ఒకటో తరగతికి అడ్మిషన్లు లేవట..!
ABN, Publish Date - Jun 25 , 2025 | 12:06 AM
తమ పాఠశాలలో ఈ ఏడాది ఒకటో తరగతికి అడ్మిషన్లు లేవు అంటూ కేశవరెడ్డి పాఠశాల యాజమాన్యం పేర్కొంటోంది. రైట్ టు ఎడ్యుకేషన్(ఆర్‌టీఈ)కు ఈ పాఠశాలకు ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికయ్యారు.
కేశవరెడ్డి పాఠశాల వింత పోకడ
అగమ్యగోచరంగా ఆర్‌టీఈ విద్యార్థుల పరిస్థితి
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు ఫిర్యాదు
పాణ్యం, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): తమ పాఠశాలలో ఈ ఏడాది ఒకటో తరగతికి అడ్మిషన్లు లేవు అంటూ కేశవరెడ్డి పాఠశాల యాజమాన్యం పేర్కొంటోంది. రైట్ టు ఎడ్యుకేషన్(ఆర్‌టీఈ)కు ఈ పాఠశాలకు ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికయ్యారు. దీంతో ఆర్‌టీఈ చిన్నారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆర్‌టీఈ చట్టం కింద పాణ్యం మండలంలోని ప్రైవేటు పాఠశాలలకు మొదటి విడతలో 20 మంది, రెండో విడతలో ఆరు మంది మొదటి తరగతి విద్యార్థులను విద్యాశాఖ ఎంపిక చేసింది. దీనిలో కేశవరెడ్డి పాఠశాలకు ఎనిమిది ఎంపిక చేసి పాఠశాలలో చేరాలని సంబంధిత విద్యా శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కేశవరెడ్డి పాఠశాలలో మాత్రం తమకు ఒకటో తరగతికి విద్యార్థులు చేరకపోవడంతో ఈఏడాది ఒకటవ తరగతికి అడ్మిషన్లు నిలిపివేశామని జవాబిచ్చినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు ఈనెల 28వ తేదీన చేరాల్సి ఉండగా ఈ పరిస్థితి ఏర్పడడంతో తల్లిదండ్రులు సోమవారం(23వ తేదీన) నంద్యాల కలెక్టరుకు ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు.
తల్లిదండ్రులు మంగళవారం జనసేన కార్యాలయంలో మండల కన్వీనర్ జగదీశ్ ఆద్వర్యంలో విలేకరులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రిన్సిపాల్ శ్రీదేవిని వివరణ కోరగా చిన్న పిల్లల పర్యవేక్షణకు అవసరమైన సిబ్బంది, పరిస్థితులు లేకపోవడంతో ఈ యేడాది ఒకటో తరగతికి అడ్మిషన్లు చేపట్టలేదన్నారు. దీనిపై రెండు నెలల క్రితం డీఈవోకు అనుమతి కోరగా స్పందించలేదన్నారు.
తప్పనిసరిగా చేర్చుకోవాల్సిందే..
ఆర్‌టీఈ ద్వారా ఈ ఏడాది పాణ్యం మండలంలోని ఏడు ప్రైవేటు పాఠశాలలకు 26మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరు ఈనెల 28వ తేదీన ఆయా పాఠశాలల్లో చేరాల్సి ఉంది. కేశవరెడ్డి మినహా అన్నిపాఠశాలలు విద్యార్థులను చేర్చుకున్నాయి. దీనిపై కేశవరెడ్డి పాఠశాల ప్రిన్సిపాల్‌తో మాట్లాడాం. ఆర్‌టీఈ చట్టం ప్రకారం, ప్రభుత్వ నిబంధనల మేరకు ఒకటవ తరగతి విద్యార్థులను తప్పనిసరిగా చేర్చుకోవాల్సిందేనని పాఠశాల యాజమాన్యానికి తెలిపాం. విద్యార్థులను పాఠశాలల్లో చేర్చుకొని నివేదికలు ఇవ్వాలని ఆదేశించాం. - జనార్దన్‌రెడ్డి, డీఈవో, నంద్యాల
ఆందోళన చేపడుతాం..
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలో 25 శాతం పేద విద్యార్థులకు సీట్లు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుతం కేటాయించిన విద్యార్థుల సీట్లను తప్పనిసరిగా వారికే కేటాయించాలి. లేని పక్షంలో జనసేన ఆధ్వర్యంలో ఆందోళన చేప డుతాం. ల క్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఇప్పుడు ఆర్టీఈ చట్టం అమలుతో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రతి పేద పిల్లవానికి నాణ్యమైనవిద్యనందించాలన్న ధ్యేయంతో పని చేస్తుందని కూటమి లక్షానికి ఇటువంటి చర్యలతో తూట్లు పొడిస్తే ప్రత్యక్ష ఆందోళన చేపడతామన్నారు. -జగదీశ్‌బాబు, జనసేన మండల కన్వీనర్, పాణ్యం
Updated Date - Jun 25 , 2025 | 12:06 AM