బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దండి: కలెక్టర్
ABN, Publish Date - May 24 , 2025 | 11:37 PM
జిల్లాను బహిరంగ మల విసర్జన రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
నంద్యాల నూనెపల్లె, మే 24(ఆంధ్రజ్యోతి): జిల్లాను బహిరంగ మల విసర్జన రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ చాంబర్‌లో బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలు, పారిశుధ్యంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఓడీఎఫ్ ప్లస్ కింద చేపట్టి పెండింగ్‌లో ఉన్న 62గ్రామాలను బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగంపై సర్వే చేసి వాటి వినియోగానికి చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో ట్యాంకుల పరిశుభ్రత, క్లోరినేషన్ చేసిన తాగునీటి సరఫరా, చెత్తనుంచి సంపద తయారీ కేంద్రాలపై సమీక్షించి ఎప్పటికప్పుడు పీఆర్-1యాప్‌లో నమోదు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతినెలా 3వ శనివారం చేపట్టే స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములు చేయాలని, పరిశుభ్రత కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, డీపీవో శివారెడ్డి, డీపీఆర్సీ కో ఆర్డినేటర్ మంజులవాణి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో గిరిజనులకు దర్తి అభజన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ -2025 పథకాన్ని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ రాజకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ గిరిజనులకు అందేవిధంగా ఆయాశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. జూన్ 15నుంచి 30వరకు జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
Updated Date - May 24 , 2025 | 11:37 PM