నందీశ్వరా.. ఏమిటీ దోపిడీ..!
ABN, Publish Date - Jun 09 , 2025 | 12:36 AM
పవిత్ర పుణ్యక్షేత్రమైన మహానంది క్షేత్రంలో భక్తులు నిత్యం దోపిడీకి గురి అవుతున్నారు.
టికెట్స్.. పూజల రూపంలో అక్రమాలు
రుద్రాక్ష పేరుతోనూ దోచేస్తున్న వైనం
మాయమైన రెండు కిలోల వెండి
ఇద్దరు ఉద్యోగులు, ఓ మండల నాయకుడి దందా
నెలకు రూ.లక్షల్లో వసూళ్లు
దుకాణాల నుంచి నెలవారీ మాముళ్లు
నంద్యాల, జూన్8(ఆంధ్రజ్యోతి): పవిత్ర పుణ్యక్షేత్రమైన మహానంది క్షేత్రంలో భక్తులు నిత్యం దోపిడీకి గురి అవుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. టికెట్స్, పూజలు, భక్తులిచ్చే బహూకరణలు వరకు ఇలా. ఎక్కడ పడితే అక్కడ అందిన కాటికి దోచేడమే లక్ష్యంగా అక్కడ కొందరు ఉద్యోగులు ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. అధికారులతో పాటు ఓ మండల నాయకుడు కలిసి తమదైన శైలిలో నెలవారి అక్రమ వసూళ్లకు తెరలేపి నెలకు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం. వీరితో పాటు అక్కడ పనిచేసే బావ బామ్మర్థులు సైతం రుద్రాక్షల పేరుతో భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. పైగా అక్కడ జరిగే వ్యవహారంపై ఎవరైనా ప్రశ్నించినా.. ఆరా తీసినా వెంటనే సంబంధిత ప్రజాప్రతినిధి పేరు అడ్డుగా వాడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. మొత్తంగా మహానందీ క్షేత్రంలో జరిగే పలు వ్యవహారాలపై భక్తులతో పాటు ప్రజల్లో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదే క్రమంలో దేవుడికే శఠగోపం పెట్టారనే ప్రచారం జోరందుకుంది. ఫారెన్‌కు చెందిన రెండు కేజీల వెండి మాయం కావడమే ఇందుకు నిదర్శనం.
తమదైన శైలిలో చేతివాటం..
మహానందిలో భక్తులు తాకిడి ఎక్కువ. ఇదే అదనుగా భావించిన కొందరు ఉద్యోగులు సైతం తమదైన శైలిలో చేతివాటం ప్రదర్శించి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఉద్యోగుల్లో కీలక అధికారి కిందిస్థాయిలో పనిచేస్తున్న ఓ అధికారితో పాటు.. అర్చకుల్లో బావ బామ్మర్దులు కలిసి పలు రూపాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఒకే టికెట్‌పై ఎక్కువ మంది భక్తులు పంపి దర్శనాలు చేయిస్తున్నారని సమాచారం. ఇదీ చాలదన్నట్లుగా.. రుద్రాక్ష పూజల పేరుతో భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారని సమాచారం. భక్తుల ఏదైనా సమస్యతో వస్తే.. ఆయా భక్తుల సమస్యల బట్టి రూ.500 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తారని తెలిసింది. ఈరూపంలోనే రోజుకు సుమారు రూ.10వేలకు పైగానే వస్తుందని సమాచారం. ఈలెక్కన నెలకు లక్షల్లోనే వారి జేబుల్లోకి వెళ్తున్న ట్లైంది. కార్తీక మాసంలో అడ్డదారిలో దర్శనాలు చేయించి ఉద్యోగులు రూ. లక్షల్లో సొమ్ముచేసు కున్నారనే విమర్శలు లేకపోలేదు. అర్చకులను ప్రతి మూడు నెలలకు ఒకసారి విభాగాలను మార్చాల్సి ఉన్నా ఆదాయం వచ్చే విభాగాల్లో కొందర్ని అక్కడే నెలల తరబడి కొనసాగిస్తున్నారని సమాచారం. అలాగే ఓ ఇన్‌స్పెక్టర్ (ఆలయంలో పనిచేసే అధికారి బంధువు) పెద్దఎత్తున అవినీతి పాల్పడుతున్నట్లు సమాచారం. మహానంది క్షేత్రంలోని వివిధ ఆలయాలను అక్రమంగా వసూలు చేస్తున్నట్లు తెలిసింది. సిబ్బంది పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం.
రసీదులు ఇవ్వకుండా..
భక్తులు స్వామికి ఏదో రకమైన కాను కలు ఇస్తుంటారు. కానుకలు ఇచ్చిన వెంటనే తగిన రసీదు కూడా ఇవ్వాలి. ఫారెన్‌కు చెందిన ఇద్దరు(దంపతులు) 2020 సెప్టెం బరు నెలలో స్థానికులు ఇద్దరి సహాకారంతో వచ్చి స్వామివారిని దర్శించు కున్నా రు. ఆతర్వాత స్వామివారికి రెండు కేజీల వెండి(నాలుగు బిస్కెట్‌లు) కానుకగా అందజేశారు. ఇదే సమయంలో అప్పటి ఆలయం ఉన్నతాధికారి లేరని సాకుగా చెప్పివారికి తగిన రసీదు ఇవ్వలేదని తెలిసింది. ఇప్పటికి తగిన రసీదు ఫారెన్ వాళ్లకు కానీ వారిని పిలుచుకుని వచ్చిన స్థానికులకు(ఇద్దరు వ్యక్తులకు) కానీ ఇవ్వ లేదు. ఆ వెండిని మాయం చేశారనే ప్రచారం అప్పట్లో సాగింది. ఇటీవల అక్కడ పనిచేస్తున్న ఉద్యో గుల్లో లావాదేవీల విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈనేపథ్యంలో ఆ రెండు కేజీల వెండి విషయం మరోమారు బయటపడినట్లైంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా కనిపెట్టలేడ న్నట్లుగా మహానందిలో పరిస్థితి ఏర్పడింది.
ఏజెన్సీ నిర్వాహకుడికి చుక్కలు
మహానంది ఆలయంలో ఓఏజెన్సీ కింద 50మంది పనిచేస్తుంటారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి సదరు ఉద్యోగులను పలురకాలుగా బెది రించి క్యాష్ చేసుకోవడం ఇక్కడి నైజం. కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే అక్కడ పనిచేస్తున్న ఇద్దరు కీలక అధికారులు.. మండల నా యకుడితో కలిసి తమదైన శైలిలో సదరు ఏజెన్సీ నిర్వాహకుడికి చుక్కలు చూపించారు. ప్రజాప్రతినిధి పేరు చెప్పి మరీ భయపెట్టారని తెలిసింది. 20మంది ఉద్యోగులను ఉద్యోగం నుంచి తీసేస్తున్నామని చెప్పండి.. అని సదరు ఏజెన్సీ నిర్వాహకుడికి ఈముగ్గురు ఆదేశిస్తే.. సదరు నిర్వాహకుడు వారందర్ని తీసేస్తున్నామని చెప్పాడు. లేదంటే ఈ ముగ్గర్ని కలవాలని సలహా ఇచ్చారని తెలిసింది. దీంతో ఆ ఉద్యోగులు ఈ ముగ్గురిని కలిస్తే.. సదరు మండల నాయకుడి ద్వారా ఒక్కొక్కరి నుంచి రూ.30 నుంచి 50వేల వరకు తీసుకుని యఽథావిధిగా విధుల్లో కొనసాగించారని బాధిత వర్గాల నుంచి తెలిసింది. ఈ లెక్కన వారికి లక్షల్లో వారి జోబుల్లోకి వెళ్లినట్లైంది.
మండల నాయకుడు చెప్పింది జరగాల్సిందే..
మహానంది క్షేత్రంలో ఓ మండల నాయకుడు, ఇద్దరు అధికారులు వివిధ రూపాల్లో నెలకు రూ.లక్షలు ముడుపులు తీసుకుంటున్నట్లు సమాచారం. ఎవరైనా సదరు విషయాలపై ప్రశ్నించినా.. ఆరాతీసినా.. ఈ ముగ్గురు ఆ ప్రాంత ప్రజాప్రతినిధి పేరు చెప్పి తప్పించుకుంటున్నారనే ఆరోపణలు లేక పోలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆలయంలో సదరు మండల నాయకుడు ఏమీ చెప్పితే.. అదీ జరిగి తీరాల్సిందే.. లేకుంటే ఎంతటి వారైనా హడలెత్తాల్సిందే అనే ప్రచారం లేకపోలేదు. ఏది ఏమైనా నేడు ఆశాఖ మంత్రి సైతం స్పందించి ఇక్కడ జరిగే అక్రమాలపై ప్రత్యేక దృష్టిసారించి భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నెలవారీ మాముళ్లకు పాల్పడుతుంటే..
నిబంధనల ప్రకారం ప్రతి దుకాణం వద్ద ధరల పట్టికను ప్రదర్శించాలి. సదరు నిబంధనలు అమలుచేయాల్సిన బాధ్యత ఆలయ అధికారులదీ. కానీ.. కట్టడి చేయా ల్సిన అధికారులే నెలవారీ మాముళ్లకు పాల్పడుతుంటే ఏమాత్రం నియం త్రణ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆయా దుకాణాల నుంచి నెలకు రూ. లక్షకు పైగానే వసూళ్లు చేస్తున్నారని సమాచారం. ఇదే అదునుగా భావించి సదరు దుకాణాల యజమానులు సైతం వచ్చే భక్తులను అధిక ధరలతో బురిడి కొట్టిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ప్రైవేట్ లాడ్జీల నిర్వాహకులతో ఆలయంలో పనిచేసే కొందరు ఉద్యోగులు ఒప్పందం కుదుర్చుకుని నెలకు ఇంత అని...? టికెట్ లేకుండా అడ్డదారిలో పూజలు చేయించడం క్యాష్ చేసుకోవడం రోజువారీ దినచర్యగా ప్రచారం సాగుతోంది.
అడ్డదారిలో రికార్డుల్లో నమోదు
అక్కడ పనిచేస్తున్న కొందరు అర్చకులకు ఎలాంటి అర్హతలు లేకపోయినా.. పూర్వీకుల నుంచి తమ సంప్రదాయం కొనసాగిస్తున్నామని(వారసత్వపు హక్కు వచ్చే విధంగా) తగిన ఇద్దరి పేర్లను రికార్డుల్లో నమోదు చేశారని సమాచారం. ఈ వ్యవహారంలో ఆశాఖ ఉన్నతాధికారుల నుంచి ఇక్కడ పనిచేస్తున్న ఉన్నతాధికారులకు రూ.లక్షల్లో చేతులు మారాయనే ఆరోపణలు లేకపోలేదు. ఇక్కడి నుంచి బదిలీ అయిన ఓ ఉద్యోగికి రావాల్సిన పెండింగ్ ఏరియర్స్, తదితర వాటిని మంజూరు చేయడానికి కొందరు అధికారులు రూ. లక్షల్లో తీసుకున్నారని సమాచారం.
Updated Date - Jun 09 , 2025 | 12:36 AM