వాటి నిర్మాణ పనులే ఆశించిన స్థాయిలో ముందుకు సాగటంలేదు. నిర్ధేశిత లక్ష్యానికి, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితికి పొంతన లేకుండాపోయింది. ప్రభుత్వాలు మారినా, పథకం పేర్లు మార్చిన గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గృహనిర్మాణ ప్రగతి అథోగతికి చేరిందనే చెప్పాలి.
ఆశించిన ఫలితం రావటం లేదు..
గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగటానికి కారణాలు అనేకం. పనుల పురోగతిపై ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందితో సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యట నలు, సిబ్బందికి తాఖీదులు, లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆఽశించిన స్థాయిలో ఫలితం కానరావటం లేదు. లబ్ధిదారులను ప్రోత్సాహించి, వారిని గృహ యజమానిచేసి పథకాన్ని విజయవంతం చేయాలనే సత్సంకల్పంతో రాష్ట్ర ప్రభు త్వం అదనంగా ఆర్థిక తోడ్పాటును అందిస్తోంది. పలు విభాగాల వారీగా వెనకబడిన కులాలకు రూ.50వేలు, షెడ్యూల్ కులాలు, తెగలకు రూ.75 వేలు, చెంచులకు రూ.లక్ష అదనంగా నిధులను మంజూరు చేస్తోంది. అయిన కూడా లబ్ధిదారులో సానుకూల స్పందన రావటం లేదు. వాస్తవానికి ఈ సమస్య పశ్చిమ ప్రాంతంలో అధికంగా అగుపిస్తోంది. అదోని, అలూరు ప్రాంతాల్లో అయితే వలస కార్మికులు, రోజు వారీ కూలీలు, జీవనోపాధి కోసం పొట్టచేత పట్టుకుని దూర ప్రాంతాలకు వెళ్లటం, వలసల అనంతరం సొంతూరుకు చేరిన తరువాత ఇంటి నిర్మాణాన్ని చేపడుదామనే చిన్న పాటి నిర్లిప్తతతోనూ ఈ గృహనిర్మాణ పనులు ముందుకు సాగటం లేదు. ఇప్పటికే ఈ ఇళ్ల నిర్మా ణానికి ప్రభుత్వం రూ.531 కోట్లు నిధులు ఖర్చుచేసింది. కానీ జగన్ సర్కారు ఇళ్లు కాదు ఊర్లు అంటూ ఊదరగొట్టినా, కాలనీల్లో మాత్రం కనీస వసతులను విస్మరించింది. ఈ కారణంతోనే పూర్తయిన ఇళ్లలో చేరేందుకు లబ్ధిదారులు నిరాసక్తత చూపుతున్నారు.
నత్తనడకన..
కర్నూలు జిల్లావ్యాప్తంగా 39,003 ఇళ్లు మంజూరు కాగా, నేటికీ 38981 ఇళ్లు పూర్తయినట్లు కాగితపు లెక్కలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఇంకా 15,191 ఇళ్లు వివిధస్థాయిలో అసంపూర్తిగా నిలిచాయి. 22మంది లబ్ధిదారులైతే ఏదశలోనూ నిర్మాణ పనులను ప్రారంభించ లేదంటే అతిశయోక్తి కాదు. అత్యధిక శాతం ఇళ్లు పునాది స్థాయిలోనే నిలిచిపోయాయి. అధికశాతం నిధులు పునాది పనులకు కేటాయిస్తుం డటంతో 7698 మంది లబ్ధిదారులు వాటిని తీసుకుని అక్కడితోనే పనులు నిలిపేయ టం గమనార్హం. జిల్లావ్యాప్తంగా గృహ నిర్మాణ పనులు 61 శాతం లక్ష్యాన్ని చేరుకోగా, కర్నూలు డివిజన్ 73శాతం, అదోని 58, పత్తికొండ 52 శాతం పురోగతిని సాధించింది. నియోజకవర్గాల వారీగా చూస్తే కోడుమూరు 77 శాతంతో ఆగ్రస్థానంలో ఉండగా, అలూరు 49 శాతం లక్ష్యాన్ని సాధించి అట్టడుగున నిలిచింది. మండలాలవారీ లక్ష్య సాధనలో ఎమ్మిగనూరు అర్బన్ 93 శాతంతో ప్రథమ స్థానంలో నిలువగా ఆలూరు మండలం 30 శాతంతో చివరి స్థానానికి పరిమితమైంది.
ఇంజనీర్ల స్థానాలు ఖాళీగా
క్షేత్రస్థాయి పనుల పర్యవేక్షణలో కీలకమైన ఇంజనీర్ల స్థానాలు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా కర్నూలు, ఆదోని, పత్తికొండ డివిజన్లకు గాను ముగ్గురు కార్యానిర్వాహక ఇంజనీర్లు ఉండాల్సి ఉండగా, ఒకే ఒక్కస్థానం పూర్తిస్థాయిలో భర్తీ అయింది. ఈయన కూడా ఈనెలాఖారుకు పదవీ విరమణ చేయనుండటం గమనార్హం. నియోజకవర్గానికి ఒకరు చొప్పున 7 మంది ఉప ఇంజనీర్లు విధులు నిర్వర్తిం చాల్సి ఉండగా, ముగ్గురు మాత్రమే శాశ్వత ఉప ఇంజనీర్లు ఉన్నారు. వీరిలో ఒకరు అనారోగ్య కారణాలతో సెలవులో ఉండగా, అందుబాటులో ఉన్న ఇద్దరు డీఈలు స్థానాలతో పాటు కార్యానిర్వాహక ఇంజనీర్లుగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అర్బన్ ప్రాంతంతో కలిపి మండలానికో సహాయ ఇంజనీరు చొప్పున 29 మంది అవసరం కాగా,. కేవలం ఆరు మంది మాత్రమే శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్నారు. మిగతా స్థానాల్లో సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఇన్‌చార్జి లుగా వ్యవహరిస్తు న్నారు. కొంద రు సహాయ ఇంజనీర్లు, తమ విధులతో పాటు ఉప ఇంజనీర్లుగా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తు న్నారు. సిబ్బంది కొరతతో అందుబాటులో ఉన్న ఉద్యోగులకే అదనపు బాధ్యతలు అప్పగిం చటంతో పనిభారంతో వారు తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు.
జూన్ 12 లోపు..
టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న తరుణంలో జిల్లాలో 11,706 గృహాలను పూర్తి చేయాలని లక్ష్యాన్ని విధించగా, సగటున రోజుకు 25 ఇళ్లు చొప్పున 6676 పూర్తి కాగా, మరో 5030 ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల పరిధిలో కర్నూలు జిల్లా 58శాతం పురోగతితో నాల్గవ స్థానంలో నిలవటం హర్షించదగ్గ విషయం. జూన్ 12లోపు ఈలక్ష్యాన్ని ఛేదించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
ప్రథమ స్థానానికి కృషి..
గృహ నిర్మాణ పనులకు ముందుకు రాని లబ్ధిదారులను కలిసి పథకం ప్రయోజనాలు, ప్రభుత్వపరంగా వారికి అందే సహకారం తదితర వాటిని వివరిస్తున్నాం. స్పందన లేని లబ్ధిదారులకు తాఖీదులు ఇవ్వటం, నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటున్నాం. నిర్ధేశిత గడువులోపు జిల్లాను ప్రథమ స్థానానికి తీసుకు వెళ్లాలనే సంకల్పంతో సమష్ఠిగా పనిచేస్తున్నాం.
-టి.చిరంజీవి, జిల్లా గృహ నిర్మాణశాఖ పీడీ
Updated Date - May 24 , 2025 | 11:41 PM