ఎవరైనా సరే..చర్యలు తప్పవు
ABN, Publish Date - Jun 01 , 2025 | 12:27 AM
340-సి జాతీయ రహదారి నిర్మాణం పనుల్లో నాణ్యత లోపిస్తే ఎవ్వరి మీదైనా చర్యలు తప్పవని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి బి.సి. జనార్దన్‌రెడ్డి అన్నారు.
నందికొట్కూరు, మే 31 (ఆంధ్రజ్యోతి): 340-సి జాతీయ రహదారి నిర్మాణం పనుల్లో నాణ్యత లోపిస్తే ఎవ్వరి మీదైనా చర్యలు తప్పవని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి బి.సి. జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం నందికొట్కూరు పట్టణ సమీపంలోని 340-సి జాతీయ రహదారిని మంత్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ రహదారి ప్రారంభమైన రెండు నెలలకే దెబ్బతినడం ఏమిటని ప్రశ్నించారు. రోడ్డు నిర్మాణంలో వాడిన మట్టి నాసిరకంగా ఉందని ఆయన అన్నారు. గతంలో రోడ్డు సైడ్ వాల్‌కు రివిటింగ్ చేసేవారని, అధునాతన టెక్నాలజీ ప్రకారం కోకో కార్పెట్‌ను ఏర్పాటు చేసి అందులో వివిధ గడ్డి జాతులను పెంచుతారని, కానీ పనుల్లో నాణ్యత లేకపోవడంతో కోకో కార్పెట్ చిన్న వర్షానికే కొట్టుకుపోయిందన్నారు. తద్వారా సైడ్ వాల్ కోతకు గురవుతున్నదన్నారు. రోడ్డుపై నుంచి వర్షపు నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన కాలువలు కూడా నాసిరకంగా ఉండడంతో ఇప్పటికే కుండిపోతున్నాయన్నారు. నాణ్యతను పరిశీలించేందుకు సెంట్రల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో విచారణ చేపడతామన్నారు. రహదారి నిర్మాణం పనులను నాణ్యతను పరిశీలించి నివేదికలను సర్టిఫై చేస్తూ ఇచ్చిన అధికారులపై కూడా విచారణ చేపడతామన్నారు. బొల్లవరం, నందికొట్కూరు రైతులు తమ పొలాలకు వెళ్లందుకు దారి లేక ఇబ్బందులకు గురవుతున్నారని, అప్రోచ్ రోడ్డు వేయించాలని 29వ వార్డు కౌన్సిలర్ భాస్కర్‌రెడ్డి కోరారు.
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికలు కనుమరుగు
2024 జూలై 31వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ‘నెర్రల దారులు’ శీర్షికన వచ్చిన కథనం ప్రచురితం కావడంతో రహదారి నిర్మాణ పనులలో నాణ్యతను పరిశీలించాలనివిజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఆనాడు ఆదేశాలు ఇచ్చామని, ఇంత వరకు ఆ నివేదిక బయటకు రాకుండా కనుమరుగైందన్నారు. ఈ నిర్వాకం వెనుక ఎంత పెద్ద వారు ఉన్నా శిక్షణ పడాల్సిందేనన్నారు. ఆ విచారణ నివేదికను తనకు అందజేయాలని నేషనల్ హైవే పీడీ పద్మజను ఫోన్ మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ వీరం ప్రసాద్‌రెడ్డి, డైరెక్టర్ మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, కౌన్సిలర్ భాస్కర్‌రెడ్డి, టీడీపీ నాయకులు పలుచాని మహేశ్వర్‌రెడ్డి, ఖాతా రమేష్‌రెడ్డి, వేణుగోపాల్, ఆయిల్ రవి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Jun 01 , 2025 | 12:27 AM