ఆపరేషన్ టీ132ఎఫ్
ABN, Publish Date - Jul 29 , 2025 | 10:48 PM
నల్లమల అంటేనే పెద్దపులులకు ఆవాసం.
నల్లమలలో పులి రక్షణకు రెస్క్యూ ఆపరేషన్
ఉచ్చుకు చిక్కి గాయపడ్డ పులికి శస్త్ర చికిత్స
21రోజుల పాటు మూడు బృందాలు రేయింబవళ్లు గస్తీ
డాక్కుమెంటరీ విడుదల చేసిన ఎన్‌ఎస్‌టీఆర్
నల్లమల అంటేనే పెద్దపులులకు ఆవాసం. ఇటీవల కాలంలో నల్లమలలో పులుల సంఖ్య ఆశాజనంగా ఉండటంతో దీనిపై వేటగాళ్ల కన్నుపడింది. అందుకే నల్లమలలో తరుచూ ఉచ్చులతో వేటగాళ్లు తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్-శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం (ఎన్‌ఎ్‌సటీఆర్) పరిధిలో ఓ ఉచ్చుకు చిక్కి తప్పించుకుని తీవ్రగాయమై తల్లడిల్లిన ఓ పెద్దపులిని అటవీశాఖ అధికారులు ఎంతో దైర్ఘసాహసాలను ప్రదర్శించి రక్షించారు. ఈ రెష్య్కూ ఆపరేషన్ గురించి తొలినుంచి గోప్యంగా ఉంచిన ఎన్‌ఎ్‌సటీఆర్ అధికారులు మంగళవారం వరల్డ్ టైగర్స్ డే సందర్భంగా ‘ది రెస్య్కూ ఆఫ్ టీ132ఎఫ్’ పేరిట వీడియో డాక్కుమెంటరీ విడుదల చేశారు.
ఆత్మకూరు, జూలై 29(ఆంధ్రజ్యోతి): దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వు ఫారె్‌స్టగా పేరుగాంచిన నాగార్జునసాగర్-శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం పరిధిలో 2023-24 ఫేస్-4 గణాంకాల ప్రకారం 87 పెద్దపులులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇది ఒకింత ఆనందించదగ్గ విషయమే. అయితే ఇదే పెద్దపులులకు ప్రమాదాన్ని తెచ్చినపెట్టిన అంశంగా పరిగణించవచ్చు. నల్లమలలో పెద్దపులుల సంఖ్య ఎక్కువ అవుతుండటంతో అంతరాష్ట్ర వేటగాళ్లు సైతం నల్లమలపై కన్నేశారు. ఈ క్రమంలోనే పెద్దపులులను హతమార్చేందుకు చాలా సులభమైన పద్దతులను వేటగాళ్లు ఎంచుకుంటు న్నారు. బైకులకు వినియోగించే క్లచ్ వైయర్లను ఉచ్చుగా తయారీ చేసి చెట్లకు కట్టేస్తున్నారు. వాటిని గమనించని పులులు ఆ ఉచ్చులో చిక్కి బలవుతున్నాయి. ఒకవేళ ఉచ్చును తప్పించుకుని బయటపడినా.. తీవ్రగాయాల పాలై మృత్యువాతపడుతున్నాయి.
ఉచ్చుకు చిక్కి.. విలవిలలాడుతూ
2025 జూన్ 16వ తేదీ.. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నాగలూటి రేంజ్ పరిధిలోని ఇన్‌ఫ్రారెడ్ కెమెరా ట్రాప్స్‌ను రెగ్యూలర్ మానిటరింగ్‌లో భాగంగా పరిశీలించగా సుద్దగుంట ప్రాంతంలోని ఓ కెమెరాలో ఓ పెద్దపులి మెడ భాగంలో తీవ్రంగా గాయపడి తల్లడిల్లుతున్నట్లు గుర్తించారు. గతంలో జరిగిన ఓ సంఘటన నేపథ్యంలో గాయపడిన పులిని అలానే వదిలేస్తే అది మరణించే ప్రమాదం ఉన్నట్లు అటవీ అధికారులు పసిగట్టారు. వెంటనే విషయాన్ని నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటి(ఎన్‌టీసీఏ)కు సమాచారం అందించి దాన్ని పట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ముందుగా పులి సంచార ప్రదేశాన్ని (టెరిటరీ) గుర్తించి ఆ పరిధిలో నాలుగేళ్ల కెమెరా ట్రాప్స్‌ను పరిశీలించారు. చివరికి గాయపడిన పులి టీ132ఎ్‌ఫగా నిర్ధారించారు. ఆతర్వాత పులిని బంధించి చికిత్సలు అందించాలన్న లక్ష్యంతో ది రెస్య్కూ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు.
మూడు బృందాలుగా ఏర్పడి
గాయపడిన పెద్దపులిని రక్షించేందుకు ఎన్‌ఎ్‌సటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ కృష్ణమూర్తి, ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్ వి.సాయిబాబా, శ్రీశైలం సబ్ డీఎ్‌ఫవో అబ్దుల్‌రవూఫ్, బైర్లూటి రేంజ్ అధికారి కృష్ణప్రసాద్ నేతృత్వంలో మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ముందుగా గాయపడిన పులి బైర్లూటి రేంజ్ పరిధిలోని పుల్లలచెరువు, తలమడుగు సెక్షన్ ఏరియాల్లో ఎక్కువగా సంచరించినట్లు వివిధ కెమెరా ట్రాప్స్, పగ్‌మార్క్, ప్రత్యక్ష వీక్షణం ద్వారా గుర్తించారు. దీంతో ఆ రెండు ప్రదేశాల్లో పులికి ఎరగా ఒక్కో ఆవుదూడను చెట్లకు కట్టేశారు. అలాగే ఆ ప్రదేశాల్లో రేయింబవళ్లు పూర్తిస్థాయిలో మానిటరింగ్ ఉంచారు. ఇందులో ప్రత్యేకింంచి మత్తు ప్రయోగం చేసేందుకు నలుగురితో కూడిన ట్రాంక్ లైజర్ టీం 20మీటర్ల పరిధిలో, పులి కదకలికలను గుర్తించేందుకు ధర్మల్ డ్రోన్ కెమెరాలను పర్యవేక్షించే బృందం 100 మీటర్ల పరిధిలో, పులిని బంధించినట్లయితే వెంటనే దానిని రక్షించేందుకు బ్యాక్ అండ్ టీం ఒక కిమీ పరిధిలో ఉండేలా ప్రణాళిక రూపొందించారు.
ఆరోజు ఏమి జరిగిందంటే...
గాయపడిన పులిని బంధించేందుకు అంతా సిద్ధం చేశారు. అనుకున్నట్లుగానే జూలై 4వ తేదీన రాత్రి ఇసుకగుండం రస్తాలో పెద్దపులి సంచరించింది. ఆ తర్వాత మరుసటి రోజు 5వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పుల్లలచెరువు ప్రదేశంలో కట్టేసిన ఆవుదూడను చంపేసింది మళ్లీ ఖచ్చితంగా ప్రదేశంలోకి పెద్దపులి వస్తుందని భావించిన అటవీ అధికారులు మూడు బృందాలను అక్కడ అప్రమత్తం చేశారు. 6వ తేది తెల్లవారుజామున 5:17 గంటలకు పెద్దపులి ఆవుదూడ కళేబరం వద్దకు రాగానే ట్రాంక్ లైజర్ గన్‌తో పులికి మత్తు ఇచ్చారు. దీంతో అక్కడి నుంచి పరారైన పులి 5:40 గంటలకు మత్తులోకి వెళ్లింది. అప్పటికే డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచడంతో పులిని గుర్తించి బ్యాక్ అండ్ టీం సహకారంతో బైర్లూటి వైల్డ్‌లైఫ్ డిస్పెన్షరీకి తీసుకొచ్చి ఎన్‌ఎ్‌సటీఆర్ వైల్డ్‌లైఫ్ డాక్టర్లు జుబేర్‌వలి, ఆరన్ వెస్లీ నేతృత్వంలో ప్రాథమిక చికిత్సలు అందించారు. ఆ తర్వాత ఎనిమల్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్‌లో దాన్ని తిరుపతి ఎస్వీ జూపార్క్‌కు తరలించారు. మెడభాగంలో తీవ్రంగా గాయపడిన పులికి 7వ తేదిన తిరుపతి జూపార్క్ డిస్పెన్సరీలో వైద్యనిపుణులు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం జూపార్క్‌లోని ఎనిమల్ రెస్క్యూ సెంటర్‌లో పులికి సపర్యలు అందిస్తున్నారు. గాయపడిన పులి పూర్తిఆరోగ్యవంతంగా ఉన్నట్లయితే తిరిగి దాన్ని నల్లమలలో వదిలేయాలని అటవీ అధికారులు భావిస్తున్నారు.
పులిని రక్షించాలన్న తపనతో పనిచేశాము
ఉచ్చుకి చిక్కి తప్పించుకుని గాయపడిన పులిని ఎలాగైనా రక్షించాలన్న తమనతో 21 రోజుల పాటు ధైర్యసాహసాలతో రాత్రింబవళ్లు పనిచేశాము. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎన్‌టీసీఏ ఆలోచనల మేరకు ఎట్టకేలకు అతికష్టం మీద పులిని బంధించడం జరిగింది. ఇక్కడే చికిత్సలు అందించడం కష్టతరమని భావించి వెంటనే తిరుపతి ఎస్వీ జూపార్క్‌కు తరలించాం. అక్కడి జూపార్క్ వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. పులి పూర్తి ఆరోగ్యం కుదుటపడితే దాన్ని తిరిగి నల్లమలలో వదిలేయాలన్న ఆలోచనలో ఉన్నాము. ఈ రెస్య్కూ ఆపరేషన్ అన్ని బృందాలుగా బాధ్యతగా పని చేయడం వల్లే విజయం సాధించాం. ఈ ఆపరేషన్ ఎన్‌ఎ్‌సటీఆర్‌లో అరుదైన ఘటన కావడంతోనే వరల్డ్ టైగర్ డే సందర్భంగా ప్రత్యేక వీడియో డాక్కుమెంటరీని రూపొందించాము.
- వి.సాయిబాబా, ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్, డిప్యూటీ డైరెక్టర్
Updated Date - Jul 29 , 2025 | 10:48 PM