బడుల్లో మెగా జాతర
ABN, Publish Date - Jul 10 , 2025 | 11:56 PM
జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ పండుగ వాతావరణాన్ని తలపించింది.
పాఠశాలల్లో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్
నంద్యాలలో పాల్గొన్న మంత్రి ఫరూక్
కొలిమిగుండ్లలో హాజరైన మంత్రి బీసీ
నంద్యాల ఎడ్యుకేషన్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ పండుగ వాతావరణాన్ని తలపించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరు కావడంతో జాతర వాతావరణాన్ని తలపించాయి. కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు వారం రోజుల నుంచి శ్రమించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, బంధువులు, పూర్వ విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొని ఆటల పోటీలు, మ్యూజికల్ చైర్స్, ముగ్గుల పోటీలతో పాటు విద్యాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. అత్యధిక మార్కులు సాధించి షైనింగ్ స్టార్స్ అవార్డుకు ఎంపికైన విద్యార్థులను సత్కరించారు. అలాగే విద్యార్థులు, వారి తల్లికి మొక్కలను అందజేసి పెంచే బాధ్యతను అప్పగించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులతో కలసి అందరూ సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. నంద్యాల ప్రభుత్వ బాలికల పాఠశాలలో రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడే విద్యార్థులతో కలసి మంత్రి భోజనం చేశారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన జాహేదా, ముస్కాన్‌లను మంత్రి సత్కరించారు. అదేవిధంగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి కొలిమిగుండ్ల మండలంలోని జడ్పీ హైస్కూల్‌లో పాల్గొన్నారు. పాఠశాల భవనాలు, తరగతి గదులను పరిశీలించారు. ఇదిలా ఉండగా నంద్యాల పాఠశాలలో పలువురు తల్లిదండ్రులు, విద్యార్థులు తమ సంతోషాన్ని సమావేశంలో వ్యక్తపరిచారు.
చాలా సంతోషంగా ఉంది
నేను ప్రభుత్వ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. బడి తెరిచి రోజునే మాకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్‌లను కూడా అందజేశారు. అమ్మానాన్నలతో కలిసి ఇలాంటి మీటింగ్ ఎప్పుడూ జరుగలేదు. పండుగలా జరుపుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది.
సునయన, 9వ తరగతి విద్యార్థిని
మా ఇంట్లో ముగ్గురికి ‘తల్లికి వందనం’
మాది పేద కుటుంబం. మా ముగ్గురు పిల్లలకు ‘తల్లికి వందనం’ ద్వారా రూ.36వేల డబ్బులు నా ఖాతాలో జమ అయ్యాయి. ఒక్కసారిగా అంత సహాయం అందుతుందని ఎప్పుడూ ఊహించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, మంత్రి నారాలోకేశ్‌కు రుణపడి ఉంటాం. పిల్లల ప్రభుత్వ పాఠశాలల్లో బాగా చదువుతున్నారు. అందరం సంతోషంగా ఉన్నాం.
రేష్మా, నంద్యాల పట్టణం
ఎంతో ఆత్మీయంగా ఉంది.
పిల్లలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అతిధులతో కలిసి ఏర్పాటు చేసిన ఈ సమావేశం ఎంతో ఆత్మీయంగా ఉంది. ఇలాంటి సమావేశంలో సాధారణంగా ప్రైవేట్ పాఠశాలల్లో ఉండేవి. కాని ప్రభుత్వ పాఠశాలలో నిధులకు ఏ మాత్రం లెక్కచేయకుండా పండుగ వాతావరణంలా నిర్వహించడం గర్వకారణంగా ఉంది. ఇలాంటి సమావేశాలతో విద్యార్థులకు వారి తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల మధ్య అన్యోన్యతాభావం ఏర్పడుతుంది. పిల్లల సమస్యలను, వారి అలవాట్లపై తల్లిదండ్రులతో చర్చించే అవకాశం ఉంటుంది.
పద్మావతి, ఉపాధ్యాయురాలు, నంద్యాల
Updated Date - Jul 10 , 2025 | 11:56 PM