నెరవేరిన కర్నూలు జిల్లా వాసుల కల
ABN, Publish Date - Jul 03 , 2025 | 12:58 AM
ఎన్నో ఏళ్ల నుంచి జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న విజయవాడకు విమాన సర్వీసు కల ఎట్టకేలకు నెరవేరింది. బుధవారం విజయవాడ-కర్నూలు -విజయవాడ విమాన సర్వీసును ప్రజాప్రతినిధులు లాంఛనంగా ప్రారంభించారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులను పౌరవిమా నయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
విజయవాడ- కర్నూలు విమాన సర్వీసు ప్రారంభం
ఓర్వకల్లు, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్ల నుంచి జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న విజయవాడకు విమాన సర్వీసు కల ఎట్టకేలకు నెరవేరింది. బుధవారం విజయవాడ-కర్నూలు -విజయవాడ విమాన సర్వీసును ప్రజాప్రతినిధులు లాంఛనంగా ప్రారంభించారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులను పౌరవిమా నయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీలు బైరెడ్డి శబరి, బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఇన్‌చార్జి కలెక్టర్ బి.నవ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్ విధానంలో మాట్లాడుతూ కర్నూలు, విజయవాడకు కనెక్టివిటీ అవడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. ఇప్పుడు ఈ విమాన సౌకర్యం అనంతపురం జిల్లా ప్రజలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం కర్నూలు నుంచి మూడు రోజులు విమానం నడిచేలా ప్రారంభించామని, త్వరలో ఏడు
రోజులకు పెంచేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు- విజయవాడ ఫ్లైట్‌ను ప్రారంభించిన ఇండిగో సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. తాను నిర్మించిన ఎయిర్ పోర్టులో పాలుపంచు కోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు టూ విజయవాడ విమాన సర్వీసులు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు కృషి వల్ల ఇది సాధ్యమైందన్నారు. ఈ సర్వీసులు ప్రారంభించడంపై అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. చాలా మంది పారిశ్రామికవేత్తలు తరచుగా ప్రయాణించాల్సిన అవసరం ఉంటుందని, అందువల్ల ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో నైట్ ల్యాండింగ్ ఏర్పాటుకు కూడా కృషి చేయాలని కేంద్రమంత్రిని విజ్ఞప్తి చేశారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి మాట్లాడుతూ కర్నూలు, విజయవాడ విమానసర్వీసులు ప్రారంభించడం సంతోషంగా ఉందని, ఇదంతా సీఎం చంద్రబాబు కృషి అన్నారు. అనంతరం భీమప్ప పూజారి అనే ప్యాసింజర్‌కు మొదటి టికెట్‌ను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఇన్‌చార్జి కలెక్టర్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ విద్యాసాగర్, ఇండిగో కంపెనీ రీజనల్ హెడ్ ఆఫ్ సెక్యూరిటీ జిబ్జూన్, అసిస్టెంట్ మేనేజర్ కౌశల్, డివిజనల్ మేనేజర్ ప్రశాంత్, రీజనల్ మేనేజర్ శెట్టి, జాన్సన్ జార్జ్, తహసీల్దార్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు 40 మందితో..
విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి తొలి ఇండిగో విమాన సర్వీసు 40మంది ప్రయాణీకులతో సాయంత్రం 4:50 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు రన్‌వేపై విజయవంతంగా ల్యాండ్ అయింది. తొలి సర్వీసు విమానానికి ఎయిర్‌పోర్ట్‌లో రెండు అత్యాధునిక ఫైరింజన్ల వాటర్ క్యానన్స్‌తో ఘన స్వాగతం లభించింది. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రయాణికుల చప్పట్లు, కేరింతలతో విమానాశ్రయ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. తిరిగి 40 మంది ప్రయాణీకులతో సాయంత్రం 5:10 గంటలకు విజయవాడకు విమానం తిరుగు ప్రయాణమైంది.
సొంత మండలంలో విమానం దిగాను
విజయవాడ నుంచి సొంత మండలమైన ఓర్వకల్లుకు విమానంలో ప్రయాణించడం నా జీవితంలో మధురానుభూతిగా నిలిచిపోతుంది. కేంద్రంతో మాట్లాడి విమాన సర్వీసులకు కృషి చేసిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. - నర్ల మోహన్‌రెడ్డి, గుట్టపాడు సర్పంచు
50 నిమిషాల్లో ఓర్వకల్లుకు చేరుకున్నాం
విజయవాడ నుంచి ఓర్వకల్లు విమానాశ్రయానికి కేవలం 50 నిమిషాల్లోనే చేరుకున్నాం. ఇది వరకు బస్సు ప్రయాణం 8 గంటలు, రైలు ప్రయాణం 10 గంటలు సమయం పట్టేది. ఈ సర్వీసుతో గంట లోపే విజయవాడకు చేరుకునే అవకాశం లభించింది. - అయ్యస్వాములు, టీడీపీ నాయకుడు
సుదూర ప్రయాణం సులువైంది
ఓర్వకల్లు నుంచి విజయవాడకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభమ వడంతో జిల్లావాసులు అతి తక్కువ సమయంలోనే ప్రయాణించే అవకాశం లభించింది. ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిలో భాగంగా ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక వేత్తల రాకపోకలకు ఈ కొత్త సర్వీసు ఎంతో ఉపయోగకరం. మొదటి ఫ్లైట్‌లో విజయవాడ నుంచి ఓర్వకల్లుకు ప్రయాణించడం ఆనందంగా ఉంది. - శ్రీరాములు, విద్యార్థి సంఘం నాయకుడు
Updated Date - Jul 03 , 2025 | 12:58 AM