మోక్షం లభించేనా..?
ABN, Publish Date - May 13 , 2025 | 11:58 PM
తెలుగు రాష్ట్రాల ప్రాణనాడి శ్రీశైలం డ్యాం మరమ్మతులకు మోక్షం లభించనుంది.
2009 వరదలకు భారీగా దెబ్బతిన్న శ్రీశైలం డ్యాం
ప్రాజెక్టు భద్రతపై నివేదికలు
ఐదేళ్లలో 13 సార్లు ప్రతిపాదనలు
వైసీపీ హయాంలో నిర్లక్ష్యం
తక్షణ మరమ్మతులకు రూ.34 కోట్లు అవసరం
సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించడంతో ఆశలు
తెలుగు రాష్ట్రాల ప్రాణనాడి శ్రీశైలం డ్యాం మరమ్మతులకు మోక్షం లభించనుంది. ప్రాజెక్టు దుస్థితిపై సీరియస్ కావడమే కాకుండా, మరమ్మతులకు అవసరమైన నిధులు అంచనాలు తక్షణమే తయారు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో ఆశలు చిగురిస్తున్నాయి. 2009లో డ్యాంకు పోటెత్తిన వరదలకు ప్రాజెక్టు భారీగా దెబ్బతింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి నిపుణుల కమిటీలు మరమ్మతులు, ప్రమాదకరంగా మారిన ప్లంజ్ ఫూల్‌పై అధ్యయనం కోసం పలు సూచనలు చేస్తూ నివేదికలు ఇచ్చాయి. ఐదేళ్లలో ప్రాజెక్టు ఇంజనీర్లు దాదాపు 13 సార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గత వైసీపీ హయాంలో నిర్లక్ష్యం శ్రీశైలం డ్యాంకు శాపంగా మారింది. తాజాగా డ్యాంను పరిశీలించిన జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) చైర్మన్ అనిల్ జైన్ డ్యాంను పరిశీలించారు. భద్రత లోపాలపై ప్రభుత్వానికి లేఖ రాశారు. ‘ఆర్థిక శాఖతోనే అసలు పేచీ’ శీర్షికన అంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. సీఎం చంద్రబాబు స్పందిం చారు. ఎట్టకేలకు మరమ్మతులకు నిధు లు వచ్చే అవకాశం ఉందని రైతులు, ఇంజనీర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
కర్నూలు, మే 13 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం డ్యాం.. బహుళార్ధక సాధక ప్రాజెక్టు. తెలుగు రాష్ట్రాలకు జీవనాడి. ముఖ్యంగా నిత్యం కరువుతో తల్లడిల్లే రాయలసీమ పల్లెసీమలకు ప్రాణదాయిని ఈ ప్రాజెక్టు. శ్రీశైలం దేవస్థానం పాతాళగంగ వద్ద కృష్ణా నదిపై ‘శ్రీశైలం ప్రాజెక్టు’ నిర్మాణానికి 1963 జూలై 24న అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రు పునాది రాయి వేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి 20 ఏళ్లు పట్టింది. డ్యాం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 308.04 టీఎంసీలు. వరద ప్రవాహ సామర్థ్యం (ప్లడ్ వాటర్ డిశ్చార్జ్ కెపాసిటీ) 13.20 లక్షల క్యూసెక్కులు. డ్యాం ఏటేటా పూడిక చేరడంతో.. 2011లో వరద లెక్కలు పరిశీలించి గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలుగా నిర్థారించారు. అంటే 92.24 టీఎంసీలు పూడిక చేరింది. 12 రేడియల్ క్రస్ట్ గేట్లు స్పిల్‌వే నుంచి వరద జలాలు కిందకు పడి మళ్లీ పైకెగిరి నదిలో పడే ప్లంజ్‌పూల్ ప్రాంతంలో ఏర్పడిన భారీ గుంత డ్యాం పునాదులపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. 2009 అక్టోబరులో 25.5 లక్షల క్యూసెక్కుల వరద చేరడంతో ప్రాజెక్టు కూడా దెబ్బతింది. 2014 సెప్టెంబరు 23న ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ శ్రీశైలం సహా వివిధ ప్రధాన ప్రాజెక్టుల భద్ర త, నిర్వహణ లోపాలపై సమీక్షించింది. ఆ సమయంలో శ్రీశైలం డ్యాం భద్రతపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు.
డ్యాంను పరిశీలించిన నిపుణుల కమిటీలు
2014 సెప్టెంబరు 23 తర్వాత పలు నిపుణుల కమిటీలు శ్రీశైలం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భద్రతాలోపాలు, 2009 వరదలకు దెబ్బతిన్న డ్యాం మరమ్మతులపై పలు సూచనలతో నివేదికలు ఇచ్చారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆదేశాల మేరకు 2014 అక్టోబరులో అప్పటి ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు చైర్మన్, కన్వీనర్ మెంబరు కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ విశ్వేశ్వరరావు, సీడబ్ల్యుసీ హైడ్రాలజీ విభాగం డైరెక్టర్ భూపాల్‌సింగ్, ప్రాజెక్టు డిజైన్ డైరెక్టర్ ఎస్‌కే సిబాల్, ఫౌండేషన్ ఇంజినీరింగ్ డైరెక్టర్ వీఆర్‌కే పిల్లై, సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ (సీడీఓ) సీఈ గిరిధర్‌రెడ్డి, రిటైర్డ్ సీఈ కేవీ సుబ్బరావు, తెలంగాణ క్వాలిటీ కంట్రోల్ సీఈ ఎం.కృష్ణారావు సభ్యుల కమిటీ 2014 అక్టోబర్ 28న ప్రాజెక్టును తొలిసారిగా పరిశీలించారు. 2017 జూలై 13న కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ డాక్టర్ వైకే మూర్తి నేతృత్వంలోని నిపుణుల కమిటీ, 2018 జూన్ 11న జలవనరుల శాఖ రిటైర్డ్ ఈఎన్‌సీ పి.రామరాజు, రిటైర్డ్ సీఈ కె.సత్యనారాయణ, రిటైర్డ్ ఈఈ కె.కృష్ణ కమిటీ ఈ ప్రాజెక్టును పరిశీలించి డ్యాం భద్రత, ప్లంజ్‌పూల్ మరమ్మతులకు పలు సూచనలు చేస్తూ నివేదికలు ఇచ్చాయి. 2020 ఫిబ్రవరి 25న కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్, డ్యాం భద్రతా నిపుణులు ఏబీ పాండ్యా చైర్మన్‌గా కేంద్ర నిపుణుల కమిటీ డ్యాంను పరిశీలించడమే కాకుండా.. వివిధ నిపుణుల కమిటీలు ఇచ్చిన అధ్యయన నివేదికలు స్టడీ చేసి డ్యాం భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేస్తూ 2021లో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)కు నివేదిక ఇచ్చారు. ఆ తరువాత నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) చైర్మన్ వివేక్ త్రిపాటి ఆధ్వర్యంలో నిపుణుల బృందం పరిశీలించింది.
వైపీసీ హయాంలో అంతులేని నిర్లక్ష్యం!
ప్రాజెక్టు ఆనకట్ట స్పిల్‌వే గేట్ల నుంచి అతివేగంగా కింద పడే వరద మళ్లీ ఎగిరి పడే ప్రాంతం (ప్లంజ్‌పూల్)లో భారీ గుంత ఏర్పడింది. దీని లోతు 45 మీటర్లు, వెడల్పు 270 మీటర్లు, పొడవు 400 మీటర్లు ఉంటుందని అంచనా వేశారు. డ్యాం డౌన్ స్ట్రీమ్‌లో ఆప్రాన్‌కు వెళ్లాలంటే 3-4 కిలోమీటర్లు అప్రోచ్ రోడ్డు కీలకం. 2009 వరదలకు అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయి ఆనవాళ్లే లేకుండా పోయాయి. రిటైనింగ్ వాల్ 2.50 కిలోమీటర్లు ఉంటే.. 600 మీటర్లు పూర్తిగా కొట్టుకు పోయింది. డ్యాం ఇంటర్మీడియట్ లెవల్ గ్యాలరీలు లీకేజీలు, ముఖ్యం గా స్టీల్ సిలెండర్లకు రంద్రాలకు తక్షణ మరమ్మతులు చేయాల్సి ఉంది. ప్రమాకరంగా మారిన ప్లంజ్‌పూల్ గుంత పూడ్చివేతకు ఎలాంటి ఆధునిక పద్దతులు చేపట్టాలో ఆధ్యాయనం కోసం పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్)ను గుర్తిం చారు. ఈ సంస్థకు అడ్వాన్స్‌గా తక్షణం రూ.50 లక్షలు చెల్లించాలి. ఆయా పనుల కోసం డివిడెండ్ రీన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (డ్రిప్-2) గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.135 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకురావడంలో గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. తాజాగా ఆ ప్రతిపాదనలు రూ.203 కోట్లకుపైగా చేరాయి. అయితే డ్యాంను పరిశీలించిన ప్రపంచ బ్యాంక్ బృందం అత్యవసరం పనులకు ప్రతిపాదనలు పంపమంటే రూ.108 కోట్లకు పంపారు. ప్రపంచ బ్యాంక్ ఒప్పుకున్నా.. ప్రభుత్వం వద్ద పెండింగులో ఉంది. నాడు వైసీపీ ప్రభుత్వం, తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చాక మొత్తం 13 సార్లు ప్రతిపాదనలు పంపినా స్పందించలేదని తెలుస్తుంది.
తక్షణం రూ.34 కోట్లు కావాలి
డ్యాం డౌన్ స్ట్రీమ్‌లో ఆప్రాన్‌కు వెళ్లాలంటే అప్రోచ్ రోడ్డు, కుడి, ఎడమ గట్లు స్లిప్ కాకుండా మరమ్మతులు.. వంటి వివిధ పనులకు తక్షణం రూ.34 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అలాగే.. ఫ్లంజ్‌పూల్ అధ్యయనం కోసం సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌కు రూ.50 లక్షలు అడ్వాన్స్ చెల్లించాలని ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఫలితంగా మరమ్మతులు ప్రశ్నార్థకంగా మారా యి. ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్ అనిల్ జైన్ లేఖతో రాయడం, ఆ అంశాలను ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. సీఎం చంద్రబాబు స్పందించడమే కాకుండా మరమ్మతులకు అంచనాలు తయారు చేయ మని ఆదేశాలు జారీ చేయడంతో మరమ్మతులపై ఆశలు చిగురిస్తున్నాయి.
నిధులు రాగానే మరమ్మతులు చేపడుతాం
శ్రీశైలం ప్రాజెక్టు తక్షణ మరమ్మతులకు రూ.34 కోట్లు, ఫ్లంజ్ పూల్ అధ్యయనం కోసం రూ.50లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు రాగానే మరమ్మతులు చేపడుతాం. అప్రోచ్ రోడ్డు, కుడి, ఎడమ గట్లు స్లోప్స్ మరమ్మతులు తక్షణ చేపట్టాల్సిన అవసరం ఉంది.
- కబీర్‌బాషా, సీఈ, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్, కర్నూలు.
Updated Date - May 13 , 2025 | 11:58 PM