మహానుభావులకు పెద్దపీట
ABN, Publish Date - Jun 14 , 2025 | 01:35 AM
: గత వైసీపీ హయాంలో వివిధ పథకాలపై ఏర్పాటు చేసిన బొమ్మలకు కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు ముగింపు పలికింది.
డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పేరుతో స్టూడెంట్ కిట్
హర్షం వ్యక్తం చేస్తున్న విద్యావేత్తలు, మేధావులు, ప్రజాసంఘాలు
కొలిమిగుండ్ల, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ హయాంలో వివిధ పథకాలపై ఏర్పాటు చేసిన బొమ్మలకు కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు ముగింపు పలికింది. మహానుభావుల పేర్లకు పెద్దపీట వేసింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా పథకం పేరు నుంచి లోగో వరకు అత్యంత పారదర్శకంగా అందరికీ ఆమోదయోగ్యంగా రూపొందించడాన్ని విద్యావేత్తలు, మేధావులు అభినందిస్తున్నారు. ఇప్పటికే మధ్యాహ్న బోజన పథకానికి డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ సూచనమేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పేరుతో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు. విద్యార్థులకు అందించే విద్యామిత్ర కిట్‌కు మహాపండితుడు, గొప్ప విద్యావేత్త, భారత రెండవ రాష్ట్రపతి, ఉపాధ్యాయుల ఆరాధ్య దైవం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్రగా నామకరణం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న స్కూల్ బ్యాగులు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, డిక్షనరీలు, సమ దుస్తులు, బూట్లు, బెల్టులు, ఇలా అన్నింటిపైనా సర్వేపల్లి రాధాకష్ణన్ విద్యామిత్ర పేరు, ప్రభుత్వ లోగో తప్ప మరే ఇతర బొమ్మలు లేకుండా చేశారు. జూన్-12న పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, యునిఫాం పంపిణీ చేసి, విద్యార్థులు అసౌకర్యానికి గురి కాకుండా చర్యలు చేపట్టారు.
నంద్యాల జిల్లాలో 1171 ప్రాథమిక పాఠశాలలు, 298 ప్రాథమికోన్నత పాఠశాలలు, 490 ఉన్నత పాఠశాలలు ఉండగా, ఇందులో 3,14,110 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 90శాతం విద్యార్థులకు ఇప్పటికే పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Jun 14 , 2025 | 01:35 AM