అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠా అరెస్టు
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:10 AM
రాత్రి వేళల్లో పెట్రోల్ బంకుల వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీల్లో డీజిల్‌ను దొంగిలిస్తున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను ఆదోని పోలీసులు బుధవారం పట్టుకున్నారు.
రూ.10లక్షలు, నాలుగు కార్లు స్వాధీనం
11 మంది అరెస్టు
నిందితులందరిదీ తెలంగాణ రాష్ట్రం
వివరాలు వెల్లడించిన డీఎస్పీ హేమలత
ఆదోని, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): రాత్రి వేళల్లో పెట్రోల్ బంకుల వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీల్లో డీజిల్‌ను దొంగిలిస్తున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను ఆదోని పోలీసులు బుధవారం పట్టుకున్నారు. డీఎస్పీ హేమలత, వన్ టౌన్ సీఐ శ్రీరామ్, టూటౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు.
పట్టణానికి చెందిన మైల రామకృష్ణ, సర్దార్ బాషా, సయ్యద్ సమీర్ డీజిల్ దొంగతనాలు చేస్తున్నారంటూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో 2025 ఏప్రిల్ 8వ తేదీన ఫిర్యాదు చేశారు. నిలబెట్టిన లారీల డీజిల్ ట్యాంకు నుంచి వందల లీటర్లు, డీజిల్‌ను దొంగిలిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. ఆదోని వన్‌టౌన్‌లలో నాలుగు కేసులు, ఆదోని టూటౌన్‌లో ఒకటి ఆలూరులో ఒక కేసు నమోదయింది. ఫిర్యాదు స్వీకరించిన వన్‌టౌన్ సీఐ శ్రీరామ్ డీజల్ దొంగలపై ప్రత్యేక నిఘా ఉంచి తనదైన శైలిలో దర్యాప్తును వేగవంతం చేశారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జల్లాకు చెందిన రమేష్ నాయక్ అలియాస్ చోటా నాయక్, దేగావత్ పాండు నాయక్, దేగావత్ పాపా నాయక్, దేగావత్ రవి నాయక్, దేగావత్ మహేష్ నాయక్, సభావాత్ కిషన్ నాయక్, పాల్తీయ రవి నాయక్, సభావత్ రవి నాయక్, చవాన్ సురేష్ నాయక్, కృష్ణా నాయక్, మహబూబ్ మండలానికి చెందిన రామావత్ రవికుమార్ రాథోడ్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి దగ్గర నుంచి రూ.10.30లక్షల నగదును 350 లీటర్ల డీజీల్, నాలుగు ఫోర్‌వీలర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని చెప్పారు.
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండ లానికి చెందిన బజారా మహేష్ నాయక్, వర్తియా రవి నాయక్,లులో భాస్కర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఎనిమిదేళ్ల నుంచి ఈ ముఠా డీజల్ దొంగతనాలు చేస్తూ జల్సాలు చేస్తున్నారని తెలిపారు. సీసీ పుటేజీల ద్వారా చిన్న క్లూ దొరికిందని, తీగ లాగితే దొంగ కదలినట్లు పెద్ద ముఠానే దొరికిందన్నారు. వారిని పట్టుకుని విచారించగా డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్నామని అంగీకరించారన్నారు. దీంతో వారి నుంచి రూ.10.30 లక్షలతో పాటు 350 లీటర్ల డీజిల్, 10 ఖాళీ క్యాన్లను, వాహనాలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ హేమలత తెలిపారు. సీఐ శ్రీరామ్, సిబ్బందిని అభినందిం చారు. ఎస్పీ చేతులమీదుగా రివార్డు అందజేసేందుకు సిఫారసు చేస్తానని డీఎస్పీ అన్నారు.
Updated Date - Apr 17 , 2025 | 12:10 AM