కార్యదర్శుల జీవితాల్లో వెలుగులు
ABN, Publish Date - May 11 , 2025 | 11:26 PM
పంచాయతీ కార్యదర్శుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
పంచాయతీరాజ్‌లో ప్రక్షాళన
సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం
గ్రేడ్లను బట్టి హోదాలు
గాడి తప్పిన పాలన పట్టాలెక్కేనా?
మొండిచేయి చూపిన గత ప్రభుత్వం
కర్నూలు కలెక్టరేట్, మే 11 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ కార్యదర్శుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అస్తవ్యస్తంగా ఉన్న పంచాయతీ రాజ్ శాఖను ప్రక్షాళన చేయనుంది. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శుల్లో ఆరు గ్రేడ్ల వ్యవస్థ ఉండటంతో అటు పదోన్నతులు లభించక.. ఇటు తక్కువ స్కేల్ జీతంతో కాలం వెల్లదీస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4 జీతభత్యాలు, జూనియర్ అసిస్టెంట్ హోదాకు సమానం. కానీ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-3 జీతభత్యాలు సీనియర్ అసిస్టెంట్‌కు సమానం కాదు. సాధారణంగా గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శి జీతభత్యాలు పరిపాలన అధికారి కొలువుతో సమానంగా ఉండాలి. గెజిటెడ్ హోదా కూడా ఉండాలి. ఇక గ్రేడ్- 5, 6 పంచాయతీ కార్యదర్శి జీతభత్యాలు రికార్డు అసిస్టెంట్‌స్థాయిలో ఉండటం మరీ దారుణం. గత ప్రభుత్వం వీరిని దాదాపు మూడేళ్ల పాటు ప్రొబేషన్‌లో ఉంచి కేవలం రూ.15వేలు జీతమిచ్చి వారి జీవితాలతో ఆటాడుకుంది. వీరికి మూడు నోషనల్ ఇంక్రిమెంట్లు చెల్లించకుండా మొండిచేయి చూపింది. దీంతో అనేక సంవత్సరాలుగా చాలీచాలని జీతభత్యాలతో వారు సతమతమవుతున్నారు.
నాలుగు గ్రేడ్లుగా కుదింపు
ప్రస్తుతం ఉన్న ఆరు గ్రేడ్ల వ్యవస్థను నాలుగు గ్రేడ్లుగా కుదించాలని ప్రభు త్వం సంకల్పించింది. పదివేల జనాభా పైబడి కోటి రూపాయల సంవత్సర ఆదాయం కలిగిన పంచాయతీలలో ఇకమీదట స్పెషల్ గ్రేడ్ పంచాయతీ కార్యదర్శి ఉంటారు. వీరు డిప్యూటీ ఎంపీడీవో హోదాకు సమాన స్థాయిని కలిగి ఉంటారు. 4000 నుంచి 10వేల జనాభా కలిగి రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు ఆదాయం ఉన్న మండల కేంద్ర గ్రామ పంచాయతీలకు గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శి నాయకత్వం వహిస్తారు. ఇక 2వేల నుంచి 4వేల జనాభా కలిగిన గ్రామ పంచాయతీలకు గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శిని నియమిస్తారు. 2000లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శులకు అప్పగిస్తారు.
16వ తేదీలోపు నివేదిక
ఈ ప్రతిపాదనలపై ఈ నెల 13న డిప్యూటీ ఎంపీడీవోలతో, డివిజినల్ పంచాయతీ అధికారులతో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 16వ తేదీలోగా కలెక్టర్లు తమ పరిశీలనకు వచ్చిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నారు. పంచాయతీ కార్యదర్శులు తమ జీతభత్యాలను సెకండరీ గ్రేడ్ టీచర్ స్థాయికి తక్కువ కాకుండా నిర్ణయించాలని అభ్యర్థిస్తున్నారు. సాధారణంగా ప్రతి కార్యాలయంలో జూనియర్, సీనియర్ గుమస్తాలు, పరిపాలన అధికారులు ఉంటారు. వారి వేతన స్కేళ్లకు అనుగుణంగా పంచాయతీ కార్యదర్శులకు మూడు గ్రేడ్లు ఏర్పరిచి జీతభత్యాలు నిర్దేశించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం కూడా వారి వేతన స్కేళ్లను సవరించేందుకు కసరత్తు చేస్తోంది. గాడి తప్పిన గ్రామ పంచాయతీ పరిపాలన ఈ నిర్ణయాలతో తిరిగి పట్టాలెక్కుతుందని భావిస్తున్నారు.
Updated Date - May 11 , 2025 | 11:26 PM