మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు
ABN, Publish Date - Apr 25 , 2025 | 11:55 PM
జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి. రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ పి. రంజిత్ బాషా
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి. రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నార్కొటిక్స్ కోఆర్డినేటషన్ (ఎన్‌సీవోఆర్‌డీ) సమావేశాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి నిర్వహించారు. గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల వాడకం, నియంత్రణ చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి పాఠశాలలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, ర్యాలీలు, ప్రతిజ్ఞల ద్వారా విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని డీఈవోను ఆదేశించారు.
ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం, గంజాయి సాగు అమ్మకం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎద్దులకు తినిపిస్తే బలమని మిరప పంట మధ్యలో గంజాయి సాగు చేస్తున్నారని తెలిసిందని, వ్యవసాయ శాఖ అధికారులు గంజాయి సాగు చట్టపరంగా నేరమనే విషయం పూర్తిగా అర్థమయ్యేలా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి సూచించారు. కర్నూలు, ఆదోని ఎమ్మిగనూరు పట్టణ ప్రాంతాల శివారులో ముళ్లపొదలు, పాడుపడిన భవనాలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, వీధి లైట్లు వేయించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నాసరరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, డీటీసీ శాంతకుమారి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ కుమార్, డీఎంహెచ్‌వో శాంతికళ, డీఈవో శామ్యూల్ పాల్, ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 25 , 2025 | 11:55 PM